సిరులిచ్చే కల్పవల్లి.. శ్రీ పైడితల్లి
ఉత్తరాంధ్రుల కల్పవల్లి... గజపతుల ఆడపడుచు.. వాత్సల్య తరంగిణి.. అమృత వర్సిణి.. సకల కల్యాణ గుణరూపిణి .. శ్రీపైడితల్లి అమ్మవారు. బొబ్బిలి యుద్ధం వద్దని అన్నను వారించి.. దాన్ని నిలువరించడానికి చివరివరకు ప్రయత్నించి.. అన్న మరణంతో తనువు చాలించి.. సమాజ హితమే తన అభిమతం అని ప్రబోధించిన ..
ఉత్తరాంధ్రుల కల్పవల్లి... గజపతుల ఆడపడుచు.. వాత్సల్య తరంగిణి.. అమృత వర్సిణి.. సకల కల్యాణ గుణరూపిణి .. శ్రీపైడితల్లి అమ్మవారు. బొబ్బిలి యుద్ధం వద్దని అన్నను వారించి.. దాన్ని నిలువరించడానికి చివరివరకు ప్రయత్నించి.. అన్న మరణంతో తనువు చాలించి.. సమాజ హితమే తన అభిమతం అని ప్రబోధించిన పుణ్యమూర్తి పైడిమాంబ. మనిషిగా పుట్టి లోకహితం కోసం పరితపించి దైవత్వాన్ని పొందిన ఆ తల్లి చరితం ఆదర్శనీయం. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో పైడితల్లి అమ్మవారి ఆలయం ఒకటి. ఈ ఆలయం విజయనగరం పట్టణంలో ఉంది. కొలిచిన వారికి కొంగుబంగారమై అమ్మవారు ఇక్కడ పూజలందుకుంటున్నది.
అమ్మవారి ప్రాశస్త్యం ఇదీ..
18వ శతాబ్దంలో విజయనగరాన్ని గజపతి వంశానికి చెందిన పూసపాటి పెద్ద విజయరామరాజు పాలించేవారు. ఆయన సోదరే పైడిమాంబ. విజయరామరాజుకు.. బొబ్బిలి సంస్థానాధీశుడు రాజా గోపాల కృష్ణరంగారావుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శత్రుత్వం ఉండేది. ఈ శత్రుత్వం చినికి చినికి గాలివానలా మారి బొబ్బిలి యుద్ధానికి దారి తీసింది. ఫ్రెంచ్ సేనాధిపతి బుస్స్తీ అండతో విజయ గజపతి.. బొబ్బిలిపై దాడికి దిగాడు. 1757 జనవరి 23న యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం విషయం తెలుసుకున్న పైడిమాంబ రణం వద్దని అన్నను వారించింది. యుద్ధమంటే వినాశనమని.. అబలల నుదుట అరుణాస్తమయమని తెలిపింది. జన, ధన, ప్రాణ హననాన్ని కళ్లకు కట్టేలా తన వాదనను వినిపించింది. అయినా, సోదరి మాటను విజయగజపతి పెడచెవిన పెట్టాడు. ఈ యుద్ధంలో ఫ్రెంచ్ ఫిరంగుల ధాటికి బొబ్బిలి కోట పూర్తిగా ధ్వంసమైంది. ఫ్రెంచ్ తుపాకుల ముందు బొబ్బిలి వాడి కత్తులు చిన్నబోయాయి. యుద్ధ సమయంలోనే పైడిమాంబకు మసూచి వ్యాధి సోకుతుంది. పూజలో ఉన్నప్పుడు తన అన్నకు ఆపద ఉందని దుర్గమ్మ దయతో తెలుసుకొని.. తన అనారోగ్య వార్తను తెలిపి యుద్ధాన్ని ఆపాలంటూ అన్నకు విన్నవించాల్సిందిగా పతివాడ అప్పలనాయుడు అనే సైనికుడితో వర్తమానం పంపుతుంది. వెనుకనే వదినతో కలిసి బయలుదేరుతుంది. విజయ గర్వంతో వున్న విజయరామరాజును తాండ్రపాపారాయుడు సంహరిస్తాడు. ఈ విషయం వనంతోట వద్దకు చేరుకొనే సమయానికి ఆమెకు తెలుస్తుంది. దీంతో పైడిమాంబ తీవ్ర ఆవేదనకు లోనై.. అన్నలేని లోకంలో తానూ ఉండలేనని పెద్దచెరువులో దూకి ఆత్మార్పణం చేసుకుంటుంది. మరునాడు అప్పలనాయుడు కలలో కనిపించి పెద్ద చెరువుకు పశ్చిమం వైపు తన విగ్రహం దొరుకుతుందని.. దానికి ఆలయం కట్టించాల్సిందిగా ఆదేశిస్తుంది. జాలరుల సహాయంతో పైడితల్లి విగ్రహాన్ని బయటకు తీసి చెరువు ఒడ్డున ఆలయం నిర్మించారు. నాటి నుంచి నేటి వరకు భక్తుల కోరికల్ని తీర్చే కల్పవల్లిగా విజయనగర గ్రామదేవతగా అమ్మవారు ఇక్కడ వెలుగొందుతోంది.
రాష్ట్ర్ర పండుగా సిరిమానోత్సవం
ఏటా విజయదశమి తరువాత వచ్చే తొలి సోమ, మంగళవారాల్లో విజయనగరంలో పైడిమాంబ జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది. అన్ని వర్గాలవారికి సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే సిరిమానోత్సవ కార్యక్రమం జాతరకే తలమానికగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిరిమానోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఆ పండుగ రోజున విజయనగర వీధులు ఇసుక వేస్తే రాలనంతగా జనంతో కిక్కిరిసి ఎంతో కోలాహలంగా ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు.
అమ్మ ఆజ్ఞతోనే అన్నీ..
జాతరకు కొన్నిరోజుల ముందే పైడిమాంబ.. ఆలయ ప్రధానార్చకుడి కలలో దర్శనమిస్తుంది. సిరిమానుకు కావలసిన చెట్టు ఏ దిశలో ఉందో తెలియజేస్తుంది. సిరిమాను తయారీకి చింత చెట్టునే ఉపయోగిస్తారు. అర్చకుడు ఆ సిరిమానుకు ప్రత్యేక పూజలు చేసి పట్టణానికి చేరుస్తారు. వనం గుడిలోని అమ్మకు దాన్ని చూపించి హుకుంపేట చేర్చి నిపుణుల సమక్షంలో అమ్మవారి ప్రతిరూపమైన సిరిమానుగా తీర్చిదిద్దుతారు. ఉత్సవ సమయంలో 50 అడుగుల ఈ సిరిమాను చివర ప్రత్యేక ఆసనం ఏర్పాటు చేసి.. దానిలో అమ్మవారి ప్రతినిధిగా పూజారిని కూర్చోబెట్టి నగరంలో ఊరేగిస్తారు. అరటిపళ్లను పూజారిపైకి విసురుతూ మొక్కులు తీర్చుకొనే ఆనవాయితీ అక్కడ కనిపిస్తుంది. చెదురు గుడి నుంచి బయలుదేరే సిరిమాను లక్షలాది భక్తజనుల జయజయ ధ్వానాల మధ్య విజయనగరం కోట వద్దకు చేరుతుంది. కోటకు మూడు సార్లు ప్రదక్షిణతో ఈ ఉత్సవం ముగుస్తుంది. దేవాలయ అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి వంశీయులు ఈ సందర్భంగా పూజారిని సత్కరిస్తారు. దీంతో ఉత్సవాలు ముగుస్తాయి.
ఎలా చేరుకోవాలి?
రాష్ట్ర్రంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి విజయనగరానికి బస్సు, రైలు సౌకర్యం ఉంది. విజయవాడ నుంచి ఒడిశా, ఆపై వెళ్లే రైళ్లన్నీ విజయనగరంలో ఆగుతాయి. అక్కడి నుంచి నగరం నడిబొడ్డున ఉన్న అమ్మవారి ఆలయానికి ఆటో, ఇతర వాహనాల్లో చేరుకోవచ్చు.
- అమ్ముల మోహిత్ నాగప్రసాద్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Leander Paes: టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు అరుదైన గుర్తింపు
-
Babar Azam: టాప్-4 చిన్న విషయం.. ప్రపంచకప్ గెలవడమే మా లక్ష్యం : బాబర్ అజామ్
-
Guntur Kaaram: రాజమౌళి చిత్రాల స్థాయిలో ‘గుంటూరు కారం’.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా: నిర్మాత నాగవంశీ
-
JP Nadda : జేపీ నడ్డా పూజలు చేస్తున్న గణేశ్ మండపంలో అగ్నిప్రమాదం
-
Priyamani: ప్రియమణి విషయంలో మరో రూమర్.. స్టార్ హీరోకి తల్లిగా!
-
Sharad Pawar: ‘ఇండియా’లోకి అన్నాడీఎంకేను తీసుకొస్తారా..? శరద్‌పవార్ ఏమన్నారంటే..