శ్రీకాకుళేశ్వర స్వామి: తెలుగువారి మహావిష్ణువు

ఆంధ్ర వల్లభుడు... ఆంధ్ర నాయకుడు... ఆంధ్ర మహావిష్ణువు... ఇంకా మరెన్నో పేర్లతో భక్తుల పూజలందుకుంటున్నాడు శ్రీకాకుళేశ్వరస్వామి. కలియుగంలో పాపభారం తగ్గించేందుకు ఈ స్వామి ఆవిర్భవించాడని భక్తుల విశ్వాసం. కృష్ణాజిల్లాలోని ఈ క్షేత్రానికి చారిత్రకంగానూ పౌరాణికంగానూ ఎంతో ప్రాధాన్యముంది...

Updated : 16 Sep 2023 06:51 IST

ఆంధ్ర వల్లభుడు... ఆంధ్ర నాయకుడు... ఆంధ్ర మహావిష్ణువు... ఇంకా మరెన్నో పేర్లతో భక్తుల పూజలందుకుంటున్నాడు శ్రీకాకుళేశ్వరస్వామి. కలియుగంలో పాపభారం తగ్గించేందుకు ఈ స్వామి ఆవిర్భవించాడని భక్తుల విశ్వాసం. కృష్ణాజిల్లాలోని ఈ క్షేత్రానికి చారిత్రకంగానూ పౌరాణికంగానూ ఎంతో ప్రాధాన్యముంది.

శ్రీకాకుళేశ్వరస్వామి... కృష్ణాజిల్లా ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం గ్రామంలో కొలువై ఉన్నాడు. ప్రసిద్ధి చెందిన 108 పుణ్యక్షేత్రాల్లో ఇది 57వదిగా చెబుతారు. శ్రీకాకుళంలో స్వామివారు స్వయంభువుగా వెలసి పాపాలను హరిస్తున్నాడని భక్తుల నమ్మిక. ఈ శ్రీకాకుళ క్షేత్రం సాక్షాత్తూ బ్రహ్మదేవుని ప్రయత్నం మేరకే ఉద్భవించిందని ఒక పురాణ కథనం.

కలియుగంలో రోజురోజుకీ పాపాలు పెరిగిపోతున్నాయని దేవతలంతా వ్యాకులత చెందారట. వాళ్లంతా చతుర్ముఖ బ్రహ్మతో సహా భూలోకానికి వచ్చి ఒక ప్రదేశంలో మహావిష్ణువు కోసం తపస్సు ప్రారంభించారు. ఆ తపస్సుకి మెచ్చి మహావిష్ణువు ప్రత్యక్షం కాగా... ‘భూలోకంలో ఈ ప్రాంతంలోనే మీరు కొలువై ఉండి భక్తుల పాపాలను హరించాలని’ వారు కోరారట. అందుకు నారాయణుడు సమ్మతించడంతో చతుర్ముఖ బ్రహ్మే స్వయంగా శ్రీమహావిష్ణువును అక్కడ ప్రతిష్ఠించాడట. బ్రహ్మకు ఆకులమైనందుకు కాకుళమని పేరు వచ్చిందనీ శ్రీహరి ఆచోటనే ప్రతిష్ఠితుడైనందుకు కాకుళేశ్వరుడిగా కీర్తినొందాడని పురాణ కథనం.

కొన్నాళ్లు అదృశ్యం

ఉపనిషత్తుల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు వరుసగా సంస్కృత, ఆంధ్ర, ప్రాకృత భాషలు అత్యంత ప్రియమైనవి. ఆంధ్రభాషపై ప్రీతిగల మహావిష్ణువే శ్రీకాకుళంలో కొలువుదీరాడనీ పురాణోక్తి. ప్రాచీనకాలంలో ఇక్కడికి సమీపంలోనున్న నదీమార్గాన వ్యాపారాలు జరుగుతుండేవి. దారినపోయే నావికులు ఈ ప్రాంతానికి వచ్చి స్వామిని దర్శించుకుని వెళ్లేవారట. వాళ్లంతా ఈ ప్రాంతాన్ని సిరికొలను, సిరికికొలను అని పిలిచేవారట. అదే కాలక్రమేణా శ్రీకాకుళంగా మారిందని చెబుతారు. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలోనే ఇక్కడ స్వామికి ఆలయం ఉండేదట. ఆపై ఇక్కడి స్వామి అదృశ్యమైపోయాడట. దాదాపు వెయ్యేళ్లపాటు ఎవ్వరికీ కనిపించలేదట. ఆ తరువాత కొన్నాళ్లకి... ఒరిస్సా పాలకుడైన అంగపాలుడి ప్రధానమంత్రి నరసింహవర్మ ఓసారి కాంచీపురానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో కృష్ణాతీరానున్న శ్రీకాకుళానికి వచ్చాడు. ఈ క్షేత్ర మహిమ తెలుసుకుని, అదృశ్యమైన విగ్రహం ఎక్కడుందో కనిపెట్టి పునఃప్రతిష్ఠ చేయాలని నిర్ణయించుకున్నాడట. దానికోసం ఎన్నో గ్రామాల్లో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడట. ఓరోజు రాత్రి స్వామి ఆయన కలలో కనిపించి వేమశర్మ అనే బ్రాహ్మణుడి ఇంటి ఆవరణలో ఉన్నానని చెప్పాడట. వెంటనే నరసింహవర్మ ఆ ప్రాంతానికి వెళ్లి తవ్వకాలు జరపగా విగ్రహం బయటపడింది. దాన్ని శ్రీకాకుళానికి తీసుకొచ్చి పునఃప్రతిష్ఠించినట్లు చెబుతారు.

ఆముక్తమాల్యద ఇక్కడే!

రాజ్యవిస్తరణలో భాగంగా శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రాంతానికి ఓరోజు వచ్చారు. శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణువుని దర్శించుకుని ఆ రాత్రికి వూళ్లొనే బసచేశారు. రాయలుకి ఆ రాత్రి స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి ఆంధ్ర కావ్యాన్ని రచించమని ఆదేశించాడట. దాంతో ‘ఆముక్తమాల్యద’ రచనకు రాయలవారు ఇక్కడే ఉపక్రమించారని చెబుతారు. ఆలయ ఆవరణలో ఆగ్నేయమూల 16 స్తంభాల మండపంలో ఈ రచనను రాయలు ప్రారంభించారు. దాంతో ఆ మండపానికి ఆముక్తమాల్యద మండపంగా పేరు స్థిరపడిపోయింది. మంటపం మధ్యలో రాయలవారి విగ్రహం కూడా ఇప్పుడుంది. ఈ దేవాలయం గోడలపై 12, 13వ శతాబ్దాల నాటి శాసనాలు 30కిపైగా ఉన్నాయి. స్వామివారి పంచలోహ విగ్రహాన్ని 1205లో బృగుమళ్ల అనంతభోగయ్య చేయించి ఇచ్చినట్లు విగ్రహంపైనున్న శాసనం ద్వారా తెలుస్తోంది. విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఈ ప్రాంతం గోల్కొండ నవాబుల పాలనలోకి వెళ్లింది. ఆ తరువాత దేవరకొండ ప్రభువైన యార్లగడ్డ కోదండరామన్న ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాడని చరిత్ర. ఇప్పటికీ చల్లపల్లి జమిందారులైన యార్లగడ్డ వంశీయులే అనువంశిక ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. నారాయణతీర్థులవారు ‘శ్రీకృష్ణలీలా తరంగిణి’లో ఆంధ్రమహావిష్ణువుని కీర్తించారు. శ్రీనాథుడు కూడా క్రీడాభిరామంలో ఈక్షేత్ర మహిమనూ తిరునాళ్ల వైభవాన్నీ కొనియాడాడు.

ఆలయానికి సమీపంలోనున్న కృష్ణానదిలో స్నానమాచరించి స్వామిని దర్శిస్తే పాపపరిహారమౌతుందని భక్తుల నమ్మకం. వైకుంఠ ఏకాదశినాడు శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీకాకుళేశ్వర స్వామిని ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందనీ చెబుతారు. ప్రతీయేటా వైశాఖమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. విజయవాడ నుంచి దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళానికి కొడాలి మీదుగా బస్సులో రావొచ్చు. విజయవాడ నుంచి నేరుగా బస్సులున్నాయి. కొడాలి నుంచి ఆరుకిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళానికి ఆటోల్లోనూ వెళ్లొచ్చు.

- సీహెచ్‌.జగన్మోహనరావు, న్యూస్‌టుడే, విజయవాడ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని