తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం అత్యంత పురాతనమైన ఆలయం. సమున్నత గోపురాలతో, అపురూప శిల్ప కళాసంపదతో అలరిస్తున్న ఈ దేవాలయం వెయ్యి సంవత్సరాలకు పైగా నిత్యం పూజలందుకుంటోంది. శయనమూర్తిగా ఉన్న స్వామి వారి దర్శనం అనేక పాపాలను తొలగిస్తుంది. తిరుమల వెళ్లే యాత్రికులు ...

Updated : 14 Mar 2023 18:59 IST

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం అత్యంత పురాతనమైన ఆలయం. సమున్నత గోపురాలతో, అపురూప శిల్ప కళాసంపదతో అలరిస్తున్న ఈ దేవాలయం వెయ్యి సంవత్సరాలకు పైగా నిత్యం పూజలందుకుంటోంది. శయనమూర్తిగా ఉన్న స్వామి వారి దర్శనం అనేక పాపాలను తొలగిస్తుంది. తిరుమల వెళ్లే యాత్రికులు ఇక్కడ స్వామిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. నిత్యం వేలాదిమందియాత్రికులతో రద్దీగా ఉండే శ్రీ గోవిందరాజస్వామి కోవెల ఎప్పుడూ సందడిగానే ఉంటుంది.

ఆలయ చరిత్ర .. తిరుపతి నగరం ఏర్పడక ముందే ఈ ఆలయ నిర్మాణం జరగడం విశేషం.పదకొండవ శతాబ్దంలో చోళ రాజైన కుళొత్తంగ చోళుని పాలన కాలంలో శ్రీమద్‌ రామానుజాచార్యులు తిరుమల క్షేత్రానికి వచ్చారు. ఆ కాలంలో కొండ దిగువ ప్రాంతంలో కొత్తూరు అనే కుగ్రామం ఉండేది. తమిళనాడులోని చిదంబరం నుంచి

తెప్పించిన గోవిందరాజస్వామి విగ్రహానికి సంప్రదాయకంగా పూజలు నిర్వహించి ఆయన ప్రతిష్టించారు. ఆ ఆలయమే ఇది. ఈ ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని నూతన పట్టణం ఏర్పడింది. అదే అభివృద్ధి చెందిన తిరుపతిమహానగరి. గోవిందరాజులు వెలసినారు కాబట్టి గోవిందరాజపట్టణం అనీ, రామానుజచార్యుల వారు ప్రతిష్టించారు కనుక రామానుజపురం అనీ పిలిచేవారు. కాలక్రమేణ తిరుపతిగా మారింది. తిరు అంటే తమిళంలో శ్రీ అని అర్థం. శ్రీపతి అంటే వేంకటేశ్వరస్వామి అని కూడా అర్థం.

శ్రీనివాసునికి అన్నగా...

స్థానికులు, కొన్ని కథనాల ప్రకారం శ్రీ గోవిందరాజస్వామి తిరుమల శ్రీనివాసునికి అన్నగా పేరొందారు. కొండమీద వడ్డీకాసుల్ని కొలవడంతోఅలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారని చెబుతారు. అందుకు తగ్గట్టే కుంచాన్నే తలగడగా చేసుకొని స్వామి నిద్రపోతున్న విగ్రహాన్ని ఇక్కడ వీక్షించవచ్చు. ప్రతి ఏడాది కార్తీక
మాసం కృతికా నక్షత్ర సమయంలో అన్న తిరుమంజనానికి తిరుమల నుంచి మంచినూనె, తమలపాకులు వస్తాయి. తన అన్న కోసం తమ్ముడు వాటిని పంపిస్తాడు.
అమ్మవారు.. శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో అమ్మవారు పుండరీకవల్లి పేరుతో భక్తులకు దర్శనమిస్తారు. శాలైనాట్చియార్‌ పేరిట ఆమెకు ప్రత్యేకమైన ఆలయం ఉండటం విశేషం. అలాగే వైకుంఠ నాథుని సుదర్శనచక్రానికి మందిరం ఉంది. ఆళ్వారులు పెరియాళ్వార్‌, పొయిగై, పూదత్త, తిరుమాళిశై, నమ్మాళ్వారుల ఆలయాలను చూడవచ్చు. వైష్ణవ గురువుల్లో అగ్రగణ్యులైన రామానుజాచార్య, వేదాంత దేశిక, మాణవాళ ముని, తిరుమల నంబిలకు ప్రత్యేకమైన గుడులున్నాయి.
పుష్కరిణి ..ఆలయానికి సమీపంలోనే పుష్కరిణి ఉంది. నాలుగు వైపులా విశాలమైన మెట్లతో నిర్మించిన పుష్కరిణి తిరుపతి నగరంలో జరిగే పలు కార్యక్రమాలకు వేదికగా నిలుస్తోంది. శ్రీగోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడ తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.

శిల్పకళ ..ఆలయం ప్రహరీ గోడలపై పలు శాసనాలు కనిపిస్తాయి. ప్రధాన గోపురం వద్ద శిల్పకళ అందర్నీ ఆకర్షిస్తుంది. ఆలయానికి ఉత్తరంగా ఉన్న మ్యూజియంలో పలు శిల్పకళా రీతులను చూడవచ్చు.

ఎలా చేరుకోవచ్చు..

> తిరుపతికి దేశంలోని అన్ని ప్రాంతాలతో రవాణా సౌకర్యముంది.
> తిరుమలకు వెళ్లే యాత్రికులు తిరుపతిలోని స్వామివారిని దర్శించేందుకు అన్ని సౌకర్యాలను తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది.
> తిరుపతి రైల్వేస్టేషన్‌కు సమీపంలోనే ఈ ఆలయం ఉంది.
> ప్రధాన బస్‌ స్టాండ్‌ నుంచీ ఆలయానికి చేరుకోవచ్చు.
> రేణిగుంట విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి వివిధ వాహనాలతో శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకునే సదుపాయముంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని