కారంకారంగా.. గరంగరంగా..

వేడివేడి పకోడీలు దొంతరగా కనిపిస్తుంటే.. వాటి పక్కన టొమాటో పచ్చడో, గ్రీన్‌ చెట్నీనో నోరూరిస్తుంటే.. ఇక వాటి మీద దాడి చేయకుండా ఉండటం ఎవరి తరం?! అందుకే చల్లచల్లటి వాతావరణంలో వెచ్చవెచ్చగా ఈ పకోడీలు ప్రయత్నించండి..

Updated : 06 Aug 2023 01:23 IST

వేడివేడి పకోడీలు దొంతరగా కనిపిస్తుంటే.. వాటి పక్కన టొమాటో పచ్చడో, గ్రీన్‌ చెట్నీనో నోరూరిస్తుంటే.. ఇక వాటి మీద దాడి చేయకుండా ఉండటం ఎవరి తరం?! అందుకే చల్లచల్లటి వాతావరణంలో వెచ్చవెచ్చగా ఈ పకోడీలు ప్రయత్నించండి.. ఇంటిల్లిపాదీ ఆనందించండి..


క్యాప్సికం

కావలసిన పదార్థాలు: క్యాప్సికం - 4, శనగపిండి - కప్పు, బియ్యప్పిండి - పావుకప్పు, కారం - చెంచా, జీలకర్ర పొడి - చెంచా, పసుపు - పావు చెంచా, ఇంగువ - పావు చెంచా, ఉప్పు - అరచెంచా, నూనె - వేయించేందుకు సరిపడా

తయారీ: ఒక పాత్రలో శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం, పసుపు, ఇంగువ, జీలకర్ర పొడి కొన్ని నీళ్లతో కలియతిప్పాలి. పిండి మరీ జారుగా ఉండకూడదు. క్యాప్సికంను గుండ్రంగా లేదా నిలువుగా నచ్చిన ఆకృతిలో ముక్కలు కోసుకోవాలి. కడాయిలో నూనె కాగనిచ్చి క్యాప్సికం ముక్కలను పిండిలో ముంచి బంగారు రంగు వచ్చేదాకా వేయిస్తే సరి.. నోరూరించే పకోడీలు సిద్ధం.


కంద దుంప

కావలసిన పదార్థాలు: శనగపిండి - అరకప్పు, బియ్యప్పిండి - 2 చెంచాలు, కంద - ఒకటి, కొబ్బరికోరు - అరకప్పు, వేయించిన పల్లీలు - పావుకప్పు, కారం - చెంచా, సోంపు - చెంచా, పసుపు - పావు చెంచా, పచ్చిమిర్చి ముక్కలు - కొద్దిగా, సన్నగా తరిగిన ఉల్లి - పావుకప్పు, కొత్తిమీర తరుగు - 2 చెంచాలు, కరివేపాకు తరుగు - చెంచా, ఉప్పు - తగినంత, నూనె - వేయించేందుకు సరిపడా

తయారీ: కంద దుంప చెక్కు తీసి ముక్కలుగా తరిగి, మరిగే నీళ్లలో వేసి తీయాలి. ఒక పాత్రలో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి, అరకప్పు నీళ్లతో బాగా కలియతిప్పాలి. కడాయిలో నూనె కాగిన తర్వాత కలిపిన మిశ్రమంతో పకోడీలుగా వేసి బంగారు రంగు వచ్చేదాకా వేయించి తీస్తే సరిపోతుంది. సెగ మధ్యస్థంగా ఉంటే సమంగా కాలతాయి.


చేప

కావలసిన పదార్థాలు: చేప - అరకిలో, నిమ్మరసం - చెంచా,  ఉప్పు - 2 చెంచాలు, శనగపిండి - 200 గ్రా, కారం - చెంచా, పసుపు - అరచెంచా, జీలకర్ర పొడి - అరచెంచా, వంటసోడా - పావుచెంచా, ఛాట్‌ మసాలా - అర చెంచా, కొత్తిమీర తరుగు - కొద్దిగా, నూనె - వేయించేందుకు సరిపడా

తయారీ: బాగా కడిగిన చేప ముక్కలను నిమ్మరసం, ఒక చెంచా ఉప్పులో కలియతిప్పి పావుగంటసేపు ఊరనివ్వాలి. తర్వాత జల్లెడ లాంటి చిల్లుల గిన్నెలో వేసి నీరంతా పోయేలా చేయాలి. ఒక పాత్రలో శనగపిండి, కారం, పసుపు, ఒక చెంచా ఉప్పు, జీలకర్ర పొడి, వంటసోడా వేసి తగినన్ని నీళ్లతో పిండి కలపాలి. పిండి మరీ గట్టిగా, మరీ జారుగా లేకుండా సమంగా ఉండాలి. కడాయిలో నూనె కాగిన తర్వాత పిండిలో ముంచి తీసిన చేపముక్కలను వేయించుకుని ఛాట్‌ మసాలా, కొత్తిమీర తరుగు జల్లితే సరిపోతుంది.


క్యాలీఫ్లవర్‌

కావలసిన పదార్థాలు: చిన్నగా తుంచిన క్యాలీఫ్లవర్‌ పూలు - రెండు కప్పులు, శనగపిండి - కప్పు, ఉప్పు, పసుపు - పావు చెంచా చొప్పున, అల్లం వెల్లుల్లి ముద్ద - అరచెంచా, కొత్తిమీర తరుగు - చారెడు, కచ్చాపచ్చాగా నూరిన పచ్చిమిర్చి - చెంచా, నూనె - వేయించేందుకు సరిపడా

తయారీ: ఒక పాత్రలో శనగపిండి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, నూరిన పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ కొంచెం గట్టిగా కలుపుకోవాలి. చిన్నగా తుంచిన క్యాలీఫ్లవర్‌ పూలను పిండిలో ముంచి తీసి కాగిన నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. కమ్మటి క్యాలీఫ్లవర్‌ పకోడీ చిన్నా పెద్దా అందరికీ నచ్చుతాయి.


బచ్చలి

కావలసిన పదార్థాలు: తాజా బచ్చలి ఆకులు - 20, శనగపిండి - కప్పు, బియ్యప్పిండి - చెంచా, కారం - చెంచా, వాముపొడి - అర చెంచా, ఉప్పు - పావుచెంచా, అల్లంముద్ద - అరచెంచా, కొత్తిమీర తరుగు - కాస్త, పచ్చిమిర్చి - 2, నూనె - వేయించేందుకు సరిపడా

తయారీ: బచ్చలి ఆకులు కడిగి నీళ్లు లేకుండా పక్కన ఉంచుకోవాలి. ఒక పాత్రలో శనగపిండి, బియ్యప్పిండి, కారం, ఉప్పు, వాము పొడి, అల్లం ముద్ద, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసి తగినన్ని నీళ్లతో చిక్కగా కలియతిప్పాలి. బాణలిలో నూనె కాగిన తర్వాత బచ్చలాకులను పిండిలో ముంచి తీసి వేయించుకోవాలి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని