కాశీ సంకట్‌ మోచన్‌ మందిరం

శ్రీరామభక్తుడైన ఆంజనేయస్వామి నిరంతరం రామనామ స్మరణలో ఉంటాడు. కేసరి, అంజనాదేవిల పుత్రుడైన హనుమాన్‌ సీతాన్వేషణలో లంకకు వెళ్లి ఆమె ఆచూకీ కనుగొంటాడు. అనంతరం శ్రీరాముడు వానరుల సాయంతో

Updated : 14 Mar 2023 13:46 IST

శ్రీరామభక్తుడైన ఆంజనేయస్వామి నిరంతరం రామనామ స్మరణలో ఉంటాడు. కేసరి, అంజనాదేవిల పుత్రుడైన హనుమాన్‌ సీతాన్వేషణలో లంకకు వెళ్లి ఆమె ఆచూకీ కనుగొంటాడు. అనంతరం శ్రీరాముడు వానరుల సాయంతో రావణాసురుడిని వధించడంతో సీతమ్మకు చెరవీడుతుంది. హనుమాన్‌ చిరంజీవి. ఎక్కడ రామనామం వినిపిస్తే అక్కడ ప్రత్యక్షమవుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భారతదేశంలో వేలాది హనుమాన్‌ మందిరాలున్నాయి. వీటిలో వారణాసిలోని సంకట్‌ మోచన్‌ మందిరం ప్రముఖ దేవాలయంగా ఖ్యాతి గడించింది.

హనుమాన్‌ ప్రత్యక్షమైన ప్రదేశంలో...

రామచంద్రుని చరితాన్ని రాసిన కవుల్లో తులసీదాస్‌ అగ్రగణ్యులు. ఆయన రాసిన రామచరిత మానస్‌ మహాగ్రంథం. వారణాసిలోని అస్సి నదీ తీరంలోతులసీదాస్‌కు ఆంజనేయస్వామి ప్రత్యక్షమైనట్టు స్థలపురాణం వెల్లడిస్తోంది. అంజనీపుత్రుడి ఆశీస్సులతోనే ఈ పుస్తకాన్ని రచించినట్టు చరిత్రకారులు పేర్కొంటారు. శని ప్రభావం నుంచి రామభక్తులను హనుమాన్‌ రక్షిస్తాడని పురాణగ్రంథాలు పేర్కొంటున్నాయి. రామభక్తుడైన స్వామిని పూజిస్తే అన్ని శుభాలు చేకూరుతాయని అనంతకోటి భక్తుల ప్రగాఢ విశ్వాసం. వారణాసిలో బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలోని నూతన విశ్వనాధుని మందిర సమీపంలో హనుమాన్‌ ఆలయం ఉండటం విశేషం. సంకటం అంటే కష్టాలు. మోచన్‌కు అర్థం విముక్తి కలిగించడం. కష్టాల నుంచి విముక్తి కలిగిస్తాడు కనుకే ఆంజనేయస్వామిని సంకట్‌ మోచన్‌ హనుమాన్‌గా కొలుస్తారు. మంగళ, శనివారాల్లో భక్తులు వేలాదిగా ఆలయానికి తరలివస్తారు.

ఆలయ నిర్మాణం..

పురాతన కాలంలో ఉన్న ఆలయం కాలక్రమేణ శిథిలమైంది. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుడు మదన్‌ మోహన్‌ మాలవీయ సారథ్యంలో ఆలయాన్ని పునర్‌ నిర్మించారు. ఆలయప్రాంగణంలో వందలాది మర్కటాలు ఉంటాయి. భక్తులకు ఇచ్చే ప్రసాదం ‘బేసన్‌ కి లడ్డు’ ప్రత్యేకమైనది. ప్రతిరోజూ వేల మంది భక్తులు స్వామి వారికి పూజలు చేస్తుంటారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా శోభాయాత్రను నిర్వహిస్తారు.

 సంగీతోత్సవం..

​​​​​​​

ప్రతి ఏటా ఏప్రిల్‌ మాసంలో సంకట్‌మోచన్‌ సంగీతోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. 88 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ వేడుకలు ఏటా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రయంలో భారతీయ సంప్రదాయ సంగీతం, నృత్యంలో ఖ్యాతి పొందిన వారు పాల్గొంటారు. భారతీయ సంప్రదాయ సంగీత కళాకారులు ఒక్క వేదికపై చేరడం సంగీతప్రియులకు కనువిందు చేస్తుంది. 2015లో పాకిస్థాన్‌కు చెందిన గజల్‌ కళాకారుడు గులాం అలీ ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వడం భారత దేశ విశిష్టతగా, ఖ్యాతిచెందిన లౌకికవాదానికి ఉదాహరణగా నిలిచింది.

ఎలా చేరుకోవాలి...

> వారణాసికి దేశంలోని అన్ని ప్రాంతాలతో రవాణా సౌకర్యముంది.
> రోడ్డు, రైలు, విమానమార్గాల ద్వారా వారణాసికి చేరుకోవచ్చు.
> కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి అమ్మవారు, అన్నపూర్ణాదేవి, కాలభైరవ ఆలయాలకు రోజూ భక్తులు వస్తుంటారు.
> అన్ని కాలాల్లోనూ కాశీయాత్ర చేసే సౌకర్యాలున్నాయి.
> వర్షాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని