నాగుల రక్షకుడు ‘సుబ్రమణ్య’

జగన్మాత పార్వతీదేవి, లయకారకుడు పరమేశ్వరుల రెండో పుత్రరత్నం శ్రీ సుబ్రమణ్యస్వామి. నెమలిని వాహనంగా వేలాయుధాన్ని చేతబూని యావత్‌ దేవతాసైన్యానికి ఆయన సేనానిగా వ్యవహరిస్తారు. తన కంటే పెద్దవాడయిన విఘ్నేశ్వరునితో కలిసి అనేక శిష్టరక్షణ కోసం అనేక యుద్ధాలు చేశారు. షణ్ముఖుడికి దక్షిణ భారతంలో గుడులు ఎక్కువగా వున్నాయి. వీటిలో మహిమాన్వితమైనది కర్ణాటకలోని కుక్కెలో వెలసిన శ్రీసుబ్రమణ్యస్వామి ఆలయం....

Updated : 14 Mar 2023 19:19 IST

జగన్మాత పార్వతీదేవి, లయకారకుడు పరమేశ్వరుల రెండో పుత్రరత్నం శ్రీ సుబ్రమణ్యస్వామి. నెమలిని వాహనంగా వేలాయుధాన్ని చేతబూని యావత్‌ దేవతాసైన్యానికి ఆయన సేనానిగా వ్యవహరిస్తారు. తన కంటే పెద్దవాడయిన విఘ్నేశ్వరునితో కలిసి అనేక శిష్టరక్షణ కోసం అనేక యుద్ధాలు చేశారు. షణ్ముఖుడికి దక్షిణ భారతంలో గుడులు ఎక్కువగా వున్నాయి. వీటిలో మహిమాన్వితమైనది కర్ణాటకలోని కుక్కెలో వెలసిన శ్రీసుబ్రమణ్యస్వామి ఆలయం.

ప్రకృతి ఒడిలో

పశ్చిమ కనుమల్లోని సుందర దక్షిణ కన్నడ జిల్లాలోని సులియా తాలుకాలోని కుక్కె గ్రామంలో స్వామివారు నాగులకు రక్షణగావెలిసినిత్యపూజలందుకుంటున్నారు. చుట్టూ కుమార పర్వతశ్రేణుల మధ్య ప్రకృతి ఒడిలో నెలకొన్న స్వామివారు నాగులకు అభయమివ్వడంతో పాటు అశేష భక్తజనులకు అభయమిస్తున్నారు.

పురాణచరిత్ర

 సుబ్రమణ్వస్వామి, వినాయకునితో కలిసి తారకాసురునిపై యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో అసుర సంహారం జరుగుతుంది. అనంతరం ఇక్కడ విశ్రమించిన స్వామి వేలాయుధాన్ని ధార నదిలో పరిశుభ్రంచేస్తారు. దీంతో ఈ నదిని కుమారధార అని పిలుస్తారు. రాక్షస సంహారం చేసిన కుమారస్వామికి దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనతో మార్గశిర శుద్ధ దశమి నాడు వివాహం జరిపిస్తారు. సాక్షాత్తూ స్వామివారి వివాహవేదిక కావడంతో ఈ క్షేత్రం మరింత ప్రాశస్త్యం చెందింది. పశ్చిమ కనుమల్లోని ఏడు పరశురామ ప్రతిష్టాపిత క్షేత్రాల్లో కుక్కె సుబ్రమణ్య ఒకటి కావడం విశేషం. శంకర భగవత్‌పాదులు సుబ్రమణ్య భుజంగ స్తోత్రంలో కుక్కెలింగ అని ప్రస్తావించారు.

నాగులకు రక్షకుడు: నాగులలో శ్రేష్టుడు వాసుకి. ఆయన క్షీరసాగర మథనంలో కవ్వానికి తాడులాగా వ్యవహరించాడు. గరుత్మంతుడి బారినుంచి రక్షించాలని కోరుతూ ఇక్కడ కొండల్లో అనేక కఠోరమైన తపస్సు చేశాడు. తపస్సుకు అనుగ్రహించిన మహేశ్వరుడు అతనికి వరమివ్వాలని సుబ్రమణ్యస్వామిని ఆదేశిస్తారు. దీంతో స్కందుడు వాసుకికి ప్రత్యక్షమై కుక్కె క్షేత్రంలో నాగులకు రక్షణ వుంటుందని వరమిస్తాడు. దీంతో నాగులకు ఇది రక్షణ క్షేత్రమైంది. ఇప్పటికీ ఈ క్షేత్రంలో అనేక వందల సర్పాలను మనం చూడవచ్చు. ఆది సుబ్రమణ్య మందిరంలో అనేక పుట్టలు వుంటాయి.

 ఆదిశేషు, వాసుకిలపై స్వామివారు.. ప్రధాన మందిరంలోని స్వామి ఆదిశేషు, వాసుకిలపైన వుండి పూజలను అందుకుంటారు. సర్పదోష నివారణ పూజలకు ఈ క్షేత్రం ప్రసిద్ధి. సర్పసంస్కార, నాగ ప్రతిష్ట, ఆశ్లేషబలి... తదితర పూజలను నిర్వహిస్తారు.

కుమారధారలో పవిత్రస్నానం..  శ్రీ సుబ్రమణ్యస్వామి, దేవసేనల వివాహం సందర్భంగా పలు పవిత్ర నదీజలాలను దేవతలు కుమారధారలో కలిపారు. స్వామివారి ఆయుధం వేలాయుధం ప్రత్యక్షంగా మునిగిన ప్రాంతం కావడంతో కుమారధారలో పలువురు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ నీటితో పలు రకాల జబ్బులు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢవిశ్వాసం.

ఎలా చేరుకోవచ్చు..    

మంగళూరు నుంచి 100 కి.మీ. దూరంలో వుంది. మంగళూరు విమానాశ్రయం నుంచి వాహనాల ద్వారా చేరుకోవచ్చు.మంగళూరు రైల్వేస్టేషన్‌ , బస్‌స్టాండ్‌ నుంచి బస్సు సౌకర్యముంది.  బెంగళూరు నుంచి మంగళూరు వెళ్లే రైళ్లు సుబ్రమణ్య మీదుగా వెళుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని