కార్తికంలో కమ్మటి ప్రసాదాలు

ఈరోజు కార్తిక పౌర్ణమి. చాలా విశిష్టమైన రోజు. దీపాలు వెలిగించి, ఉపవాసం ఉంటారు. అన్నానికి బదులుగా.. నైవేద్యంగా సమర్పించినవే ప్రసాదంగా సేవిస్తారు.

Updated : 26 Nov 2023 03:29 IST

ఈరోజు కార్తిక పౌర్ణమి. చాలా విశిష్టమైన రోజు. దీపాలు వెలిగించి, ఉపవాసం ఉంటారు. అన్నానికి బదులుగా.. నైవేద్యంగా సమర్పించినవే ప్రసాదంగా సేవిస్తారు. ఎప్పుడూ చేసే పాయసం, పులిహోరకు బదులు ఈసారి ఈ ప్రత్యేక పదార్థాలు నివేదించి చూడండి.


చిలకడదుంప కట్లెట్‌

కావలసినవిచిలకడదుంపలు - 3, ఉప్పు - పావు చెంచా, కొత్తిమీర తరుగు - చారెడు, మొక్కజొన్న పిండి - 3 చెంచాలు, పచ్చిమిర్చి - 2, నిమ్మరసం, కారం, అల్లం తరుగు - చెంచా చొప్పున, జీలకర్ర పొడి, గరం మసాలా, ఛాట్‌ మసాలా - అర చెంచా చొప్పున, నూనె - 2 చెంచాలు

తయారీ: చిలకడదుంపలు ఉడికించి, పొట్టు తీసి మెత్తగా మెదపాలి. అందులో మొక్కజొన్న పిండి, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం, ఉప్పు, అల్లం తరుగు, జీలకర్ర పొడి, గరం మసాలా, ఛాట్‌ మసాలా, కారం.. అన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా తీసుకుని చేత్తో చిన్నగా ఒత్తుకోవాలి. కడాయిలో కాస్త నూనె వేసి.. బంగారు రంగు వచ్చే దాకా వేయించుకోవాలి. అంతే ఘుమఘుమలాడే చిలకడదుంప కట్లెట్లు సిద్ధం.


గుజియా

కావలసినవి : కండెన్స్‌డ్‌ మిల్క్‌ - పావు కిలో, మైదాపిండి, ఉప్మా రవ్వ - అర కప్పు చొప్పున, కొబ్బరి తురుము - కప్పు, నెయ్యి - 2 చెంచాలు, జీడిపప్పు, బాదం పలుకులు, కిస్‌మిస్‌- అన్నీ కలిపి అర కప్పు, యాలకుల పొడి - పావు చెంచా, నూనె - వేయించేందుకు సరిపడా

తయారీ : ముందుగా రవ్వను నేతిలో వేయించాలి. అది దోరగా వేగాక.. కొబ్బరి తురుము, జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌, యాలకుల పొడి వేసి కాస్త వేయించాలి. ఒక నిమిషం తర్వాత అందులో కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి.. కలియ తిప్పుతుండాలి. దగ్గరగా అయ్యాక దించేయాలి. ఒక పాత్రలో మైదాపిండి, కాస్త నూనె, కొన్ని నీళ్లు వేసి కలిపి.. శుభ్రమైన వస్త్రం చుట్టి, ఓ పావుగంట పక్కనుంచాలి. తర్వాత ఈ పిండిని చిన్న ఉండలుగా తీసుకుని చపాతీల్లా చేసుకోవాలి. వాటి మధ్యలో నిమ్మకాయంత కొబ్బరి మిశ్రమాన్ని ఉంచి, మధ్యలోకి మడవాలి. అంచులకు రెండు చుక్కల నీళ్ల తడి రాస్తే విడిపోకుండా తేలిగ్గా అతుక్కుంటాయి. చివర్లలో ఫోర్క్‌తో నొక్కి కాగుతున్న నూనెలో వేయిస్తే సరిపోతుంది. తియ్యటి ఈ గుజియాలు శక్తినీ ఇస్తాయి.


పాల్‌పోలీ

కావలసినవి : గోధుమపిండి 3 కప్పులు, పాలు - మూడున్నర కప్పులు, ఉప్మా రవ్వ - అర కప్పు, యాలకుల పొడి, కుంకుమ పువ్వు - పావు చెంచా చొప్పున, పంచదార - పావు కప్పు, నూనె - వేయించేందుకు సరిపడా, బాదం పలుకులు - చారెడు

తయారీ : ఒక పాత్రలో గోధుమపిండి, రవ్వ, కాస్త నూనె వేసి.. తగినన్ని నీళ్లతో పిండి కలిపి, కొంతసేపు నానబెట్టి, పూరీలు చేసుకోవాలి. చక్కగా పొంగి, బంగారు రంగులోకి మారిన పూరీలను పక్కనుంచాలి. అడుగు మందంగా ఉన్న పాత్రలో పాలు, కుంకుమ పువ్వు వేసి మరిగించాలి. మధ్యమధ్యలో కలియ తిప్పుతుండాలి. పాలు చిక్కబడ్డాక.. పంచదార, యాలకుల పొడి వేసి.. సన్న సెగ మీద ఐదు నిమిషాలుంచి, దించేయాలి. ఇప్పుడు పూరీలను సగానికి మడిచి లేదా అలాగే పాలల్లో వేసి.. బాదం పలుకులు చల్లాలి. అంతే.. రుచికరమైన పాల్‌ పోలీ రెడీ.


రాజ్‌గిరా షీరా

కావలసినవి : నెయ్యి, బెల్లం, రాజ్‌గిరా లేదా అమ్రంత్‌ పిండి - కప్పు చొప్పున, జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులు - అన్నీ కలిపి అర కప్పు

తయారీ : అడుగు మందంగా ఉన్న పాత్రలో రెండు కప్పుల నీళ్లలో కప్పు బెల్లం వేసి పల్చటి సిరప్‌ చేసి పక్కనుంచాలి. కడాయిలో కప్పు నెయ్యి, రాజ్‌గిరా పిండి వేసి కలియబెట్టాలి. అది గోధుమ రంగులోకి వచ్చాక.. బెల్లం సిరప్‌ వేసి.. ఉండ కట్టకుండా కలియ తిప్పుతుండాలి. చివర్లో జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులు వేసి దించేస్తే సరి.. నోరూరించే రాజ్‌గిరా షీరా తయార్‌.


కోట్‌పీఠా

కావలసినవి : బియ్యప్పిండి- రెండు కప్పులు, బెల్లం - అర కప్పు, అరటి పండ్లు - మూడు, ఉప్పు - చిటికెడు, నూనె - వేయించేందుకు సరిపడా

తయారీ: ఒక పాత్రలో బియ్యప్పిండి, బెల్లం, ఉప్పు, మెత్తగా చితిపిన అరటిపండ్ల గుజ్జు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా తీసుకుని.. కాగుతున్న నూనెలో బంగారు రంగు వచ్చే వరకూ వేయించుకోవాలి. అంతే కోట్‌ పీఠాలు తయారైపోతాయి. ఎంతో సులువు కదూ! ఇవి ప్రసాదంగా నివేదించేందుకూ బాగుంటాయి, ప్రత్యేకమైన రుచితో అందరికీనచ్చుతాయి కూడా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు