బాసర-వాగ్దేవి ఆలయం

పూర్వం కురుక్షేత్ర యుద్ధం అనంతరం కొన్నాళ్లు ప్రశాంతంగా తపస్సు చేసుకునేందుకని వ్యాసమహర్షి, విశ్వామిత్ర మహర్షి తదితరులు శిష్యసమేతంగా ఈ ప్రాంతానికి వచ్చారట. ఇక్కడి ప్రశాంత వాతావరణానికి ముగ్ధులై.. ఇక్కడే తపస్సు కొనసాగించారట! వ్యాస భగవానులు రోజూ పావన గోదావరి జలాల్లో స్నానం చేశాక.. పిడికెడు ఇసుక చొప్పున తీసుకెళ్లి..

Updated : 14 Mar 2023 13:57 IST

క్షేత్రచరిత్ర/ స్థలపురాణం: పూర్వం కురుక్షేత్ర యుద్ధం అనంతరం కొన్నాళ్లు ప్రశాంతంగా తపస్సు చేసుకునేందుకని వ్యాసమహర్షి, విశ్వామిత్ర మహర్షి తదితరులు శిష్యసమేతంగా ఈ ప్రాంతానికి వచ్చారట. ఇక్కడి ప్రశాంత వాతావరణానికి ముగ్ధులై.. ఇక్కడే తపస్సు కొనసాగించారట! వ్యాస భగవానులు రోజూ పావన గోదావరి జలాల్లో స్నానం చేశాక.. పిడికెడు ఇసుక చొప్పున తీసుకెళ్లి.. సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని రూపొందించారట! ఆ మూర్తికే ఆయన నిత్యపూజలు చేసేవారని.. ఇప్పుడు ఇక్కడున్న విగ్రహం అప్పట్లో వ్యాస మహర్షి ఆరాధించిన మూర్తేనని స్థలపురాణం! అలా వేద వ్యాస ప్రతిష్ఠగా పరిగణించే బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి సన్నిధిలో నిత్యం వేల మంది చిన్నారులు అక్షరాభ్యాసం చేసుకుంటూ.. ఆ తల్లి దీవెనలు.. చల్లని చూపులతో విజ్ఞానవంతులుగా ఎదుగుతున్నారు.

దర్శనవేళలు

> రోజూ ఉదయం 4 గంటలకే ఆలయద్వారాలు తెరుస్తారు.
> ఉదయం 4.30 గంటలకు అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తారు.
> అనంతరం 4.30 నుంచి 6.30 వరకూ అభిషేకం కొనసాగుతుంది.
> 6.30 నుంచి 7.30 గంటల వరకు విరామం.
> ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సాధారణ దర్శనం, ప్రత్యేక దర్శనం, అక్షరాభ్యాస పూజలు ఆరంభం.
> మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.00 గంటల వరకు మధ్యాహ్న విరామం
> మధ్యాహ్నం 2 నుంచి 6.30 వరకు దర్శనం, పూజలు
> సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు సాయంత్ర ప్రదోషకాల పూజలు
> రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు హారతి. అనంతరం ఆలయ తలుపులు మూసివేస్తారు.
వివిధ ఆర్జిత సేవలు/ పూజల వివరాలు
> అభిషేకసేవ టిక్కెట్టు: రూ.200(ఒక కుటుంబం లేదా నలుగురు మాత్రమే)
> ప్రత్యేక దర్శనం ఒక టిక్కెట్టుపై ఒకరు మాత్రమే
> సాధారణ అక్షరాభ్యాసం: రూ. 100
> ప్రత్యేక అక్షరాభ్యాసం: రూ. 1000
> నిత్య చండీ హవనం: రూ. 500
> కుంకుమార్చన రూ.50

ఉప ఆలయాల సమాచారం:

ప్రధాన సరస్వతీ ఆలయ అంతరాలయంలో మహాలక్ష్మీ.. ఆలయానికి పశ్చిమ దిక్కులో మహాకాళీ కొలువై ఉంటారు. అంటే ఈ ఆలయం త్రిశక్తులైన లక్ష్మి.. పార్వతి.. సరస్వతి అమ్మవార్లు కొలువైన మహిమాన్విత క్షేత్రమన్న మాట. ఆలయానికి తూర్పున దత్తాత్రేయుడు, ఆలయం ముందు ప్రధాన రహదారి వద్ద వేదవ్యాస మహర్షి ఆలయం.. వ్యాసుల వారి గుహ.. గోదావరి నది.. నదీ తీరాన మహేశ్వర ఆలయం.. బస్టాండ్‌ సమీపంలోని వేదశిల (శ్రీ వేదవతిశిల) అవశ్య దర్శనీయ స్థలాలు. వీటన్నింటి దర్శనం ఉచితమే!
ఆలయంలో నిత్యం నిర్వహించే వివిధ పూజలు: అభిషేకం, అక్షరాభ్యాసాలు, సత్యనారాయణ వ్రతాలు, చండీ హవనం, కుంకుమార్చన.

ప్రత్యేక ఉత్సవాలు

> సరస్వతి అమ్మవారి జన్మదినమైన వసంత పంచమి నాడు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. మహాభిషేకంతో పాటు అమ్మవారి పల్లకి సేవ నిర్వహిస్తారు.
> దసరా నవరాత్రి ఉత్సవాలనూ ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మూల నక్షత్ర పర్వదినం రోజున మూల నక్షత్ర మహా సరస్వతీపూజ నిర్వహిస్తారు.
> గురుపౌర్ణమి సందర్భంగానూ ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారు. సప్తశతి చండీయాగం చేసి. వేద పండితులకు సన్మానం నిర్వహిస్తారు.
> ఇక్కడ నిర్వహించే పూజలు.. ప్రత్యేక దర్శనాలకు సంబంధించి ఆన్‌లైన్‌ బుకింగ్‌ సౌకర్యమేమీ లేదు.

వసతి వివరాలు:

బాసర సరస్వతీ ఆలయానికి వచ్చే భక్తుల వసతి కోసమని దేవస్థానం 100 సాధారణ గదులు, 18 ఏసీ గదులు అందుబాటులో ఉంచుతుంది. ఇంకా ఆలయం వద్ద వివిధ ఆలయాల నిధులతో నిర్మించిన అతిథి గృహాల్లోనూ వసతి అందుబాటులో ఉంది. పర్యాటక శాఖ వారి హరిత అతిథిగృహంతో పాటు పలు ప్రైవేటు లాడ్జిలు, రిసార్టుల్లోనూ వసతి సౌకర్యముంది. బాసరలోని హోటళ్ల సమాచారం కోసం www. basarahotels.com వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

రవాణా సౌకర్యం:

బాసర-జ్ఞాన సరస్వతీదేవి క్షేత్రం.. హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గంలో అయితే.. 203కి.మీ.లు రైలు మార్గంలో అయితే.. 162 కి.మీ.ల దూరంలో ఉంది. బాసరకు నేరుగా విమానంలో వచ్చే సౌకర్యం లేదు. కానీ.. 15కు పైగా హైదరాబాద్‌ నుంచి నేరుగా బాసర వచ్చే రైళ్లు ఉన్నాయి. ఆ మేరకు హైదరాబాద్‌కు విమానంలో వచ్చి.. అక్కడి నుంచి అజంతా ఎక్స్‌ప్రెస్‌..(17063), ఏకే కేసీజీ ఎక్స్‌ప్రెస్‌(17640), దేవగిరి ఎక్స్‌ప్రెస్‌(17057), కృష్ణా ఎక్స్‌ప్రెస్‌(17406), నాందేడ్‌-హైదరాబాద్‌ ప్యాసింజర్‌(57564) తదితర రైళ్లలో నేరుగా బాసర చేరుకోవచ్చు. రైల్లో సుమారు 2.40 గంటలు.. రోడ్డు మార్గంలో(వయా నిజామాబాద్‌) అయితే సుమారు 4.30 గంటల సమయం పడుతుంది.
 
మరిన్ని వివరాలకు ఆలయ విచారణ కేంద్రం ఫోన్‌: 08752-255503 నెంబరులో లేదా.. వెబ్‌సైట్‌:basaratemple.org ఇ-మెయిల్‌ ఐడీ:infobasaratemple.org లేదా.. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కార్యాలయంలోనైనా సంప్రదించవచ్చు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని