చల్లని తల్లీ... చాముండీ..
సృష్టికర్త బ్రహ్మ నుంచి కీటకం వరకు అందరికి మాతృమూర్తి అమ్మవారేనని అని దేవీ భాగవతం అమ్మను స్తుతిస్తుంది. ఆమె ఇచ్చా శక్తి, జ్ఞానశక్తి, క్రియా శక్తి, సర్వశక్తి స్వరూపిణి. భక్తుల మనసులో కొలువై తన చల్లని చూపులతో అన్ని లోకాలను పాలిస్తూ అనుగ్రహిస్తుంది అమ్మ. ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ..
సర్వమంగళమాంగళ్యే శివేసర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే
సకలలోకాలకు శుభాలను ప్రసాదించే తల్లి. పరమేశ్వరుని అర్థాంగి, మూడు లోకాలకు తల్లి, శ్రీమహావిష్ణువు సోదరియైన అమ్మవారికి నమస్కారం.
సృష్టికర్త బ్రహ్మ నుంచి కీటకం వరకు అందరికీ మాతృమూర్తి అమ్మవారేనని దేవీ భాగవతం అమ్మను స్తుతిస్తుంది. ఆమె ఇచ్చా శక్తి, జ్ఞానశక్తి, క్రియా శక్తి, సర్వశక్తి స్వరూపిణి. భక్తుల మనసులో కొలువై తన చల్లని చూపులతో అన్ని లోకాలను పాలిస్తూ అనుగ్రహిస్తుంది అమ్మ. ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ.. సురారులమ్మ. చాముండీ దేవిగా అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మైసూర్ క్షేత్రంలో గిరులపై కొలువై ఆశేష భక్తజనుల పూజలు అందుకొంటోంది.
దసరా అంటే మైసూర్.. మైసూర్ అంటే దసరా
కన్నడనాట చారిత్రక ప్రాధాన్యత కలిగిన నగరం మైసూర్. గత ఘన చరితకు, రాజులు, రాచరిక ఠీవీకి నిలువెత్తు దర్పణంగా ఉంటుందీ నగరం. వడయార్ రాజవంశస్థుల ఆధ్వర్యంలో ఏటా ఆశ్వయుజ శుక్ల పాడ్యమి మొదలు దశమి వరకు ఇక్కడ విజయ దశమి ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా చాముండీ అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తారు. వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వీటిలో అమ్మవారికి చేసే అంబారీ సేవ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పదిరోజులు జరిగే ఈ ఉత్సవాలు దేశం మొత్తం ఒక ఎత్తైతే.. మైసూర్ మరో ఎత్తు. వీటిని వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తుల భారీ సంఖ్యలో విచ్చేస్తారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుకలతో నగరమంతా శోభాయమానంగా ఉంటుంది.
పురాణ ప్రాశస్త్యం
పూర్వం మసూరు (ప్రస్తుత మైసూర్) నగరాన్ని మహిషాసురుడు అనే రాక్షసుడు పరిపాలించేవాడు. లోకకంటకుడైన మహిషుడు తపస్సుతో కైలాశపతిని మెప్పించి పలు దివ్యవరాలు పొందాడు. స్త్ర్రీ తననేం చేస్తుందిలే అనే చులకన భావంతో వారిని వదిలి.. మిగిలిన వారి ద్వారా తనకు మరణం ఉండకూడదని వరం పొందాడు. భోళా శంకరుడు తథాస్తు అని ఆశీర్వదించాడు. ఈ వర గర్వంతో వాడు ముల్లోకాలను వేధించసాగాడు. దేవతలను, రుషులను హింసకు గురిచేశాడు. దేవాలయాలు, పూజా మందిరాలను ధ్వంసం చేశాడు. యజ్ఞయాగాది క్రతువులను ఆపివేయించాడు. దేవతలకు హవిస్సులు అందకుండా చేశాడు. పవిత్ర స్థలాలను అపవిత్రం చేశాడు. తనే దేవుడని... తననే పూజించాలని, తన పేరే జపించాలని హుకుం జారీ చేశాడు. అతడి పాలనలో మహిళలకు రక్షణ లేదు. ధర్మానికి స్థానం లేదు. జాలి, దయ మచ్చుకైనా కానరావు. దున్నపోతు పాలనలో దుర్మార్గం రాజ్య మేలింది. అంతా హింస, అరాచకం, అమానుషం, దుర్మార్గం రాజ్యమేల సాగాయి. ఇంద్రుడి అమరావతి మీద దండెత్తి దిక్కులకే దిక్కైన దిక్పాలకులకు ఏ దిక్కూ లేకుండా చేశాడు.
యజ్ఞయాగాది క్రతువులను నిషేధించాడు. మహిషుడి ఆగడాలను భరించలేని దేవతలు త్రిమూర్తులకు మొర పెట్టుకున్నారు. అభయమిచ్చిన హరిహరబ్రహ్మలు వారి ముగ్గురి శక్తితో ఓ మహా శక్తిని సృష్టించారు. ఆమె అష్టాదశ భుజాలతో, సహస్ర కోటి మార్తాండుల తేజస్సుతో, బ్రహ్మాండమంతా వ్యాపించి ప్రకాశించింది. ఆమెను చూసి సకల జగత్తు చేతులెత్తి మొక్కింది. యక్ష, కిన్నెర, కింపురుషులు అమ్మ కీర్తిని గానం చేశారు. దేవతలు తమ శక్తిని, ఆయుధాలను ఆ తల్లికి సమర్పించారు. శంఖ, చక్ర, గద, పద్మ, ధనస్సు, బాణ, ఖడ్గ, ముసల, శూల, పాశ, అంకుశ, పరశువులను ధరించి శత్రు సంహారం మొదలెట్టింది. పది రోజులు అసురులతో పోరాడి రోజుకో రూపంలో రాక్షసులను నిర్మూలించసాగింది. పదో రోజు మహిషాసుర వధతో అసురులను నిశ్శేషం చేసి సర్వలోకాల శోకాలను తొలగించి మహిషాసుర మర్ధినిగా పేరొందింది. మహిషాసురుడి సేనాధిపతులు చండముండులను సంహరించింది కావున ఈ తల్లికి చాముండేశ్వరి దేవి పేరు స్థిర నామధేయమైంది.
చాముండా క్రౌంచ పట్టణే
ఆది శంకరులు కీర్తించిన అష్టాదశ శక్తి పీఠాల్లో మైసూర్ ఒకటి. దక్షయజ్ఞంలో తన భర్తకు జరిగిన అవమానాన్ని భరించలేక ద్రాక్షయణీ దేవి అగ్ని ప్రవేశం చేసింది. దీంతో ఆగ్రహించిన మహాదేవుడు వీరభద్రున్నీ సృష్టించి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయించాడు. అయినా ఆగ్రహం తీరక అమ్మవారి శరీరాన్ని భుజాన ధరించి ప్రళయకాల రుద్రుడై భూత గణాలతో విలయతాండవం చేయసాగాడు. దీంతో భయపడిన దేవతా గణాలు, ముల్లోకాలు గరళకంఠున్ని శాంత పరచాల్సిందిగా మహావిష్ణువును ప్రార్ధించారు. అప్పడు ఆ నారాయణుడు తన సుదర్శన చక్రంతో అమ్మవారి శరీరాన్ని ముక్కలు చేశాడు. ఆ ముక్కలు పలు ప్రాంతాల్లో పడి అష్టాదశ శక్తి పీఠాలుగా వెలశాయి. మైసూర్ ప్రాంతంలో అమ్మవారి తల వెంట్రుకలు పడ్డాయి.
చారిత్రక నేపథ్యం
మైసూర్ దసరా ఉత్సవాలకు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంది. విజయనగరం సామ్రాజ్య పతనం తరువాత కన్నడ ప్రాంతం వడయార్‌ల అధీనంలోకి వెళ్లింది. మొట్టమొదటి సారి క్రీ.శ. 1610 ప్రాంతంలో వారే విజయదశమి ఉత్సవాలను ప్రారంభించారు. 1659లో నాటి మైసూర్ పాలకుడు దొడ్డదేవరాజ వడయార్ దేవాలయాన్ని పునరుద్ధరించి మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేయించాడు. నాటి నుంచి అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. 1905లో దసరా సందర్భంగా రాజభవనంలో ప్రత్యేక దర్బార్ ఏర్పాటు చేసే సంప్రదాయం మూడో కృష్ణరాజవడయార్ మొదలుపెట్టారు. దీంతో ఉత్సవాలు రాజకీయ సొబగులు అద్దుకున్నాయి.
నిత్యపూజలు ఇవిగో..
మైసూర్ చాముండీ కొండలపై ఉన్న అమ్మవారికి రోజూ అనేక పూజలు జరుగుతాయి. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొంటారు. సిద్ద గంగ మఠాధిపతి పూజతో ఆలయంలో దసరా వేడుకలు ప్రారంభమవుతాయి. పదిరోజులు అమ్మవారిని పది రూపాల్లో అలంకరిస్తారు. రాజవంశస్థులు పూజల్లో పాల్గొంటారు. నగరంలోని జగ్‌మోహన్ ప్యాలెస్, కళామందిర్, కుప్పన్న పార్కు తదితర ప్రాంతాలను విద్యుత్తు దీపాలతో సుందరంగా అలంకరిస్తారు. దేశవిదేశాల నుంచి వచ్చే కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకుంటాయి.
ఆకర్షణీయం అంబారీ ఉత్సవం..
ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా జంబూ సవారీ నిలుస్తుంది. జంబూ సవారీ అంటే ఏనుగుపై ఊరేగించడం. 17వ శతాబ్దంలో వడయార్ రాజులు అంబారీపై ఊరేగేవారు. ప్రస్తుతం అమ్మవారి ఉత్సవమూర్తిని ఊరేగిస్తున్నారు. ఇందుకు గజరాజాన్ని ప్రత్యేకంగా ఎంపిక చేస్తారు. దానికి శిక్షణ ఇచ్చి శ్రద్ధతో పోషిస్తారు. ఈ ఏనుగును 750 కిలోల బంగారు అంబారీతో సుందరంగా అలంకరిస్తారు. ఇందులో అమ్మవారిని ఉంచి... మైసూర్ రాజవీధుల్లో ఊరేగిస్తారు. రాజదంపతుల పూజతో జంబూ సవారీ ప్రారంభమవుతుంది. రంగురంగుల బొమ్మలు, బృందనృత్యాలు, మంగళవాయిద్యాలు, భాజాభజంత్రీలు, బ్యాండ్ మేళాలు, ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు ముందు నడుస్తుండగా రాజవీధుల గుండా ఊరేగింపు సాగుతుంది. రాజభవనం నుంచి మొదలయ్యే సవారీ బన్నీ మంటపానికి చేరుకుంటుంది. ఇక్కడ రాజవంశస్థులు గోపూజ, ఆయుధపూజ, గజపూజ, శమీ వృక్షపూజలను చేస్తారు. మండపం వద్ద జరిగే కాగడాల కవాతుతో ఉత్సవాలు ముగుస్తాయి.
ఇలా చేరుకొవాలి
దేశంలో అన్ని నగరాల నుంచి బెంగుళూరుకు రైలు, బస్సు, విమాన సౌకర్యాలు ఉన్నాయి. అక్కడి నుంచి మైసూరు సుమారు 140 కి.మీ దూరం ఉంటుంది. బస్సు, రైలు ఇతర ప్రయివేట్ వాహనాల ద్వారా మైసూర్ చేరుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vikasraj: అక్టోబరులో రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం: సీఈవో వికాస్ రాజ్
-
Gurpatwant Singh Pannun: పన్నూ వార్నింగ్ ఇస్తే.. కేంద్రం షాకిచ్చింది: ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ
-
politics: భాజపా - జేడీఎస్ పొత్తు.. ‘బెస్ట్ ఆఫ్ లక్’ అంటూ కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు
-
Tamil Nadu: స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆర్గాన్ డోనర్స్కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
-
Chandramukhi2: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘చంద్రముఖి-2’.. రన్టైమ్ ఎంతంటే?
-
Jairam Ramesh: ‘కొత్త పార్లమెంట్ మోదీ మల్లీప్లెక్స్’.. జైరాం రమేశ్ విమర్శలకు భాజపా కౌంటర్