నల్లనయ్యకు నైవేద్యం

మధురా నగరిలో యమునా తీరంలో గోపికలతో ఆటలు.. ఆనందాల వేణుగానాలు. ఆ అల్లరి కృష్ణయ్యకి.. యశోదమ్మ ముద్దుల తనయుడికి అటుకులంటే మహా ప్రీతి. కుచేలుడు ప్రేమతో ఇచ్చిన గుప్పెడు అటుకులకే అతనికి సకల ఐశ్వర్యాలూ ప్రసాదించాడు.

Updated : 03 Sep 2023 05:02 IST

సెప్టెంబరు 6, 7 కృష్ణాష్టమి

మధురా నగరిలో యమునా తీరంలో గోపికలతో ఆటలు.. ఆనందాల వేణుగానాలు. ఆ అల్లరి కృష్ణయ్యకి.. యశోదమ్మ ముద్దుల తనయుడికి అటుకులంటే మహా ప్రీతి. కుచేలుడు ప్రేమతో ఇచ్చిన గుప్పెడు అటుకులకే అతనికి సకల ఐశ్వర్యాలూ ప్రసాదించాడు. మరి కృష్ణాష్టమికి అటుకుల ప్రసాదాలు సమర్పిద్దామా..


కేసరి

కావలసినవి: అటుకులు, చక్కెర - కప్పు చొప్పున, నెయ్యి - అర కప్పు, యాలకుల పొడి - అర చెంచా, జీడిపప్పు, కిస్మిస్‌ - అర కప్పు, కుంకుమ పువ్వు

తయారీ: ముందుగా కడాయిలో నెయ్యి వేసి అటుకులు వేయించాలి. వేడి తగ్గాక కొంచెం బరకగా పొడి చేసుకోవాలి. ఇందులో నెయ్యి, కొద్దిగా నీళ్లు పోసి ఉండలు రాకుండా ఉడికించాలి. పంచదార వేస్తూ కలియబెట్టాలి. దగ్గరగా అయ్యాక.. నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్‌, కుంకుమ పువ్వు వేసి కలపాలి. అంతే.. కేసరి సిద్ధం.


బెల్లం మిఠాయి

కావలసినవి: అటుకులు - 2 కప్పులు, కొబ్బరి తురుము - కప్పు, బెల్లం - పావుకిలో, నెయ్యి - కప్పు, యాలకుల పొడి - అర చెంచా, నువ్వులు - అర కప్పు, జీడిపప్పు, కిస్మిస్‌ - అర కప్పు

తయారీ: జీడిపప్పు, కిస్మిస్‌ నేతిలో వేయించాలి. బెల్లం పాకం పట్టి.. అందులో కొబ్బరి తురుము, జీడిపప్పు, కిస్మిస్‌ వేయాలి. కాస్త ఉడకనిచ్చి, అటుకులు, మిగిలిన నెయ్యి వేయాలి. రెండు నిమిషాలు సన్న సెగ మీద ఉంచి, కలియతిప్పి, దించితే సరి.. అటుకులు, కొబ్బరి, బెల్లంతో రుచికరమైన కొబ్బరి మిఠాయి తయారైపోతుంది.


మోదకం

కావలసినవి: అటుకులు - రెండు కప్పులు, నెయ్యి - కప్పు, బెల్లం - పావు, యాలకుల పొడి - అర చెంచా, జీడిపప్పు, కిస్మిస్‌ - అర కప్పు, నచ్చిన ఫుడ్‌ కలర్‌ - కొద్దిగా

తయారీ: కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి అటుకులు వేయించుకోవాలి. చల్లారాక మెత్తగా గ్రైండ్‌ చేయాలి. జీడిపప్పు, కిస్మిస్‌ నేతిలో వేయించాలి., బెల్లం పాకం పట్టి- అందులో అటుకుల పొడి, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్‌, ఫుడ్‌ కలర్‌ వేసి కలపాలి. ఆ మిశ్రమంతో మోదకాలు చుట్టుకోవాలి. ఇవి రుచీ, ఆరోగ్యం కూడా.


లడ్డు

కావలసినవి: అటుకులు - రెండు కప్పులు, పంచదార - కప్పు, కొబ్బరితురుము - అర కప్పు, యాలకుల పొడి - అర చెంచా, నెయ్యి - తగినంత, జీడిపప్పు, కిస్మిస్‌ - అరకప్పు

తయారీ: కడాయిలో కాస్త నెయ్యి వేసి అటుకులు వేయించాలి. అవి కాస్త వేగాక కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి ఇంకాస్త వేయించాలి. చల్లారాక గ్రైండ్‌ చేసి.. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో జీడిపప్పు, కిస్మిస్‌, పంచదార పొడి, నెయ్యి వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలియతిప్పి.. చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఇంకా తియ్యగా కావాలనుకుంటే.. మిక్స్‌డ్‌ ఫ్రూట్‌ జామ్‌ కొద్దిగా కలపవచ్చు. ఇవి వారం పాటు తాజాగా ఉంటాయి.


తియ్యటి అటుకులు

కావలసినవి: అటుకులు - రెండు కప్పులు, కొబ్బరి పాలు - రెండు కప్పులు, పంచదార - కప్పు, ఆకుపచ్చ ఫుడ్‌ కలర్‌ - కొద్దిగా

తయారీ: ముందుగా కొబ్బరిని గ్రైండ్‌ చేసి, అందులోంచి కొబ్బరి పాలు తీయాలి. సన్న సెగ మీద ఈ పాలు మరిగిస్తూ అందులో పంచదార వేయాలి. అది కరిగాక అటుకులు, ఫుడ్‌ కలర్‌ వేసి కలియతిప్పి కొద్దిగా ఉడికించి దించేయాలి. ఈ తియ్యటి అటుకుల పైన కాస్త కొబ్బరి కోరు చల్లితే.. రుచి పెరగడమే కాకుండా, మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని