జగన్మాత తపస్సు చేసిన దివ్యక్షేత్ర.. ఏకాంబరేశ్వర ఆలయం

తమిళనాడులోని కాంచీపురం క్షేత్రమంటేనే దేవాలయాలకు పెట్టింది పేరు. పంచభూత లింగాల్లో పృథ్వీలింగం, తేజోలింగం, ఆకాశలింగం, జలలింగం, వాయులింగం ఉంటే.... ఒక్క వాయులింగం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో ఉంటే మిగిలిన అన్ని లింగాలు తమిళనాడులోనే ఉన్నాయి. వాటిలోని...

Updated : 14 Mar 2023 18:54 IST

తమిళనాడులోని కాంచీపురం క్షేత్రమంటేనే దేవాలయాలకు పెట్టింది పేరు. పంచభూత లింగాల్లో పృథ్వీలింగం, తేజోలింగం, ఆకాశలింగం, జలలింగం, వాయులింగం ఉంటే.... ఒక్క వాయులింగం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో ఉంటే మిగిలిన అన్ని లింగాలు తమిళనాడులోనే ఉన్నాయి. వాటిలోని పృథ్వీలింగం కాంచీపురం క్షేత్రంలో కొలువై విరాజిల్లుతోంది.

స్థల పురాణం

ఏకామ్రం అంటే ఒక్క మామిడి చెట్టు. ఏకామ్రేశ్వరస్వామి అంటే ఒక్క మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం. ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు కనుక ఇది పృథ్వీ లింగం. ఈ ఆలయాన్ని చోళులు, విజయనగర రాజులు నిర్మించారు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. ఆలయంలోని విగ్రహం మట్టితో చేసినది కావడం విశేషం. మూల విరాట్‌ విగ్రహం, ఉత్సవ విగ్రహం రెండు కూడా మట్టితో చేసినవి. ఆలయం దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. ఒక్కో గాలి గోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపలి మండపంలో 1000 స్తంభాలు ఉంటాయి. ఆలయంలో 1,008 శివలింగాలు ప్రతిష్ఠించి ఉంటాయి. ఈ దేవాలయంలో 3,500 సంవత్సరాల వయస్సు గల మామిడి చెట్టు ఉంది. పురాణాల ప్రకారం చెట్టులోని నాలుగు కొమ్మలకు నాలుగు రకాల రుచిగల పళ్లు వివిధ కాలాల్లో కాసేవి. సంతానం లేని దంపతులు ఈ చెట్టు నుంచి పడే పండును పట్టుకొని తింటే సంతానం కలుగుతుందని నమ్మకం. అయితే ప్రస్తుతం కేవలం చెట్టు కాండాన్ని మాత్రమే చూడగలం. కాండాన్ని ఆలయ అధికారులు అద్దాల పెట్టెలో పెట్టి భద్రపరిచారు. పురాతన మామిడి చెట్టు స్థానంలో కొత్త మామిడి చెట్టును నాటారు.
ఇక్కడ మరో విశేషం ఏమిటంటే మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు వధూవరులుగా దర్శనిమిస్తారు. పార్వతీదేవి ఒడిలో కుమారస్వామిని పెట్టుకుని దర్శనమిస్తుంది. ఇదే ప్రదేశంలో తపస్సు చేసుకుంటున్న అమ్మవారిని దర్శించవచ్చు.
అంతేకాకుండా 108 దివ్య వైష్ణవ క్షేత్రాల్లో ఒక దివ్య క్షేత్రమైన తిరునిలథింగల్‌ తుండం అనే ఆలయంలో విష్ణుమూర్తి కొలువైవుంటారు. పార్వతి దేవి మామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తున్నప్పుడు ఆమెను పరీక్షించాలనుకున్న శివుడు ఆమె మీదకు అగ్ని జ్వాలలను ప్రసరిస్తాడు. ఆ సమయంలో పార్వతి విష్ణువుని ప్రార్థిస్తుంది. విష్ణు మూర్తి శివుని తల మీద ఉన్న చంద్రుని నుంచి చల్లటి కిరణాలను పార్వతి దేవి మీదకు ప్రసరించేలా చేస్తాడు. అప్పుడు పార్వతి దేవి మీద ఉన్న అగ్నిజ్వాలలు చల్లబడతాయి. మరొకసారి తలమీద ఉన్న గంగను విడుదల చేయగా పార్వతీ దేవి గంగమ్మను ప్రార్థించి, తాను శివుని సతీమణి అని చెప్పగా గంగ శాంతించిందని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారి ఆత్మీయ ఆలింగనంతో పులకాంకితుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు స్థల పురాణం. ఆలయ చరిత్ర విశేషాలను ఆలయంలోనికి ప్రవేశించే ముందు ఎడమవైపున చిత్రాల రూపంలో చూడవచ్చు.
ఆలయంలో ప్రధానంగా తమిళ మాసమైన ఫంగుణిలో 13 రోజుల పాటు ఉత్సవాలు చేస్తారు. ఆ సమయంలో శివపార్వతుల కల్యాణాన్ని నిర్వహిస్తారు.

ఆలయ దర్శన వేళలు

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు ఆలయాన్ని తెరచి ఉంచుతారు.
ఎలా చేరుకోవాలి
కంచి క్షేత్రానికి బస్సు, రైలు మార్గాల ద్వారా చేరుకోవచ్చు.

బస్సు మార్గమైతే

>తిరుపతి నుంచి కంచికి నేరుగా బస్సులు ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి నేరుగా చెన్నై వెళ్లి అక్కడ్నుంచి కోయంబేడ్‌ బస్‌ స్టేషన్‌ నుంచి కంచికి బస్సులో వెళ్లవచ్చు.
> రైలు మార్గంలో వెళ్లాలంటే.. కర్నూలు మీదుగా చెన్నై వెళ్లే కాచిగూడ ఎగ్మోర్‌ ఎక్స్‌ప్రెస్‌, వారంలో ఒక్కసారి ఉండే స్పెషల్‌ ట్రైన్‌ ద్వారా వెళ్లొచ్చు. అరక్కోణం స్టేషన్‌లో దిగి అక్కడ్నుంచి కంచి వెళ్లాలి. లేదా నేరుగా చెన్నై వెళ్లి అక్కడ్నుంచి లోకల్‌ ట్రైన్‌ ద్వారా చేరుకోవచ్చు. మరో మార్గం రేణిగుంటకు నేరుగా ట్రైన్‌లో వెళ్లి అక్కడ్నుంచి పుదుచ్చేరి వెళ్లే రైలులో కంచికి వెళ్లొచ్చు.
>చెన్నై విమానాశ్రయం నుంచి ప్రైవేటు వాహనాల ద్వారా కంచి చేరుకోవచ్చు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని