అత్తివరదదర్శనం ..40ఏళ్లకోసారే

తమిళనాడులోని కాంచీపురం..! ఆలయాల నగరంగా ప్రసిద్ధి పొందిన పుణ్యప్రదేశం. వెయ్యికి పైగా దేవాలయాలున్న ఆధ్యాత్మిక ప్రాంతం. నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. సాధారణంగానే సందడిగా కనిపించే కంచి...ఇప్పుడు మరింత కళ సంతరించుకుంది. భక్తుల సంఖ్య .. వేలు దాటి లక్షలకు చేరింది. కారణం.. దివ్య మంగళ స్వరూపమైన అత్తివరదరాజ స్వామి

Updated : 14 Mar 2023 12:48 IST

తమిళనాడులోని కాంచీపురం..! ఆలయాల నగరంగా ప్రసిద్ధి పొందిన పుణ్యప్రదేశం. వెయ్యికి పైగా దేవాలయాలున్న ఆధ్యాత్మిక ప్రాంతం. నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. సాధారణంగానే సందడిగా కనిపించే కంచి...ఇప్పుడు మరింత కళ సంతరించుకుంది. భక్తుల సంఖ్య .. వేలు దాటి లక్షలకు చేరింది. కారణం.. దివ్య మంగళ స్వరూపమైన అత్తివరదరాజ స్వామి విగ్రహం...జలం వీడి జనంలోకి రావటమే..! 40 ఏళ్లకోసారి మాత్రమే కనిపించే ఈ అరుదైన దృశ్యం చూసేందుకు... భక్తులు దేశ నలుమూలల నుంచి కంచికి వరస కట్టారు. జీవితంలో ఒక్కసారైనా స్వామివారి తేజోమయమైన రూపం చూడాలని.. వేయి కళ్లతో నిరీక్షించిన వారంతా ఆలయానికి పోటెత్తారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు స్వామివారిని దర్శించుకుని తరించారు.

భక్తులకు వరాలు ఇవ్వడానికి దేవుడు దిగి వచ్చిన కథలు మనం విన్నాం. కానీ ఈయన చాలా ప్రత్యేకం. 40 ఏళ్ల ఎదురు చూపులకు తెర దించాడు. నీటి నుంచి పైకి వచ్చి మరీ  అనుగ్రహిస్తున్నాడు. తమిళుల ఆరాధ్య దైవంగా, కోరిన కోర్కెలు తీర్చే దైవంగా కాంచీపురంలో కొలువైన వరదరాజ పెరుమాళ్‌ కథ ఇది. 

అంచనాలకు మించి పోటెత్తిన భక్తజనం

> వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు చిద్విలాస మూర్తిగా వరాలనొసిగే వరదరాజ పెరుమాళ్ల ఆలయం మరోసారి అరుదైన ప్రదర్శనకు వేదికైంది. 40 సంవత్సరాలకు కేవలం 48 రోజులు మాత్రమే దర్శనమిచ్చే అనంతశయన మూర్తి దివ్య మంగళ విగ్రహం అత్తివరదరాజ స్వామిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ తొమ్మిది అడుగుల దివ్వ స్వరూపం తిలకించేందుకు రోజూ లక్షలాదిమంది తరలి వస్తున్నారు.  జులై 1న ప్రారంభమైన అత్తివరదర్‌ వేడుకలు ఆగస్టు 17న ముగియనున్నాయి. దేశంలో జరిగే వివిధ ఉత్సవాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అదే విధంగా ఆలయ కోనేటి గర్భంలో ఉండే స్వామి విగ్రహం 40 ఏళ్ల తర్వాత భక్తులకు దర్శనం ఇవ్వడమనేది అత్తివరదరాజ స్వామి ప్రత్యేకత.  స్వామి వారి విగ్రహాన్ని పుష్కరిణి నుంచి బయటకు తీసుకొచ్చి పవళింపు సేవతో ఈ వేడుకలను ప్రారంభించారు. స్వామిని వీక్షించేందుకు దేశదేశాల నుంచి వస్తున్న లక్షలాది భక్తులతో కాంచీపురం భక్తజన క్షేత్రంగా మారింది. నిత్యం దైవస్మరణలో ఉండే ఈ మహా క్షేత్రంలో అనంత పద్మనాభుని దర్శనం ఎంతో పుణ్యమని భక్తుల విశ్వాసం.

> సినిమా తారలు మొదలుకొని గవర్నర్లు, మంత్రులు, సామాన్య భక్త జనం కాంచీపురానికి పోటెత్తారు. కాంచీపురం చరిత్రలో ఇంతటి పెద్ద జనసందోహం చూసి ఉండరు. ప్రభుత్వ వర్గాలు సైతం ఈ స్థాయిలో భక్తులు వస్తారని ఊహించలేదు. 48 రోజుల వ్యవధి ఉన్న ఉత్సవం కారణంగా సులభంగానే నిర్వహించవచ్చని ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అంచనా వేశాయి. రోజురోజుకీ పెరిగిపోతున్న భక్తుల తాకిడిని చూసి ప్రభుత్వ వర్గాలే  ఆశ్చర్యపోతుయాయి. అత్తివరదరాజస్వామిని ఇప్పటి వరకు కోటి మందికి పైగా దర్శించుకున్నారని ప్రభుత్వ అంచనా. 40 సంవత్సరాల తర్వాత కోనేటి నుంచి బయటకు వచ్చిన అత్తివరదరాజస్వామి 31 రోజులు శయన రూపంలోను 17 రోజులు స్థాన మూర్తిగా నిల్చొని దర్శనమిచ్చారు. 

బ్రిటిష్‌ వారు కూడా ఈయన భక్తులే..

> దేశంలోని శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాల్లో కాంచీపురం ఒకటి. అక్కడి వైష్ణవాలయాల్లో ప్రసిద్ధి చెందింది వరదరాజ పెరుమాళ్‌ ఆలయం. వేఘవతి నది ఒడ్డున కొలువుదీరిన ఈ క్షేత్రానికి సంబంధించి ఎన్నో స్థల పురాణాలు ప్రచారంలో ఉన్నాయి. సాక్షాత్‌ బ్రహ్మదేవుడే ఈ శ్రీ అత్తి వరదరాజస్వామి విగ్రహాన్ని చెక్కించాడని, అందుకు దేవశిల్పి విశ్వకర్మ సహకరించాడని పురాణాలు చెబుతున్నాయి. అత్తి వరదరాజస్వామిని మహావిష్ణువు అవతారంగా భక్తుల విశ్వసిస్తుంటారు. స్థానికులు వరదరాజ పెరుమాళ్‌గా కొలుస్తుంటారు. ఈ స్వామి వారు...40 ఏళ్లకోసారి మాత్రమే దర్శనమివ్వటం వెనక ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.
> దేశంలో మోక్షాన్ని ఇచ్చే నగరాలు ఏడు ఉన్నట్లు పురాణాలు పేర్కొంటాయి. ఆరు మోక్షపురులు ఉత్తర భారత దేశంలోనే ఉన్నాయి. అందులో ఒకే ఒక్క మోక్షపురి దక్షిణ భారతదేశంలో ఉంది. అదే కాంచీపురం. అలాంటి కాంచీపురంలోని ముఖ్యమైన ఆలయాల్లో వరదరాజ్‌ పెరుమాళ్ల ఆలయం ఒకటి. మూలవిరాట్టు అయిన విష్ణుమూర్తిని వరదరాజ స్వామిగా పిలుస్తారు. స్వామివారి దేవేరి పెరుందేవి. బ్రిటిష్‌ పాలకులు సైతం వరదరాజస్వామిపై భక్తి ప్రవత్తులు చాటుకున్నారు. బ్రిటిష్‌ గవర్నర్ జనరల్‌ రాబర్ట్‌ క్లైవ్‌ ఒకసారి అనారోగ్యం బారిన పడగా.. స్వామి వారిని వేడుకున్నాక సాంత్వన పొందారట.  ఫలితంగా ఆయన, ఆయన భార్య వరదరాజ స్వామి భక్తులుగా మారి, స్వామివారికి కానుకలు, ఆభరణాలు సమర్పించారట. రాబర్ట్‌ క్లైవ్‌ ‘మణికంఠిక’ పేరుతో ఓ ఆభరణాన్ని ఇప్పటికీ స్వామి వారికి అలంకరిస్తుంటారు. అసలు ఈ అత్తివరదరాజ స్వామి ఎవరు? ఆయన 40 ఏళ్లకు ఒకసారి దర్శనం ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? అని ఆరాతీస్తే పలు ఆసక్తి కరమైన విభిన్న కథనాలు స్థానికులు చెప్తారు. వాటిల్లో పురాణ కథనాలతో పాటు, చారిత్రక ఘట్టాలు ఉన్నాయి. 

 తొలుత 60ఏళ్లకోసారే అవకాశం..

> పురాణ కథనాల ప్రకారం కృతయుగంలో బ్రహ్మదేవుడు కంచిలో అశ్వమేధ యాగం చేశారట. యాగం నిర్విగ్నంగా జరిగేలా విష్ణుమూర్తి కాపాడట. ఆయనే ప్రస్తుతం ఉన్న మూలవిరాట్టు అత్తివరదరాజ స్వామి పెరుమాళ్‌. విగ్రహం మొత్తం అత్తి కలపతో తయారు చేయడం వల్ల ఈ స్వామి వారికి అత్తివరదుడు అనే పేరు వచ్చింది. బ్రహ్మదేవుని యజ్ఞకుండం నుంచి కూడా మరో విష్ణుమూర్తి ఉద్భవించారట. ఆ విష్ణుమూర్తి దారు విగ్రహమై యజ్ఞం తాలూకూ ఉష్ణ తాపంతో ఉన్నారట. అందుకే అత్తి వరదరాజ స్వామి విగ్రహానికి ఎల్లప్పుడూ పన్నీటి అభిషేకం చేసేవారట. తనలోని ఉష్ణతాపం చల్లార్చేందుకు ఆలయ కోనేరులో ఉంచాల్సిందిగా స్వామివారు అర్చకులకు కలలో వచ్చి చెప్పారని, అందుకే వరదరాజ స్వామిని కోనేటిలో ఉంచుతారని ఒక కథ ప్రచారంలో ఉంది. మొదటి స్వామి వారిని 60 ఏళ్లకొకసారి దర్శనార్థం ఉంచేవారు. కొన్ని శతాబ్దాల పూర్వమే.. 40 సంవత్సరాలకు కుదించారని చెబుతారు. వరదరాజ స్వామి విగ్రహాన్ని అత్తిచెట్టు కాండం నుంచి తయారు చేయటం వల్ల ఆపేరు స్థిరపడిపోయిందనీ అంటుంటారు. అందుకే ఆ విగ్రహం ఎన్నో ఏళ్లు నీటిలో ఉన్నా చెక్కు చెదరదు.

పెరుమాళ్‌ను మోస్తున్న గజగిరి..

> ఈ ఆలయానికి సంబంధించి మరో స్థల పురాణం కూడా ప్రచారంలో ఉంది. బ్రహ్మదేవుడు ఒక యజ్ఞం ప్రారంభించి, ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు స్వామివారి విగ్రహాన్ని తయారు చేయించి కంచిలో స్వయంగా ప్రతిష్ఠించారని అంటారు. ఈ స్వామి అగ్ని దేవుని స్వరూపం. బయట ఎక్కువ కాలం ఉండలేరు. స్వామికి నిత్యాభిషేకాలు తప్పనిసరి. 9 అడుగులు ఉండే విగ్రహాన్ని మధ్య యుగంలో దాడులు జరుగుతున్న వేళ వెండి పెట్టెలో అమర్చి దేవాలయానికి దగ్గర్లో ఉండే పుష్కరణిలో దాచిపెట్టాలని నిర్ణయించారు.  ఆపై అదే దేవుని శిల్పాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో మూలవిరాట్టు వరదరాజ పెరుమాళ్‌ పశ్చిమం వైపు, తాయారు పెరుందేవి తూర్పువైపు నిలబడినట్లు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆలయం ఉన్న కొండ ఏనుగు రూపంలో ఉంటుంది. పెరుమాళ్‌ మోస్తున్నందున ఈ కొండకు అత్తిగిరి కొండ అనే పేరు కూడా ఉంది. ఈ ఆలయంలో బంగారు, వెండి బల్లులు భక్తులకు దర్శనం ఇస్తున్నాయి. వీటన్నిటికీ మించిన మరో విశిష్టత ఇక్కడ ఉంది. ఆలయ ప్రాంగణంలోని అనంతసరస్సుగా పిలుచుకునే  పుష్కరిణిలో మూడు మంటపాలు ఉన్నాయి. ఆరు స్తంభాలు, నాలుగు స్తంభాల మంటపాలతో పాటు శ్రీ కృష్ణుడి దివ్య విగ్రహం ప్రతిష్ఠించిన మంటపాలు ఉన్నాయి. అత్తివరదర్‌గా పిలుస్తున్నవరదరాజ స్వామి విగ్రహాన్ని వెండి పెట్టెలో పెట్టి  నాలుగు స్తంభాల మంటపంలో నీటి అడుగు భాగాన భద్రపరిచారు.  40 ఏళ్లకొకసారి పుష్కరణిలోని నీటిని తోడేసి విగ్రహం ఉన్న పెట్టె బయటకు తీసి విగ్రహాన్ని శుభ్రం చేస్తారు.  పూజల తర్వాత ఆ విగ్రహాన్ని వసంత మంటపంలో ఉంచుతారు. 48 రోజుల తర్వాత స్వామి వారి విగ్రహం  తిరిగి వెండి పెట్టెలో పెట్టి పుష్కరిణిలోని నాలుగు కాళ్ల మంటపంలో ఉంచి నీటితో నింపేస్తారు. 

మత్య్సావతారం ఎత్తి..సోమకుడిని వధించి

> స్వామివారి జలావాసంపై రకరకాల కథనాలు ఉన్నాయి. పూర్వం యుద్ధం జరిగే సమయంలో ఆలయాలకు, దేవతా విగ్రహాలకు తగిన రక్షణ ఉండేది కాదు. ఆలయంలోని మూల విరాట్టును రక్షించుకునేందుకు అర్చకులు ఇలా భూమిలో దాచారని.. ఆపద సమయం ముగిసిన తర్వాత ఆ విగ్రహం బయటకు తీసి పూజించేవారని చెబుతారు. అత్తివరదరాజ స్వామిని భూమిలోపల దాచే సమయంలో ఏర్పడ్డ గుంత పుష్కరిణిగా రూపాంతరం చెందిందని చరిత్ర చెబుతుంది. పురాణాలు మాత్రం యాగగుండం నుంచి అత్తివరదర్‌ పుట్టినట్లు చెబుతున్నాయి. మత్స్యావతారం ఎత్తి నీటిలో దాగివున్న సోమకుడిని వధించి వేదాలు కాపాడిన విష్ణువు కాంచీపురంలో అత్తివరదరాజ స్వామిగా నీటి కొలనులో విశ్రమిస్తాడని మరో పురాణ ప్రతీతి. 

విష్ణుకంచిలో కొలువైన అత్తివరదరాజ స్వామి

> వైష్ణవులకు పరమ పవిత్రమైన 108 దివ్య క్షేత్రాల్లో అత్తివరదరాజ స్వామి ఆలయం ఒకటి . శ్రీరంగం, తిరుమల తరువాత కంచి శ్రీ వరద రాజ పెరుమాళ్ కోవెల అత్యంత పవిత్ర దర్శనీయ క్షేత్రం.ఈ 108 దివ్య తిరుపతుల్లో పదునాలుగు కంచిలోనే ఉండటం విశేషం. అందులో కొన్ని విష్ణు కంచిలో ఉండగా మరి కొన్ని శివకంచిలో ఉంటాయి. విష్ణు కంచిలోని ఈ వరద రాజ పెరుమాళ్ కోవెల...ఎంతో విశేష పౌరాణిక, చారిత్రక నేపథ్యం సంతరించుకుంది. 

రామానుజాచార్యుల నివాసమిదే!

> వరదరాజ పెరుమాళ్‌ ఆలయాన్ని హస్తగిరి ఆలయం లేదా అత్తియురాన్‌ అంటారు. ఈ ఆలయం ఉన్న ప్రదేశాన్ని విష్ణు కంచి అని పిలుస్తారు. ఇక్కడే రామానుజాచార్యులు నివసించారని చెబుతారు. కృతయుగంలో బ్రహ్మ, త్రేతాయుగంలోగజేంద్రుడు, ద్వాపరయుగంలో బృహస్పతి, కలియుగంలో ఆదిశేషుడు, ఆల్వారులు, శ్రీరామానుజాచార్యులు, ఆదిశంకరులు ... ఈ స్వామిని సేవించారని పురాణాలు పేర్కొంటున్నాయి. మొత్తం 25 ఎకరాల్లో ఉండే ఈ ఆలయాన్ని మొదట కంచిని పాలించిన పల్లవ రాజు రెండో నంది వర్మ క్రీ.శ  8వ శతాబ్దంలో నిర్మించినట్లుగా తెలుస్తొంది. తర్వాత చోళరాజులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారని శాసనాలు తెలియజేస్తున్నాయి. మరెన్నో రాజవంశాలు ఆలయానికి తమ వంతు కర్తవ్యంగా సేవలందించాయి. విజయనగర రాజుల కాలంలోనే ఈ కోవెలలో ఎక్కువ నిర్మాణాలు జరిగి ప్రస్తుత రూపం సంతరించుకుంది. ఎన్నో తెలుగు, తమిళ, కన్నడ శాసనాలు ఇక్కడ కనిపిస్తాయి. మొత్తం మూడు ప్రాకారాలతో 32 ఉపాలయాలతో, 19 విమాన గోపురాలు 300 పై చిలుకు మంటపాలతో శోభాయమానంగా ఉంటుంది. అద్భుతమైన శిల్ప కళ ఈ ఆలయం సొంతం. ముఖ్యంగా అనంత పుష్కరిణి పక్కన ఉండే నూరు స్తంభాల మంటప శిల్ప శోభ వర్ణనాతీతం. ఒకే రాతిపై చెక్కిన గొలుసులు, కూర్మ సింహాసనానికి దిగువన అమర్చిన తిరిగే చక్రాలు, స్తంభాలకు చెక్కిన రామాయణ, మహాభారత సన్నివేశాలు మహాద్భుతంగా ఉంటాయి.

ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి నీటిలో...

> చారిత్రక ఇతివృత్తాన్ని పరిశీలిస్తే 16శతాబ్దంలో ఈ వరద రాజస్వామి ప్రతిమకు గర్భగుడిలోనే పూజలు చేసేవారు. ముస్లిం పాలకులు వరుసపెట్టి కొన్ని ఆలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేయసాగారు. వారి బారి నుంచి కాపాటానికి స్వామివారి అర్చకులు ఆలయ కోనేరు అనంత సరస్పుష్కరిణిలో ఎవరికీ తెలియకుండా భద్రంగా దాచారట. ఆలయ నిర్వాహకులైన ధర్మకర్తలకు సైతం విగ్రహాన్ని ఎక్కడ దాచారో చెప్పలేదట. కొన్నేళ్ల తర్వాత పుష్కరిణిలో విగ్రహం దాచిన అర్చకులు మరణించారు. ముప్పు తొలగిన తర్వాత అప్పటి ఆలయ అర్చకులకు విగ్రహం దొరకలేదు. అందుకని గర్భగుడిలో మరో విగ్రహాన్ని శాస్త్రోక్తంగా  ప్రతిష్ఠించారు. ఆయనే ప్రస్తుత మూలవిరాట్‌ వరదరాజ స్వామి. స్వామి వారి దేవేరి పేరు పెరుందేవి. అంటే మహాలక్ష్మి అని అర్థం. ఆలయ కోనేరు పేరు అనంత సరస్‌. ఇది జీవ పుష్కరిణి. ఎప్పుడూ నీటితో కళకళాడుతూ ఉంటుంది. ఆలయ పుష్కరిణిలో నాలుగు కాళ్ల మండపం ఉంటుంది. మండపం కింద భాగంలో బిలం వంటి ప్రదేశంలో అత్తి వరదరాజ స్వామి 40 ఏళ్ల పాటు జలవాసం చేస్తారు. ఒకానొక సందర్భంగా నీరు పూర్తిగా ఇంకిపోయిందట. అప్పుడే కోనేటి గర్భంలో ఉన్న విగ్రహం బయటపడిందట. ఒకే ఆలయంలో ఇద్దరు మూలవిరాట్‌లు ఉండటం ఆగమశాస్త్రం ప్రకారం నిషిద్ధమట. అందుకే 40 ఏళ్లకోసారి కోనేటి నుంచి తీసి 48రోజుల పాటు భక్తుల సందర్శనార్థం బయటకు తీసే సంప్రదాయం మొదలైంది. అత్తి వరదరాజ స్వామిని 1783లో కోనేటి నుంచి వెలికి తీసినట్లు ఆలయంలో ఉన్న తెలుగు శాసనం చెబుతోంది. 40 ఏళ్లకోసారి దర్శనం ఏర్పాటు చేసే సంప్రదాయం 1854 నుంచి కొనసాగుతున్నట్లు అప్పటి వార్తా పత్రికల కథనాల ఆధారంగా తెలుస్తోంది. 1892, 1937, 1979 తర్వాత ఈ ఏడాదిలో మళ్లీ ఈ మహా క్రతువును నిర్వహించారు. 1977-78లో రాజగోపురం నిర్మాణ పనుల వల్ల ఈ క్రతువు రెండేళ్లు ఆలస్యమైంది. ఈ గుడికి సంబంధించి 362 రాత ప్రతులు లభించాయి. ఇందులో కొన్ని కాకతీయులు, తెలుగు చోళులకు చెందినవి కూడా ఉన్నాయి. 

దర్శనంపై కోర్టులో కేసులు

> శయన మూర్తిగా ఉన్న స్వామి యోగమూర్తిగా జ్ఞానం ప్రసాదిస్తారని, నిలువు మూర్తిగా భక్తుల కోర్కెలు తీరుస్తారని భావిస్తారు. అందుకే శయన మూర్తిగా ఉన్న స్వామివారిని రోజుకు లక్షమందికిపైగా దర్శించుకుంటారు. నిలువు మూర్తిగా దర్శనానికి ఉంచిన సమయంలో వారి సంఖ్య దాదాపు రెట్టింపయ్యింది. అత్తి వరదరాజ స్వామి దర్శనానికి సంబంధించి మద్రాసు హైకోర్టులో పలు దావాలు కూడా వేశారు. విదేశీ పాలకుల నుంచి కాపాడేందుకు స్వామి వారిని పుష్కరిణిలో దాచారని, ఇప్పుడు అలాంటి ప్రమాదం ఏమీ లేనందున 365 రోజులు స్వామి వారిని దర్శనానికి ఉంచాలని పిటిషన్‌ వేశారు. కేవలం 48 రోజులు సరిపోవని మరో 10 రోజులు పెంచాలని ఇంకో పిటిషన్‌ వేశారు. మతాచాచరాల విషయంలో జోక్యం తగదని, ప్రస్తుత సంప్రదాయాన్నే కొనసాగించాలని మద్రాసు హైకోర్టు అన్ని పిటిషన్లనూ తోసిపుచ్చింది. మళ్లీ స్వామివారిని దర్శించుకోవాలంటే 2059లోనే సాధ్యం.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని