దక్షిణ ద్వారక.. గురువాయూర్‌

జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు భూలోకంలో వెలసిన దివ్యక్షేత్రమే గురువాయూర్‌. భూలోక వైకుంఠంగా ఖ్యాతిచెందిన ఈ మహాక్షేత్రం వేల సంవత్సరాలుగా పూజలందుకుంటోంది. 

Updated : 14 Mar 2023 15:04 IST

జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు భూలోకంలో వెలసిన దివ్యక్షేత్రమే గురువాయూర్‌. భూలోక వైకుంఠంగా ఖ్యాతిచెందిన ఈ మహాక్షేత్రం వేల సంవత్సరాలుగా పూజలందుకుంటోంది. భగవంతుని సన్నిధి చేరుకోవాలంటే జీవులకు కష్టసాధ్యం. అదే గురువాయూర్‌లో శ్రీకృష్ణని సన్నిధి చేరుకుంటే సులభంగా మోక్షం పొందొచ్చన్నది ఇక్కడి భక్తుల విశ్వాసం. పరబ్రహ్మమే శ్రీకృష్ణ రూపంలో ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఆ పేరెలా వచ్చింది..?

దేవతల గురువు బృహస్పతి, వాయు భగవానుడు కలసి శ్రీకృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు స్థానిక స్థలపురాణం చెబుతోంది. దక్షిణ ద్వారకగా ఈ పుణ్యక్షేత్రాన్ని పేర్కొంటారు. స్వామివారి మూలవిరాట్‌ రాయితోనూ, లోహంతోనూ తయారుకాకుండా పడ అంజనం అనే మిశ్రమంతో తయారవుతుంది. సాక్షాత్తు శ్రీకృష్ణభగవానుడే తన విగ్రహాన్ని తయారు చేసి ద్వాపరయుగం చివరి రోజుల్లో తన శిష్యుడైన ఉద్దవునికి ఇచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. ద్వాపర యుగాంతంలో యావత్ ప్రపంచం నీటమునిగింది. చిన్నికృష్ణుని విగ్రహాన్ని బృహస్పతి గురువాయూర్‌లో ప్రతిష్టించారు. ఈ క్రతువులో వాయువు తన ప్రభంజనంతో సముద్రాన్ని ఉప్పొంగించాడు. ఈ మహత్‌ కార్యంలో గురువు, వాయువు కలిసి పాల్గొనడంతో గురువాయూర్‌ అనే పేరు వచ్చింది.

జనమేజయునికి శాప విముక్తి

పరీక్షిత్‌ మహారాజు తక్షకుని కాటుకు గురికావడంతో ఆయన కుమారుడు జనమేజయుడు సర్పయాగం చేస్తాడు. ఈ యాగంలో లక్షలాది సర్పాలు చనిపోతాయి. పరీక్షిత్‌ మహారాజు మరణంతో సంబంధం లేకపోయినా లక్షలాది అమాయక నాగులు ఈ యాగంతో నశిస్తాయి. ఈ పాపానికి జనమేజయునికి కుష్టు రోగం వస్తుంది. దత్తాత్రేయుని సూచన మేరకు గురువాయూర్‌ క్షేత్రానికి వచ్చిన జనమేజయుడు చాలాకాలం గురువాయూర్‌లో ఉండి స్వామి దర్శనం చేసుకునేవాడు. ఒక రోజు అతనికి కుష్టు రోగం మాయమైంది. 

అన్నప్రాసన ఇక్కడే..

కేరళలో పిల్లలకు అన్నప్రాసన ఇక్కడే నిర్వహిస్తారు. కృష్ణుని సన్నిధిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తే వారికి ఎలాంటి ఆపదలు రావని భక్తుల నమ్మకం. వివాహాలు కూడా ఎక్కువగా స్వామి సన్నిధిలో జరుగుతుంటాయి. అలాగే తులాభారంతో తమ మొక్కులు తీర్చుకుంటారు. చిన్నకృష్ణుని దర్శనం అనంతరం సమీపంలోని మమ్మియూర్‌లోని పరమశివుడి ఆలయాన్ని కూడా దర్శించుకుంటే క్షేత్ర సందర్శన పూర్తవుతుంది.

దర్శనం.. దివ్యానుభూతి

స్వామి చేతిలో పాంచజన్యం, సుదర్శనచక్రం, కౌముదికి, తామరపుష్పంతో దర్శనమిచ్చే ఉన్నికృష్ణన్‌ (బాలకృష్ణుడు) ముగ్ధమోహనరూపం సందర్శిస్తే దివ్యానుభూతి కలుగుతుంది. అనిర్వచనీయ ఆనందం లభిస్తుంది. 

నారాయణీయం..

భాగవతాన్ని మళయాళంలోకి మేళపతూర్‌ నారాయణ భట్టతిరి అనువదించారు. దీన్నే నారాయణీయం అంటారు.  దీన్ని ఈ సన్నిధిలో పూర్తిగా పఠిస్తే శారీరక రుగ్మతలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఎలా చేరుకోవచ్చంటే..

కేరళలోని త్రిస్సూర్‌ రైల్వేస్టేషన్‌లో దిగి అక్కడ నుంచి గురువాయూర్‌కు చేరుకోవచ్చు. కోయంబత్తూర్‌,  కొచ్చి ఇక్కడికి సమీప విమానాశ్రయాలు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రహదారి సౌకర్యముంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని