అయినవిల్లి గణపతి
కోటి సూర్యులతో సమానంగా ప్రకాశించే ఆ స్వామిని స్తుతిస్తుంది. విఘ్నాలు తొలంగించి సకాలంలో పనులు పూర్తయ్యేలా అనుగ్రహించమని ప్రార్థిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో సుప్రసిద్ధ గణపతి ఆలయాల్లో అయినవిల్లి ఒకటి. ఇది స్వయంభూ గణపతి క్షేత్రం. కాణిపాకం తరువాత అంతటి ప్రాశస్త్యం దీనికి ఉంది.
వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా
అని భక్తకోటి కోటి సూర్యులతో సమానంగా ప్రకాశించే ఆ స్వామిని స్తుతిస్తుంది. విఘ్నాలు తొలంగించి సకాలంలో పనులు పూర్తయ్యేలా అనుగ్రహించమని ప్రార్థిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో సుప్రసిద్ధ గణపతి ఆలయాల్లో అయినవిల్లి ఒకటి. ఇది స్వయంభూ గణపతి క్షేత్రం. కాణిపాకం తరువాత అంతటి ప్రాశస్త్యం దీనికి ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కి.మీ, అమలాపురానికి 12 కి.మీ దూరంలో ఈ క్షేత్రం నెలకొంది. పవిత్ర గోదావరి నది ఒడ్డున, పచ్చని కోనసీమ అందాలు, సుందర ప్రశాంత వాతావరణం, ప్రకృతి రమణీయతలతో ఈ ఆలయం అలలారుతోంది. ఉమాసుతుడు ఇక్కడ సిద్ది వినాయకునిగా కొలువై భక్త జనాన్ని అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతల ఆలయాలూ ఉన్నాయి.
స్థల పురాణం
కృతయుగం నుంచే ఇక్కడ స్వామి కొలువై ఉన్నట్లు స్ధల పురాణం ద్వారా తెలుస్తోంది. దక్ష ప్రజాపతి ద్రాక్షరామంలో చేసిన దక్షయజ్ఞానికి ముందు ఇక్కడి వినాయకున్ని పూజించి పునీతుడయ్యాడని ప్రతీతి. వ్యాస మహర్షి దక్షణ యాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా.. దేవతలు ఆలయాన్ని నిర్మించారు. అనంతర కాలంలో నాటి తూర్పు చాళుక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్ధానాధీశుల వరకు ఎందరో ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధిలో భాగస్వాములయ్యారు.
క్షేత్ర ప్రత్యేకత
అయినవిల్లి ఆలయ ప్రస్తావన క్రీ.శ 14వ శతాబ్ధంలో శంకరభట్టు రచించిన శ్రీపాదవల్లభ చరిత్రలో ఉంది. శ్రీపాదవల్లభుల మాతామహులు అయినవిల్లిలో స్వర్ణ గణపతి యజ్ఞం చేసినట్లు.. యజ్ఞం ముగింపులో గణనాథుడు సర్ణమయకాంతులతో దర్శనమిచ్చి హారతులను స్వయంగా అందుకున్నట్లు అందులో పేర్కొన్నారు. శ్రీపాద వల్లభుని జననాన్ని తెలియజేశారని చెబుతారు.
దక్షిణాభిముఖంగా దర్శనం..
సాధారణంగా దేవాలయాల్లోని మూలవిరాట్ తూర్పు ముఖంగా దర్శనమిస్తారు. దీనికి భిన్నంగా ఇక్కడి సిద్ధి వినాయకుడు దక్షిణాభిముఖుడై భక్తకోటికి అభయమిస్తున్నాడు. అలాగే దక్షిణ సింహద్వారం ఉన్న గృహాలకు ఎలాంటి విఘ్నాలు కలగవని అయినవిల్లివాసుల నమ్మకం.
వివిధ ఉత్సవాలు..
ఇక్కడి సిద్ధి వినాయకుని మూలవిరాట్ అత్యంత ప్రాచీనమైంది. రోజూ స్వామికి వివిధ పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. అభిషేక సేవకు ఈ ఆలయంలో విశేష ప్రాముఖ్యం ఉంది. శివకేశవులకు ప్రీతికరమైన వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు పాంచాహ్నిక దీక్షతో అయిదు రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పూర్ణిమనాడు కల్యాణం.. గ్రామోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. భాద్రపద శుద్ధ చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. మకర సంక్రాంతి, కనుమనాడు ప్రభల ఉత్సవం చేస్తారు.
విజయదశమి, కార్తీకమాసం మొదటి, నాలుగు సోమవారాలు, కృష్ణాష్టమినాడు ప్రత్యేక పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఏటా మాఘ మాసంలో చదువుల పండుగ జరుగుతుంది. పండగలో భాగంగా గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి నదీ జలాలతో స్వామిని అభిషేకిస్తారు. లక్ష కలములను సిద్ది వినాయకుని పాదాల వద్ద ఉంచి... లక్ష దూర్వములతో పూజిస్తారు. అనంతరం ఆ పెన్నులను విద్యార్థులకు పంచుతారు. వీటితో పరీక్షలు రాస్తే మంచి ఉత్తీర్ణత సాధించడంతో పాటు, చదువులో రాణిస్తారని భక్తుల విశ్వాసం.
వివిధ ఆలయాలు...
అయినవిల్లి క్షేత్రంలో గణపతి ఆలయంతో పాటు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరాలయం, శ్రీదేవీ, భూదేవీ సమేత కేశవస్వామి ఆలయం, కాలభైరవ ఆలయాలు ఉన్నాయి.
ఇలా చేరుకోవాలి...
రాజమహేంద్రవరం నుంచి అయినవిల్లికి బస్సు సౌకర్యం ఉంది. అమలాపురం నుంచి బస్సు, ఆటోలో దేవాలయాన్ని చేరుకోవచ్చు. కాకినాడ నుంచి యానాం, అమలాపురం, ముక్తేశ్వరం మీదుగా అయినవిల్లి చేరుకోవచ్చు.
ఇతర సమాచారం
దేవాలయం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 8గంటల వరకు తెరిచి ఉంటుంది.
అభిషేకం ఉదయం 7 గం.ల నుంచి 11 గం. వరకు జరుగుతుంది. (సాధారణ రోజుల్లో)
సేవలు- రుసుము
అభిషేకం- రూ.150/-
శ్రీలక్ష్మీ గణపతి హోమం - రూ.300/-
వివిధ పండ్ల రసాలతో ఏకాదశ రుద్రాభిషేకం- రూ.250/-(వినాయక చవితి సందర్భంగా)
రుద్రాభిషేకం, లక్ష దూర్వార్చన- రూ.250/-(వినాయక చవితి సందర్భంగా)
శ్రీ గణపతి, సరస్వతీకల్ప ప్రయుక్త సప్తనదీజలాభిషేక, లక్ష కలముల వితరణ మహోత్సవం. - రూ.550/-(మాఘ మాసంలో)
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Tirumala : హనుమంత వాహనంపై మలయప్పస్వామి అభయం
-
Epuri Somanna: త్వరలో భారాసలోకి ఏపూరి సోమన్న
-
Hyderabad: ప్యాసింజర్ కష్టాలు.. 2017 సంవత్సరం నుంచి 161 రైళ్ల రద్దు
-
Andhra News : సీఎం కుటుంబానికి విదేశాల్లోనూ భద్రత
-
Khammam: ఒక్క కాలే అయినా.. మొక్కవోని ఆత్మవిశ్వాసం