Published : 17 Oct 2019 08:52 IST

అరుణాచలేశ్వరం

తపోవనాల నిలయం.. అరుణాచలేశ్వరం

‘‘భూరంభాంస్యనలో నిలోమ్బర మహార్నాథో హిమాంశుః పుమాన్‌
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్‌
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభోః
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే’’

గద్గురు ఆదిశంకరాచార్య చెప్పిన దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక పాదం ఇది. దీని అర్థమేమంటే.. అంతటా నిండి నిబిడీకృతమైన శివ చైతన్యం కంటికి కనపడే విధంగా అష్టమూర్తి తత్వంగా ప్రకాశిస్తుంది అని. ఈ ప్రపంచంలో మనం శివుడిని ఎనిమిది రూపాల్లో చూడగలమట. ఆయన తత్వమంతా ఎనిమిది అంకెమీదే నడుస్తుంది. పృథివీ, ఆపస్తేజో, వాయు, ఆకాశములు పంచ భూతాలు.. ఈ ఐదుతో పాటు సూర్యచంద్రులు, జీవుడు. ఈ ఎనిమిది శివస్వరూపాలు. వీటిని శివ స్వరూపాలుగా నిర్థారణ చేయడం కోసమే ఈ ఎనిమిది లింగాలు మనకు దర్శనమిస్తున్నాయి. అవి కంచిలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జల లింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశ లింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్క్‌లో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్‌మాండ్‌లో యజమానలింగం.
అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా కొలువై ఉన్నాడు. అగ్ని అంటే జ్వాల. మిగిలిన పంచభూత లింగాల మాదిరిగా ఇక్కడి శివుడు అగ్నిరూపంలో దర్శనమివ్వడు. కేవలం రాతి లింగంగానే ఉంటాడు. అరుణాచలం పరిసర ప్రాంతాలతో పోలిస్తే ఆలయంలో విపరీతమైన వేడి ఉంటుంది. అది జ్ఞానాగ్ని వల్ల వచ్చే వేడి అంటారు. జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వారి కర్మలు దగ్ధమవుతాయి. దాని వలన మళ్లీ జన్మించాల్సిన అవసరం లేకుండా పాపాలన్నీ పోతాయి. అందుకే అరుణాచలాన్ని జ్ఞానస్వరూపమైన అగ్నిలింగం అంటారు. జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన దివ్యక్షేత్రం అరుణాచలం.
ఇదీ పురాణగాథ!
పూర్వం బ్రహ్మ, మహా విష్ణువుల్లో ఎవరు గొప్ప అనే దానిపై ఇరువురు కలహించుకొన్నారట. సృష్టికర్త అయిన బ్రహ్మ.. స్థితికారుడైన విష్ణువు శివమాయకు వశం కావడం ఈ కలహానికి కారణమైంది. శివ మాయా మోహితులైన వీరిని మాయా మేఘం కమ్మేసింది. దీంతో ఇరువురి మధ్య అహంకారం ప్రజ్వరిల్లి కలహానికి దారితీసిందట. ‘నేను సృష్టికర్తను. నేను సృష్టించకుండా ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది’ అని బ్రహ్మ.. ‘నేను స్థితికారుడను. అన్నీ సవ్యంగా సాగడానికి కారణం నేనే కనుక నేనే గొప్ప’ అని విష్ణువు అనడం ఇద్దరి మధ్య ఎడతెగని చర్చకు, వాదోపవాదానికి దారితీసిందట. ఏ మాయవల్ల వారు కలహానికి దిగారో అది తెలియాలని ఇరువురి మధ్య పరమశివుడు ఒక పెద్ద జ్యోతి స్తంభంగా వెలిశాడట. అనంతరం బ్రహ్మ, విష్ణువులిద్దరినీ ఈ జ్యోతిస్తంభం ఆది, అంతములు తెలుసుకొని రమ్మన్నాడట. వరాహమూర్తియై శ్రీమహావిష్ణువు జ్యోతిర్లింగం ఆదిని తెలుసుకోవడానికి భూమిని తవ్వుకొంటూ పాతాళలోకం దాటి వెళ్లిపోగా, పైన ఉన్న కొనభాగాన్ని తెలుసుకోవడానికి హంసనెక్కి చతుర్ముఖ బ్రహ్మ.. వూర్థ్వముఖానికి వెళ్లారట. అలా కొన్ని వేల దివ్య సంవత్సరములు వారు ప్రయాణం చేశారట. బ్రహ్మకు అలసట రావడంతో ఓ చోట ఆగిపోయారట. ఆ సమయంలో పైనుంచి పడుతున్న ఒక మొగలిపువ్వును పట్టుకుని అడిగారట.. ‘నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు?’ అని. అప్పుడు మొగలిపువ్వు ‘నేను శివుడి తలపై నుంచి కింద పడుతున్నా’ అని సమాధానమిచ్చిందట. ఈ శివలింగం పైభాగం ఇంకెంత దూరం ఉందని ఆ కేతకీపుష్పాన్ని బ్రహ్మ అడగగా, అందుకు అది సమాధానమిస్తూ ‘నేను ఇలా పడటం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరములు అయింది’ అని చెప్పిందట. ఆద్యంత రహితమైన శివలింగాన్ని కనుక్కోలేక మొగలిపువ్వుతో బ్రహ్మ ఈ విధంగా అన్నాడట. శివలింగం పై భాగం నుంచి నేనే నిన్ను తీసుకొచ్చానని శివుడికి చెప్పాలి అనడంతో అందుకు ఆ కేతకీపుష్పం అంగీకరించిందట. అప్పుడే అక్కడకు వచ్చిన కామధేనువును కూడా సాక్ష్యం చెప్పాల్సిందిగా బ్రహ్మ కోరాడట. దీంతో ఆ రెండింటినీ తీసుకుని పరమశివుడి వద్దకు చేరాడట బ్రహ్మ. అప్పటికే మాయమేఘం వీడిపోయిన శ్రీమహావిష్ణువు తాను ఈ లింగం ఆదిని కనుక్కోలేకపోయానని నిజం ఒప్పుకొన్నాడట. అయితే అగ్నిలింగం ఆరంభాన్ని తాను చూశానని అందుకు మొగలిపువ్వు, కామధేనువులే సాక్షి అని చెప్పాడట బ్రహ్మ. మొగలిపువ్వు అవును అని సమాధానమివ్వగా, కామధేనువు తలతో ఔనని, తోకతో కాదు అని సమాధానమిచ్చిందట. అందుకు ఆగ్రహించిన శివుడు ‘నువ్వు భూలోకంలో పూజాదికాలు లేకుండా ఉండుగాక’ అని బ్రహ్మను శపించాడట. అసత్యాన్ని పలికిన మొగలిపువ్వును పూజకు పనికి రావనీ, సగం నిజం, సగం అబద్ధం చెప్పిన ఆవు ముఖానికి పూజలేకుండా కేవలం పృష్టానికి మాత్రమే పూజలందుకుంటావనీ శపించాడట. ఆనాడు అలా వెలసిన అగ్నిస్తంభాన్ని బ్రహ్మ ప్రార్థన చేశాడట. ‘మా అహంకారం పోయింది. అసలు పరబ్రహ్మ స్వరూపమేదో, ఆద్యంతములు లేనిదేదో తెలిసింది. ఇక్కడ ఇదే స్వరూపంతో వెలిసిన మీరు భూ లోకంలో అజ్ఞానాన్ని పోగొట్టేందుకు అరుణాచలంలో అగ్నిలింగమన్న పేరుతో భక్తులను అనుగ్రహించాలి’ అని ప్రార్థన చేశారు. ఆ కారణంతోనే పరమశివుడు అరుణాచలంలో అగ్నిలింగంగా వెలశాడన్నది పురాణగాథ.

రుణాచలం ఎందరో సిద్ధ పురుషులకు ఆలవాలం. దేవతలు కూడా ఎప్పుడూ ప్రదక్షిణ చేస్తుంటారు. పర్వతం మొత్తం శివ స్వరూపం. అరుణాచలంలో ఒక మినహాయింపు ఉంది. ఆ పర్వతం చుట్టుపక్కల 24మైళ్ల దూరం దాని తేజస్సు పడుతుందట. అక్కడ ఏ దీక్షా అవసరం లేదట. ఇందుకు రమణ మహర్షి జీవితంలో జరిగిన ఓ ఘటనను ఉదాహరణగా చెబుతారు. భగవాన్‌ రమణ మహర్షి అరుణాచలం పర్వతంపై గల విరూపాక్ష గుహలో తెల్లటి కౌపీనం ధరించి ఉన్నారట. ఆ సమయంలో శృంగగిరి పీఠం నుంచి ఓ పండితుడు వచ్చి.. ‘అయ్యా! మీరు అన్నీ విడిచిపెట్టేశారు. ఏ బంధనాలు లేవు. ఇలా తెల్లటి గోచి పెట్టుకుని ఉండటం కన్నా సన్యాసం స్వీకరించి, కాషాయ వస్త్రాలు ధరిస్తే బాగుంటుంది. సన్యాసం కాదంటే ఓ కాషాయ కౌపీనం ధరిస్తే బాగుంటుంది’ అని సలహా ఇచ్చారట. అందుకు రమణ మహర్షి ఏ సమాధానం ఇవ్వలేదట. తాను మళ్లీ వస్తానని మనసు మార్చుకుంటే చెప్పండి అని ఆ పండితుడు వెళ్లిపోయారట. కొద్దిసేపటికి ఓ వృద్ధుడు పుస్తకాల సంచీతో అక్కడి వచ్చి ‘నేను స్నానం చేయలేదు. ఈ మూట చూస్తూ ఉండు’ అంటూ రమణ మహర్షికి చెప్పి వెళ్లిపోయాడట. పుస్తకాల మూటను విప్పి చూసిన రమణులు అందులో పైనున్న పుస్తకాన్ని తెరచి చూశారు. అది సంస్కృతంలో ఉన్న ‘అరుణాచల మహత్యం’ అనే పుస్తకం. గిరి పర్వతం చుట్టుపక్కల 24 మైళ్ల వరకూ ఏ దీక్షా నియమాలు ఉండవని అందులో రాసి ఉందట. పరమ శివుడే వృద్ధుడి రూపంలో వచ్చి రమణ మహర్షికి పుస్తకాలను అందజేశారని చెబుతారు. ఆ పుస్తకాన్ని చూపితే పండితుడు మారు మాట్లాడకుండా వెళ్లిపోయాడట.
పర్వత గుహలో దక్షిణామూర్తి!
అరుణాచలం పర్వతం లోపల మధ్యలో ఓ పెద్ద గుహ ఉందట. అక్కడ ఓ పెద్ద మర్రిచెట్టు ఉంటుందని దాని కింద దక్షిణామూర్తి స్వరూపుడై సిద్ధయోగిగా పరమశివుడు ఇప్పటికీ కూర్చుని ఉంటాడని నమ్మకం. అయితే అక్కడకు వెళ్లాలని ప్రయత్నించిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చివరకు వెనుతిరిగి వచ్చేశారట. అలా దక్షిణామూర్తిని దర్శించాలని బయలుదేరి వెనుదిరిగిన వారిలో రమణ మహర్షి కూడా ఉన్నారట.
అరుణాచలం పరమ సత్యమైన క్షేత్రం. శివుడు లింగరూపంలో ఆవిర్భవించిన తర్వాత అక్కడ నిర్వహించవలసిన పూజాది కార్యక్రమాలు ఎలా చేయాలనే విషయాన్ని ఆయనే నిర్ణయించి, గౌతమ మహర్షిని ఆదేశించారట. అరుణాచలంలో ఏయే సేవలు ఉండాలి.. ఏ ఆలయాలు ఉండాలి.. ఏ పూజలు చేయాలి.. అని నిర్ణయం చేసిన వారు గౌతమ మహర్షి. ఈ క్షేత్రానికి కాల భైరవుడు క్షేత్రపాలకుడు. స్థల వృక్షం ఇప్ప చెట్టు. అబిత కుచాంబ అనే పేరుతో అమ్మవారు ఇక్కడ ఉంటారు. విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి, పాతాళ లింగ కూడా ఉంటాయి.

ముఖ్యమైనవి మూడు ఉత్సవాలు
అరుణాచలంలో ముఖ్యంగా మూడు ఉత్సవాలు జరుగుతాయి. ఆలయంలో వలయాకారపు మండపం ఉంటుంది. అక్కడ అమ్మవారికి గాజుల్ని సమర్పించుకుంటారు. కార్తీక మాసంలో జరిగే మరో గొప్ప ఉత్సవం... దీపోత్సవం. దీనిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక కనుల పండువగా జరిగే ఉత్సవం పార్వతీ పరమేశ్వరుల మధ్య వచ్చే ప్రణయ కలహోత్సవం. ఎందుకు వారి మధ్య ప్రణయ కలహం వచ్చిందటే.. ఇందుకు ఓ పురాణగాథను చెబుతారు. ప్రమధ గణాల్లో భృంగి ఒకడు. ఆయన శివుడికి మాత్రమే భక్తుడు. కేవలం ఆయనకు మాత్రమే ప్రదక్షిణ చేసేవాడు. ఇలా రోజూ చేస్తుండటంతో ఓ రోజు అమ్మవారికి ఆగ్రహం వచ్చిందట. ఏం చేస్తాడో చూద్దామని భృంగి వస్తుంటే అమ్మవారు పరమశివుడి వామార్ధం (ఎడమభాగం)లోకి వెళ్లిపోయి అర్ధనారీశ్వర రూపాన్ని ధరించారట. అదే సమయానికి అక్కడకు వచ్చిన భృంగి తేనెటీగలా మారిపోయి పరమ శివుడికి, అమ్మవారికీ మధ్య రంధ్రం చేసి ప్రదక్షిణ చేశాడట. దీంతో ఆయన భక్తికి మెచ్చిన శివుడు మోక్షం ఇస్తాననీ, ఇవ్వకూడదని అమ్మవారూ... ఇరువురూ కలహించుకొన్నారని గాథ.
ఆదిదంపతుల గాథను స్ఫూర్తిగా తీసుకొని అర్చకులు అరుణాచలంలో అత్యంత వైభవంగా ప్రణయ కలహోత్సవం చేస్తారట. ఈ సందర్భంగా పరమశివుడు భృంగికి మోక్షం ఇవ్వడం, దీంతో పార్వతీ దేవికి కోపం వచ్చి అబిత కుచాంబ ఆలయంలోకి వెళ్లి తలుపేసుకుంటుంది. పరమశివుడు ఒక్కడే గిరి ప్రదక్షిణకు వెళ్తే దొంగలు దోచుకుంటారు. ఇప్పటికీ ఈ దొంగలతోపును ఆనవాయితీగా చేస్తున్నారు.
గోపురాల విశిష్టత
అరుణాచల దివ్య క్షేత్రానికి ఎంత గొప్ప పేరుందో అక్కడి గోపురాలకు అంతే విశిష్టత ఉంది. అందుకు సంబంధించి కొన్ని కథలూ ప్రచారంలో ఉన్నాయి. తూర్పు వైపు గోపురం శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. అదో అద్భుత కట్టడం. ఇక ఉత్తర దిక్కున ఉన్న గోపురాన్ని ఓ మహిళ కట్టించారట. ఆమె పేరు అమ్మణి అమ్మన్‌. పరమశివుడి అనుగ్రహం వల్ల యోగశక్తిలో సిద్ధహస్తురాలయ్యారు. ఆమె ప్రతీ ఇంటికి వెళ్లి ‘గోపురం కడుతున్నాం దానం చేయండి’ అని అర్థించేవారట. డబ్బులు లేవు అని చెబుతారేమోనని వారి ఇళ్లలోని ఇనుప పెట్టెలు ఎక్కడ ఉన్నవి.. అందులో ఎంత సొమ్ము ఉన్నదీ చెప్పేసేవారట. దీంతో భయపడి విరాళం ఇచ్చేవారని వాటితోనే ఆమె ఉత్తర గోపురాన్ని కట్టారని చెబుతుంటారు.