పాకిస్థాన్‌లోని శక్తిపీఠం: హింగ్లాజ్ దేవీ ఆలయం

పురాణ గాథలు, ఆచారాల పరంగా లయకారకుడైన పరమ శివుడి అర్ధాంగి పార్వతిదేవిని ఆరాధించే ఆలయాలు ఉన్న మహిమాన్విత ప్రదేశాలను శక్తి పీఠాలుగా పేర్కొంటారు. అసలు శక్తి పీఠాలు ఎన్ని? మనదేశంలో చాలామందికి తెలిసిన శక్తి పీఠాలు 18. అయితే, ‘ప్రాణేశ్వరీ ప్రాణధాత్రీ పంచాశత్పీఠరూపిణీ’ అని లలితా సహస్రనామావళి 51శక్తి

Updated : 14 Mar 2023 12:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పురాణ గాథలు, ఆచారాల పరంగా లయకారకుడైన పరమ శివుడి అర్ధాంగి పార్వతిదేవిని ఆరాధించే ఆలయాలు ఉన్న మహిమాన్విత ప్రదేశాలను శక్తి పీఠాలుగా పేర్కొంటారు. అసలు శక్తి పీఠాలు ఎన్ని? మనదేశంలో చాలామందికి తెలిసిన శక్తి పీఠాలు 18. అయితే, ‘ప్రాణేశ్వరీ ప్రాణధాత్రీ పంచాశత్పీఠరూపిణీ’ అని లలితా సహస్రనామావళి 51శక్తి పీఠాలు ఉన్నట్లు చెబుతోంది. పురాణ గ్రంథాలను పరిశీలిస్తే, 108 శక్తి పీఠాలు ఉన్నట్లు తెలియజేస్తున్నాయి. కాళీ పురాణంలో 18 శక్తి పీఠాల గురించి చెబితే, దేవీ భాగవతంలో 66 శక్తి పీఠాలు ఉన్నట్లు చెప్పారు. శక్తి పీఠాలను అర్థం చేసుకోవడానికి పురాణ ప్రాతిపదిక కొంత మేరకు ఉపయోగపడితే, ఉపాసన పరమైన శాస్త్రం మరికొంత ఉంటుంది. యోగశాస్త్రంలోనూ, మంత్రశాస్త్రంలోనూ ఈ శక్తి పీఠాల ప్రస్తావనం ఉంది.  చైతన్యానికి ఆవాసం మానవ దేహం. 51 శక్తులు మన శరీరంలో అంతర్లీనమై ఈ దేహాన్ని నడిపిస్తున్నాయని చెబుతారు. కళ్లు, చెవులు, పాదాలు, చేతులు ఇలా ప్రతిది ఒక శక్తికి ప్రతీక. అవన్నీ కలిసిన దేహమే శక్తి రూపం. 
•ఇలా దేశంలోని అష్టాదశ శక్తి పీఠాల గురించి మనకు ఈ శ్లోకం తెలియజేస్తుంది. అయితే, 51 శక్తి పీఠాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అందులో తప్పకుండా ఉండే శక్తి పీఠం హింగ్లాజ్‌ దేవి. ప్రస్తుత పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌ రాష్ట్రంలో ఉందీ శక్తి పీఠం. పాకిస్థానీయులు ఈ ఆలయాన్ని నానీ మందిరంగా పిలుస్తారు. 

ఇది పురాణగాథ

•దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి (దాక్షాయణి). కైలాస పర్వతంపై నిత్యం ధ్యానంలో ఉండే పరమశివుడిని చూసి మోహిస్తుంది. ఆ లయకారుడినే తన ప్రాణనాథుడిగా భావిస్తుంది. తండ్రి మాటను కాదని, దేవదేవుడిని వివాహమాడుతుంది. తన నిర్ణయానికి విరుద్ధంగా శివుడిని పరిణయమాడటం ఇష్టం లేని దక్షుడు కోపంతో బృహస్పతియాగాన్ని తలపెడతాడు. దేవతలందరినీ ఆహ్వానిస్తాడు కానీ, తన కుమార్తె సతీదేవి, అల్లుడు పరమేశ్వరుడిని మాత్రం పిలవడు. తండ్రి యాగానికి వెళ్తానని సతీదేవి బయలుదేరుతుంది. పిలుపు రాకుండా వెళ్లడం శ్రేయస్కరం కాదని, శివుడు వారించినా, ‘పుట్టింటి వారు ప్రత్యేకంగా పిలవాలా ఏంటీ’ అని ప్రమధగణాలను వెంటబెట్టుకుని యాగానికి వెళ్తుంది. అక్కడ అందరి ముందు శివుడిని దక్షుడు అవమానిస్తాడు. శివనింద సహించలేక సతీదేవి యోగాగ్నిలో భస్మమైపోతుంది. సతీదేవి మరణ వార్త విన్న శివుడు ఆగ్రహంతో ఊగిపోతాడు. ప్రమధ గణాలతో కలిసి శివ తాండవం చేస్తూ దక్షయజ్ఞాన్ని భగ్నం చేస్తాడు. కానీ, సతీ వియోగ దుఃఖంతో ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకుని జగద్రక్షణ కార్యాన్ని మానేస్తాడు. దీంతో దేవతలు వెళ్లి, విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటారు. దేవతల ప్రార్థన మన్నించిన శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడి కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు. సతీదేవి శరీర భాగాలు పడిన ఆ ప్రదేశాలే శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధన క్షేత్రాలు అయ్యాయి. వాటిలో శిరో భాగం ‘బ్రహ్మ రంధ్రం’ హింగోళమనే ప్రదేశంలో పడింది. అదే ఇప్పుడు పాకిస్థాన్‌లో ఉన్న శక్తి పీఠం హింగ్లాజ్‌ దేవి ఆలయం.  ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది.

లంకాయాం శాంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంఖళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే

అలంపురే జోగులాంబా, శ్రీశైలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠికాయాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యాం దక్షవాటికే

హరిక్షేత్రే కామరూపి, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా

వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్

 

మరొక స్థల పురాణం ప్రకారం

• త్రేతాయుగంలో విచిత్రుడు అనే సూర్యవంశానికి చెందిన క్షత్రియ రాజుకు హింగోళుడు, సుందరుడు అనే కుమారులు పుడతారు. వీరు ప్రజలను, రుషులను పీడించి హింసిస్తుంటారు. ఆ రాకుమారుల బారి నుంచి తమను రక్షించవలసిందిగా ప్రజలు శివుడిని ప్రార్థిస్తారు. శివుని ఆజ్ఞానుసారం గణపతి సుందరుడిని సంహరిస్తాడు. దాంతో రెచ్చిపోయిన హింగోళుడు మరింత విజృంభించి ప్రజలను కష్టాలకు గురిచేస్తాడు. బెంబేలెత్తిన ప్రజలు పరాశక్తిని ఆశ్రయిస్తారు. శక్తి అతడిని వెంటాడుతూ ఈ గుహలలో తన త్రిశూలంతో సంహరిస్తుంది. చనిపోయే ముందు హింగోళునికి ఇచ్చిన వరం ప్రకారం ఆ ప్రాంతంలో కొలువై అతడి పేరుతో హింగుళాదేవిగా ప్రసిద్ధి చెందింది.

• మరో ఇతిహాసం ప్రకారం పరశురాముడు క్షత్రియ సంహారం చేస్తున్నప్పుడు 12 మంది క్షత్రియులకు బ్రాహ్మణ వేషం వేసి పరశురాముడి బారి నుంచి కాపాడతారు. ఆ క్షత్రియుల సంతతి తరువాతి కాలంలో బ్రహ్మ క్షత్రియులుగా పిలువబడుతున్నారు. ఈ బ్రహ్మక్షత్రియుల కులదేవత హింగుళాదేవి.

• మరో కథనం ప్రకారం దధీచి మహర్షి రత్నసేనుడు అనే సింధుదేశ రాజును పరశురాముడి బారి నుంచి రక్షించడానికి ఆశ్రయమిస్తాడు. దధీచి ఆశ్రమంలో లేని సమయం చూసి పరశురాముడు రత్నసేనుడిని సంహరిస్తాడు. రత్నసేనుడి కుమారులను బ్రాహ్మణ వటువులుగా భావించి వదిలివేస్తాడు. వారిలో జయసేనుడు సింధు రాజ్యానికి వెళ్లి పరిపాలన కొనసాగించాడు. పరశురాముడు అతడిని మట్టుపెట్టడానికి వచ్చినప్పుడు దధీచి మహర్షి ప్రసాదించిన హింగుళా దేవీ మంత్ర ప్రభావంతో కాపాడబడతాడు. ఈ దేవి జయసేనుడిని కాపాడటమే కాక పరశురాముని క్షత్రియవధను నిలిపివేయమని ఆజ్ఞాపిస్తుంది. ఇక రామాయణం ప్రకారం, రావణ వధ తర్వాత రాముడు బ్రహ్మ హత్యదోష నివారణ కోసం హింగ్లాజ్ దేవిని సందర్శించాడని చెబుతారు.

ఎక్కడ ఉంది

•భారత స్వాతంత్ర్యానంతరం ముస్లిం మెజార్టీ ఉన్న ప్రాంతంగా పాకిస్థాన్‌ ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. అయితే, వేదకాలం నుంచి ఆ ప్రాంతమంతా భారత దేశంలో అంతర్భాగం. అక్కడ కూడా హిందూమతం దేదీప్యమానంగా వెలిగింది. ఎన్నో హిందూ ఆలయాలు అక్కడ ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఆ దేశం మొత్తం జనాభాలో హిందూ జనాభా 1.5శాతం మాత్రమే. దేశ విభజన తర్వాత చాలా తక్కువ మంది మాత్రమే అక్కడ ఉండిపోయారు. అయినా, ఇప్పటికీ పలు హిందూ ఆలయాలు పాకిస్థాన్‌లో ఉన్నాయి. వాటిలో హింగ్లాజ్‌ దేవి ఆలయం ఒకటి. హింగ్లాజ్‌ దేవిని ముస్లింలు బీబీ నానీగా పిలుస్తారు. పలువురు ముస్లింలు హింగ్లాజ్‌ దేవిని పూజిస్తారు కూడా. పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌ తూర్పు ప్రాంతానికి పశ్చిమ ప్రాంతానికి మధ్యలో హింగ్లాజ్‌ దేవి ఆలయం ఉంది. కరాచీ నుంచి 250కి.మీ. ప్రయాణించాల్సి ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారానే ఆలయానికి చేరుకోవాలి.

వసంత కాలంలో జాతర

►• ఏటా ఏప్రిల్ మాసంలో నాలుగు రోజులపాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో సాధువులు, హఠయోగులు హింగ్లాజ్‌ దేవిని కొలుస్తారు. అనేక మంది భక్తులు ఉత్సవాల సందర్భంగా ఈ దేవతను కొలిచి మొక్కు బడులు చెల్లించుకుంటారు. స్థానిక ముస్లింలు ఈ ఉత్సవాలను నానీకీ హజ్ అని పిలుస్తారు. హింగ్లాజ్‌ దేవి ఉత్సవాలు జరిగే సమయంలో భక్తులు పాదయాత్రగా వెళతారు. ఎందుకంటే ఎడారి ప్రాంతాన్ని తలపించే ఆ రహదారి గుండా వెళ్తే అక్కడ వీచే వేడి గాలులు శరీరాన్ని తాకి చేసిన పాపాలను పోగొడతాయని వారి నమ్మకం. అలా పవిత్రమైన దేహంతో అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భావిస్తారు. ఒకప్పుడు కేవలం కాలినడకన మాత్రమే అక్కడకు వెళ్లాల్సి వచ్చేది. ఆ తర్వాత ఒంటెలు, గాడిదలపై ప్రయాణించి ఆలయానికి చేరుకునేవారు. 2004 తర్వాత ప్రభుత్వం ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో వాహనాల్లో నేరుగా దేవి ఆలయానికి చేరుకోవచ్చు. అయితే, సంప్రదాయం పాటించే వారు ఇప్పటికీ హింగ్లాజ్‌ దేవి ఆలయానికి నడిచి వెళ్తారు. అలా ఆలయ సమీపానికి చేరుకున్న భక్తులు అక్కడ ప్రవహించే హింగ్లోజ్‌ నదిలో స్నానమాచరించి దేవిని దర్శించుకుంటారు. 

►• హింగ్లాజ్‌ దేవిని దర్శించుకున్న తర్వాత భక్తులు అక్కడి సమీపంలో ఉన్న చంద్రగప్‌, కందేవారీ అనే బురదతో కూడిన అగ్నిపర్వతంపైకి వెళ్తారు. ఆ బురదలో పూలు చల్లి, తమ వెంట తెచ్చుకున్న కొబ్బరి కాయలను అందులో ముంచుతారు. బురద అంటిన ఆ కొబ్బరి కాయలను ఇంటిలో పెట్టుకుంటే శుభాలు జరుగుతాయని మరికొందరి నమ్మకం. కొందరు ఆ బురదను శరీరానికి పూసుకుంటారు. మరి కొందరు ఆ బురదతో చిన్న ఇళ్లు కడతారు. అలా చేస్తే వారి సొంత ఇంటి కల నిజమవుతుందని విశ్వాసం. 

►• హింగ్లాజ్‌ దేవి ఆలయం చుట్టూ గణేశ్‌దేవ, కాళీ మాత, గురుఘోరక్‌ నాథ్‌ ధూని, బ్రహ్మకుధ్‌, తిర్‌కుంద్‌,  గురు నానక్‌రావ్‌, రామ్‌జరోఖా బేతక్‌, అనిల్‌కుద్‌, చౌరాసీ పర్వతం, చంద్రగూప్‌, అఘోరి పూజ తదితర ఆలయాలు, ప్రార్థనా ప్రదేశాలు ఉన్నాయి.

కర్తార్‌పూర్‌ కారిడార్‌లా..

•సిక్కులకు కర్తార్‌పూర్‌ కారిడార్‌లా భారతదేశంలోని హిందువులు హింగ్లాజ్‌దేవిని దర్శించుకోవడానికి కారిడార్‌ను ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. భాజపా మాజీ ఎంపీ తరుణ్‌ విజయ్‌ ఇదే విషయంపై ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. హింగ్లాజ్‌ దేవి ఆలయానికి కారిడార్‌ను ఏర్పాటు చేస్తే, ఇరుదేశాలు పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. హింగ్లాజ్‌ దేవిని తమ కులదైవంగా భావించే వాళ్లు భారత్‌లో అనేకమంది ఉన్నారని, అలాంటి వాళ్లు ఆ దేవిని దర్శించుకునే భాగ్యం కలుగుతుందని ఆయన విన్నవించారు.

గోపీచంద్‌ ‘సాహసం’

ఒకప్పుడు హింగ్లాజ్‌దేవి ఆలయం గురించి తెలుగువారికి పెద్దగా తెలియదు. గోపీచంద్‌ కథానాయకుడిగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ‘సాహసం’ చిత్రం ఈ ఆలయ ఇతివృత్తంగా సాగుతుంది.

ఓం హింగుళే పరమ హింగుళే అమృతరూపిణీ తనుశక్తి
మనః శివే శ్రీ హింగుళాయ నమః స్వాహా 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని