మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి

భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటిగా కర్నూలు జిల్లాలోని మంత్రాలయం- శ్రీ రాఘవేంద్రస్వామివారి మఠం వెలుగొందుతోంది. రాఘవేంద్రస్వామి జీవసమాధిలోకి ప్రవేశించిన బృందావనాన్ని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిత్యం 10వేలమందికి పైగా భక్తులు.. ...

Updated : 04 May 2023 12:59 IST

భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటిగా కర్నూలు జిల్లాలోని మంత్రాలయం- శ్రీ రాఘవేంద్రస్వామివారి మఠం వెలుగొందుతోంది. రాఘవేంద్రస్వామి జీవసమాధిలోకి ప్రవేశించిన బృందావనాన్ని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిత్యం 10వేలమందికి పైగా భక్తులు.. పర్యాటకులు వస్తుంటారు.

క్షేత్రచరిత్ర/స్థల పురాణం

మంత్రాలయం ఒకప్పుడు మారుమూల ప్రాంతం. మంచాల గ్రామంగా పిలిచేవారు. ఆదోని నవాబు పాలనలో ఉండేది. మధ్వమఠంలో సన్యాసం స్వీకరించిన రాఘవేంద్రస్వామి అక్కడున్న మూల రాములను పూజిస్తూ, బోధనలు చేస్తూ మంత్రాలయానికి వచ్చారు. స్వామి పూర్వ అవతారం శ్రీమహావిష్ణువు భక్తపరాయణుల్లో ఒకడైన ప్రహ్లాదుడు. అప్పుడు యజ్ఞాలు, యాగాలు చేసిన స్థలం మంత్రాలయమని గాథ. అందుకే పూర్వవతారంలో రాజుగా పాలించిన స్థలం కావడంతో ఇక్కడే తాను బృందావనస్థులు (జీవ సమాధి) కావాలని స్వామి తలచారు. ఆ సమయంలోనే ఆ గ్రామదేవత మంచాలమ్మ (రేణుకాంబ రూపిణి) రాఘవేంద్రస్వామిని ఇక్కడే ఉంచాలని ఆజ్ఞాపించిందట! దీంతో స్వామి ఇక్కడే ఉంటూ చివరకు ఇక్కడే బృందావనస్థులు అయ్యారు. అప్పటి నుంచి నిత్యం రాఘవేంద్రస్వామి మూల బృందావననానికి పండితులు మంత్రాలు వల్లిస్తూ ఉండటంతో ఈ మఠం కాలక్రమంలో మంత్రాలయంగా మారిందని చెబుతారు. ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని... అనంతరం రాఘవేంద్రస్వామి బృందావనాన్ని దర్శించుకొంటారు.


చరిత్ర విశేషాలు

తమిళనాడు-భువనగిరి వాసులైన తిమ్మనభట్టు-గోపికాంబ దంపతులకు వెంకటనాథుడు (రాఘవేంద్రస్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇదే!) 1595లో జన్మించారు. ఐదేళ్లప్రాయంలో అక్షరాభ్యాసం చేసి.. ఆపై నాలుగు వేదాల అధ్యయనం చేశారు. యుక్తవయసు వచ్చేసరికే విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకుని.. సన్యాసం స్వీకరించారు. అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు. మంత్రాలయం, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద 12ఏళ్లపాటు తపస్సు చేశారు. ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారని చరిత్ర గాథ.

అనంతరం పవిత్ర తుంగభద్ర నదీతీరాన మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనలు కొనసాగించారు. ఆదోని నవాబు సిద్ధిమసూద్‌ఖాన్‌ నుంచి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు. మాధవరం దగ్గరున్న కొండశిలకు వెళ్లిన రాఘవేంద్రస్వామి అక్కడి రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చెయ్యాలంటూ దివాన్‌ వెంకన్నాచారిని ఆజ్ఞాపించారట! త్రేతాయుగంలో ఒక బండరాయి సీతారాములకు ఏడుగంటలపాటు విశ్రాంతినిచ్చిందని.. ఆ మేరకు 700 ఏళ్లు పూజలు అందుకుంటుందని ఆ బండరాయికి వరం ఇచ్చారని, ఆ మహిమగల రాయితోనే తన బృందావనం రూపొందించాలని స్వామి చెప్పారని సమాచారం. దీంతో ఆ రాయితోనే స్వామివారి బృందావనాన్ని రూపొందించారు. ఆపై 1671లో రాఘవేంద్రస్వామి మంత్రాలయంలో సజీవసమాధి పొందారు.


ఇక్కడ చూడదగ్గ ప్రాంతాలు

  • కర్ణాటక సరిహద్దులోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం: ఇక్కడే రాఘవేంద్రస్వామి 12 ఏళ్లపాటు తపస్సు చేశారట! నాటి పంచముఖ ఆంజనేయుడి ప్రతిరూపమే ఇక్కడ చూడొచ్చు.
  • పాతూరు: రాఘవేంద్రస్వామి మొదట ఈ గ్రామానికి వచ్చి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేశారట. ఇక్కడ స్వామి వారి విగ్రహాన్ని స్వయంగా రాఘవేంద్ర స్వామివారే చెక్కారట!
  • వెంకన్న ఆచారి ఏకశిలా బృందావనం: రాఘవేంద్రస్వామి ప్రధాన శిష్యుడు వెంకన్న ఆచారి వద్ద రాఘవేంద్రస్వామి రెండు సంవత్సరాలు ఉన్నారట. ఆ మేరకు ఈ వెంకన్నే స్వామివారికి ఏకశిలతో బృందావనం కట్టించారు.
  • రాఘవేంద్రస్వామి దర్శనానంతరం భక్తులకు ప్రత్యేకంగా పరిమళ ప్రసాదం అందిస్తారు. రూ. 20కి 4 ముక్కలు ఇస్తారు. ఇది ఇక్కడి ప్రత్యేక ప్రసాదం.

దర్శన వేళలు: రోజూ ఉదయం 6 గంటల నుంచి 8.30 వరకూ దర్శనానికి అనుమతిస్తారు. మధ్యలో అరగంట విరామం తర్వాత తిరిగి ఉ. 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ దర్శనానికి అనుమతిస్తారు. తిరిగి మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉచిత దర్శనం. ఇక్కడ ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండవు.

భక్తులందరికీ ఉచిత నిత్యాన్నదానం ఉ. 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఉంటుంది. రాత్రి 7 నుంచి 8 గంటల వరకూ రూ. 2కు పులిహోర, పెరుగు అన్నం ఇస్తారు.


మఠంలో ప్రధాన పూజలు

సంపూర్ణ అన్నదాన సేవ: ఒకరోజు సంపూర్ణ అన్నదాన సేవకోసం రూ. 2లక్షలు చెల్లించాలి. ఈ సేవకు 10మందిని అనుమతిస్తారు. 99 పరిమళ ప్రసాదాలు వస్త్రం, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక ఇస్తారు. ఒకరోజు వసతి కల్పిస్తారు. ఏడాదిలో ఎప్పుడైనా ఒకరోజు ముందే శ్రీమఠంలో నమోదు చేసుకోవచ్చు. ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగే పూజల్లో పాల్గొనవచ్చు.

సమర్పణ సేవ: ఒక రోజు సమర్పణ సేవకు రూ. లక్ష చొప్పున చెల్లించాలి. పదిమందిని అనుమతిస్తారు. 99 పరిమళ ప్రసాదాలు, వస్త్రం, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక ఇస్తారు. ఒక రోజు వసతిసౌకర్యం ఉంటుంది. ఎప్పుడైనా ఒకరోజు ముందే శ్రీమఠంలో నమోదు చేసుకోవచ్చు. ఉదయం నుంచి రాత్రివరకూ జరిగే పూజల్లో పాల్గొనవచ్చు.

వస్త్ర సమర్పణ సేవ: వస్త్ర సమర్పణ సేవకు రూ.50 వేలు రుసుం. అన్ని బృందావనాలతో పాటు పీఠాధిపతికి పట్టు వస్త్రాలు ఇస్తారు. పదిమందిని అనుమతిస్తారు. 50 పరిమళ ప్రసాదాలు, వస్త్రం, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక ఇస్తారు. భక్తులు ఒకరోజు ముందే మఠానికి చేరుకోవాలి. పూజకు ముందురోజూ, సాయంత్రం పట్టువస్త్రాలను భక్తులతో వూరేగింపుగా తీసుకొస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగే అన్ని పూజల్లో పాల్గొనవచ్చు. వసతి సౌకర్యం కల్పిస్తారు. ఒకరోజు ముందే ఈ పూజ కోసం నమోదు చేసుకోవాలి.

పట్టువస్త్ర సమర్పణ సేవ: ఇది రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి, పీఠాధిపతికి మాత్రమే. ఇందులో పాల్గొనేందుకు రూ. 25వేలు చెల్లించాలి. 10మందిని అనుమతిస్తారు. 50 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక అందజేస్తారు. ఒకరోజు ముందు శ్రీమఠానికి చేరుకోవాలి. ముందురోజు సాయంత్రం పట్టువస్త్రాలు వూరేగింపుగా తీసుకొస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగే అన్ని పూజల్లో పాల్గొనవచ్చు. ఒకరోజు వసతి సౌకర్యం కల్పిస్తారు.

బంగారు పల్లకి సేవ: మఠంలో బంగారు పల్లకి సేవలో పాల్గొనేందుకు రూ. 8వేలు రుసుం చెల్లించాలి. రోజుకు 10 మందిని మాత్రమే అనుమతిస్తారు. 25 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, వస్త్రం ఇస్తారు. ఉదయం 9.30 గంటలకు పూజ జరుగుతుంది. గంట ముందే శ్రీ మఠానికి చేరుకోవాలి.

బంగారు రథోత్సవ సేవ: బంగారు రథోత్సవ సేవకు రూ. 6వేలు చెల్లించాలి. రాత్రి 7.30 గంటలకు ఈ సేవ జరుగుతుంది. 10మందిని అనుమతిస్తారు. 50 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, వస్త్రం ఇస్తారు. అదేరోజు సాయంత్రం గంట ముందు శ్రీమఠానికి చేరుకోవాలి.

కనక కవచ సమర్పణ సేవ: కనక కవచ సమర్పణ సేవకు రూ. 3,500 రుసుం. 8 మందిని అనుమతిస్తారు. 25 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, వస్త్రం ఇస్తారు. ఉదయం 7.30 గంటలకు జరుగుతుంది. గంట ముందు మఠానికి చేరుకోవాలి.

రజత రథోత్సవ సేవ: ఈ రజత రథోత్సవ సేవలో పాల్గొనదల్చిన భక్తులు రూ. 2 వేలు రుసుంగా చెల్లించాలి. ఆరుగురిని అనుమతిస్తారు. 25 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, వస్త్రాలు ఇస్తారు. రాత్రి 7.30 గంటలకు జరుగుతుంది. గంట ముందు మఠానికి చేరుకోవాలి.

రథోత్సవ(చెక్క)సేవ: (చెక్క) రథోత్సవ సేవ కోసం భక్తులు రూ. 1000 చెల్లించాలి. రాత్రి 7.30కి ఈ సేవ నిర్వహిస్తారు. నలుగురికి అనుమతి ఉంటుంది. 20 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, శాలువా ఇస్తారు. దీనికి ముందురోజే నమోదు చేసుకుని మఠానికి చేరుకోవాలి.

కనక మహాపూజ: ఈ పూజ ఉదయం 7.30 గంటలకు జరుగుతుంది. రూ. 750 చెల్లించాలి. నలుగురిని అనుమతిస్తారు. 20 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, వస్త్రం అందజేస్తారు.

పూర్ణసేవ: పూర్ణసేవ రోజూ ఉదయం 7.30 గంటలకు జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు రూ. 500 చెల్లించాలి. నలుగురిని అనుమతిస్తారు. 15 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, వస్త్రం అందజేస్తారు.

మహాపూజ: మహాపూజ ఉదయం 7.30 గంటలకు జరుగుతుంది. దీనికోసం భక్తులు రూ. 350 చెల్లించాలి. ముగ్గురిని అనుమతిస్తారు. 10 పరిమళ ప్రసాదాలు, వస్త్రం ఇస్తారు. గంట ముందు మఠంలో ఉండాలి.

సర్వసేవ: సర్వసేవ ఉదయం 7.30 గంటలకు జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు రూ. 250 చెల్లించాలి. ఇద్దరిని అనుమతిస్తారు. 10 పరిమళ ప్రసాదాలు, వస్త్రం బహుమతిగా ఇస్తారు. సేవకు గంట ముందు మఠంలో ఉండాలి.

ఉత్సవరాయ పాదపూజ: ఉత్సవరాయ పాదపూజ ఉదయం 7.30 గంటలకు జరుగుతుంది. రూ. 200 చెల్లించాలి. ఇద్దరికీ అనుమతి ఉంటుంది. వస్త్రం ఇస్తారు. పూజకు ముందుగానే హాజరవ్వాలి.

ఫల పంచామృతాభిషేకం: ఫల పంచామృతాభిషేకం ఉదయం 8.30 గంటలకు జరుగుతుంది. రూ. 150 చెల్లించాలి. ఇద్దరిని అనుమతిస్తారు. వస్త్రం ఇస్తారు.

పంచామృత సేవ: ఉదయం 8.30 గంటలకు జరుగుతుంది. రూ. 75 చెల్లించాలి. ఇద్దరిని అనమతిస్తారు. వస్త్రం ఇస్తారు.

శ్రీవాయుస్తుతి పునశ్చరణ సేవ: బృందావనానికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామికి ఈ సేవ చేస్తారు. ఇది ప్రతి శుక్రవాం మాత్రమే ఉదయం 7.30 ఉంటుంది. రూ. 500 చెల్లించాలి. నలుగురిని అనుమతిస్తారు. 10 పరిమళ ప్రసాదాలు, వస్త్రం ఇస్తారు.

శ్రీవాయుస్తుతి పునశ్చరణ(శుద్ధోదక): ఆదివారం నుంచి శుక్రవారం వరకూ ఉదయం 7.30కు నిర్వహిస్తారు. రూ. 200 చెల్లించాలి. ఇద్దరికి అనుమతి ఉంటుంది. నాలుగు పరిమళ ప్రసాదాలు, వస్త్రం ఇస్తారు.

శ్రీ సత్యనారాయణ స్వామిపూజ: ఉదయం 9 గంటలకు జరుగుతుంది. రూ. 200 చెల్లించాలి. వస్త్రం ఇస్తారు.

సామూహిక సత్యనారాయణ స్వామిపూజ: పౌర్ణమిరోజు మాత్రమే చేస్తారు. రూ. 50 చెల్లించాలి. ఉదయం 9 గంటలకు జరుగుతుంది. ఈ పూజలో పాల్గొనేందుకు పౌర్ణమికి ముందు రోజు నమోదు చేసుకోవాలి.

గోదాన సేవ: ఉదయం 9 నంచి 12 వరకూ ఉంటుంది. రూ. 5 వేలు చెల్లించాలి. కుటుంబం మొత్తం అనుమతిస్తారు. 50 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి మఠం జ్ఞాపిక ఇస్తారు.

ఆయా ఆర్జిత సేవలను భక్తులు ఆన్‌లైన్‌లోనూ బుక్‌ చేసుకోవచ్చు లేదా నేరుగా శ్రీ మఠానికి వచ్చి.. బుక్‌ చేసుకోవచ్చు.


మఠంలో వసతి.. ఇతర సౌకర్యాలు

ఇక్కడ భక్తుల కోసం నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. రోజు ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ అన్న ప్రసాద వితరణ ఉంటుంది. రాత్రి భోజనంగా రూ. 2కు పెరుగన్నం.. చిత్రాన్నం ఇస్తారు. మంత్రాలయంలో భక్తుల వసతి కోసం మఠం ఆధ్వర్యంలో 500 గదులున్నాయి. ఇవికాక కర్ణాటక, ఆంధ్రా రాష్ట్రాలకు చెందిన పలు గెస్ట్‌హౌస్‌ల్లోనూ గదులు అందుబాటులో ఉంటాయి.

అదనపు సమాచారం: రూ. 8 వేల నుంచి రూ. 2లక్షల వరకు విరాళంగా అందించే వారికి ఇక్కడ వసతి సౌకర్యం కల్పిస్తారు.

ఏకాదశి రోజు మాత్రం ఎలాంటి పూజలుండవు. కేవలం ఉచిత దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తారు.

ద్వాదశి, ఆరాధనోత్సవాల సమయంలో పూజ వేళల్లో మార్పులుంటాయి. మిగతారోజుల్లో సాధారణమే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని