మహిమాన్వితం.. మురుడేశ్వరం..

కర్ణాటకలోని ప్రసిద్ధ క్షేత్రం మురుడేశ్వరం. ఇది ప్రాచీన పుణ్య క్షేత్రంగానే కాదు, విహారయాత్రకూ ప్రసిద్ధి చెందిన పుణ్య ప్రదేశం. ఉత్తర కన్నడ జిల్లాలోని హోన్నావర్‌ నుంచి జాతీయ రహదారి పక్కన సాగర తీరాన నెలకొన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తూ పరమ శివుడు మురుడేశ్వరస్వామిగా భక్తుల చేత నిత్య నీరాజనాలను అందుకుంటున్నాడు. ప్రకృతి అందాలు, సుందర మనోహర దృశ్యాల నడుమ అలరారుతున్న

Updated : 12 Mar 2023 12:43 IST

మహిమాన్వితం.. మురుడేశ్వరం..

కర్ణాటకలోని ప్రసిద్ధ క్షేత్రం మురుడేశ్వరం. ఇది ప్రాచీన పుణ్య క్షేత్రంగానే కాదు, విహారయాత్రకూ ప్రసిద్ధి చెందిన పుణ్య ప్రదేశం. ఉత్తర కన్నడ జిల్లాలోని హోన్నావర్‌ నుంచి జాతీయ రహదారి పక్కన సాగర తీరాన నెలకొన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తూ పరమ శివుడు మురుడేశ్వరస్వామిగా భక్తుల చేత నిత్య నీరాజనాలను అందుకుంటున్నాడు. ప్రకృతి అందాలు, సుందర మనోహర దృశ్యాల నడుమ అలరారుతున్న దివ్యాలయం మురుడేశ్వరాలయం.

అతిపెద్ద రాజగోపురం

దేశంలోనే అత్యంత పెద్ద రాజగోపురం గల ఆలయంగా ప్రసిద్ధి చెందిన మురుడేశ్వరాలయం ఇక్కడి ధార్మిక ఔన్నత్యాన్ని చాటుతూ భక్తిశ్రద్ధలకు సాక్షిగా నిలిచింది. ఈ రాజగోపుర నిర్మాణానికి తంజావూరుకు చెందిన సుమారు 500 కంటే ఎక్కువ మంది స్థపతులు దాదాపు పదేళ్ల పాటు అవిశ్రాంతంగా శ్రమించారు.  ఉత్తర కన్నడ జిల్లా భట్కళ సమీపంలో జాతీయ రహదారి మార్గంలో మురుడేశ్వర క్షేత్రం ఉంది. దేవాలయానికి ఎదురుగా విశిష్టమైన రాజగోపురాన్ని నిర్మించారు. ఇది 250 అడుగుల బృహత్‌నిర్మాణం. దీని వెడల్పు 105 అడుగులు. ఇది క్రమంగా తగ్గుతూ శిఖరాగ్రానికి చేరేసరికి 78 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ భవ్యమైన గోపురంలో 21 అంతస్తులు ఉన్నాయి. గోపుర గోడలపై ద్రావిడ శైలిలో చెక్కిన సుందరమైన శిల్పాలను చూడవచ్చు. ఇక్కడి శిల్ప సౌందర్యం, ప్రకృతి రమణీయత, ప్రశాంత వాతావరణం భక్తుల హృదయాల్లో మధురానుభూతిని నింపుతాయి.

పరమేశ్వరుని విగ్రహం

మురుడేశ్వర పర్వతం పైన పద్మాసనంలో చిన్ముంద్రాకింతుడైన మహాశివుని విగ్రహం కేవలం ఎత్తులోనే కాక ధీరగంభీర ముఖ సౌందర్యంలో శ్రమ సౌందర్యాన్ని చాటుతుంది. దండ కమండలాలు, శూల దండనాలు శివోన్నతికి ప్రతీకలై గోచరిస్తాయి. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద శివస్వరూపం. యోగులు, మహా పురుషుల పాదస్పర్శతో పునీతమైన ఈ దివ్యాలయం వారి తపోబలంతో మరింత ప్రసిద్ధినొందింది. బృహదాకారపు ఈశ్వరుని శిలామూర్తికి ఎదురుగా నిలిచిన నందీశ్వరుని విగ్రహ పీఠభాగంలోని శివలింగాన్ని 2008వ సంవత్సరంలో శృంగేరి శారదాపీఠ శ్రీ భారతి తీర్థుల వారి ప్రతినిధి శ్రీ సద్యోజాత శ్రీ శంకరాశ్రమ స్వాముల వారు ప్రతిష్ఠించారు. ఈ మహా శివుని మహా మూర్తి ప్రతిష్ఠించిన పీఠభాగంలో అద్భుతమైన గుహాలయం ఉంది. అందులో ఆత్మలింగావిష్కరణ క్రమాన్ని శిలాగాథగా మార్చారు.

మహిమాన్వితం.. మురుడేశ్వరం..

స్థలపురాణం

పరమేశ్వరుని పరమ భక్తురాలైన రాజమాత కైకసి రావణుని తల్లి. ఆమె సముద్ర తీరంలో మహా శివున్ని పూజించడానికి సైకత లింగాన్ని తయారు చేసి అర్చించేది. ఆ పరమాత్ముడు లంక పట్టణంలో వెలసి తన కృపా కటాక్షాలను నిరంతరం ప్రసరింపజేయాలన్నది ఆమె కోరిక. ఆ మహా భక్తురాలి ఏకాగ్రత, భక్తికి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. ఆవిడ భక్తికి మెచ్చి బోళాశంకరుడు కైలాసాన్నే తీసుకొని వెళ్లి శ్రీలంకలో ప్రతిష్ఠిస్తాడమోననే భయం పట్టుకొంది. అందుకే ఆమెకు తపోభంగం చేయడానికై సముద్రుడు వచ్చాడు. సముద్ర కెరటాలు ఆకాశమంత ఎత్తున లేచి కల్లోలం సృష్టిస్తుంటే పాపం కైకసి చేస్తున్న సైకత శిల్పం ఆకృతి పొందక ముందే కరిగిపోయింది. ఆ మహా భక్తురాలి హృదయం దుఃఖంతో కుంగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రావణ బ్రహ్మ ‘సైకత శిల్పం కరిగిపోయినందుకు బాధపడకమ్మా, నీకోసం ఆ కైలాసాన్ని, ఆత్మలింగాన్ని తెచ్చి పెడతాను’ అని మాట ఇచ్చాడు. తల్లికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి రావణుడు తపస్సు మొదలు పెట్టాడు. ఆ మహా తపస్వి మహా తపస్సుకు ఏడేడు పద్నాలుగు లోకాలు కంపించిపోయాయి. ఇంద్రాది దేవతలు సమావేశమై రావణుని తపోభంగం చేయమని నారద మహర్షికి మొరపెట్టుకున్నారు. రావణుని ఘోర తపస్సు ఫలించలేదు. శివ దర్శన సౌభాగ్యం దక్కలేదు. దానితో కోపితుడైన రావణుడు తన ఆరాధ్య దైవం తన భక్తిని శంకిస్తున్నాడని బాధ పడ్డాడు. దాంతో కైలాసాన్నే పెకిలించుకుపోవాలనే ప్రయత్నంలో కైలాస పర్వతాన్ని భుజాలపైకి ఎత్తుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు తన కాలి బొటన వేలితో రావణుని అహంకారాన్ని అణచివేశాడు. అయినా దశకంఠుడు తన ప్రయత్నాన్ని విరమించలేదు. తన ఘోర తపస్సును సైతం గుర్తించని శివున్ని సాక్షాత్కరించుకోవడం కోసం ఒక్కొక్కటిగా పది తలలను పూజా సుమాలుగా సమర్పించి ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డాడు. దాంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమై ‘రావణా... నీ భక్తికి మెచ్చాను. ఏం వరం కావాలో కోరమనగా ’ అప్పుడు రావణాసురుడు ‘ తండ్రి.... మా తల్లి నిత్య పూజల కోసం కైలాసంలోని ఆత్మలింగాన్ని ప్రసాదించమ’ని వేడుకున్నాడు. కరుణాంతరంగుడైన ఈశ్వరుడు తథాస్తు అని ఆత్మలింగాన్ని ఇచ్చి దాన్ని దారిలో ఎక్కడా కింద పెట్టకుండా తీసుకెళ్లి తల్లి చేతికిమ్మన్నాడు. ఈ సంగతి తెలుసుకున్న నారదుడు ఆత్మలింగాన్ని లంకకు చేరనివ్వరాదనే సంకల్పంతో విఘ్నేశ్వరుని వద్దకు వెళ్లారు. వటువు రూపంలో వెళ్లి రావణుని నుంచి ఆత్మలింగాన్ని సంగ్రహించమని సలహా ఇచ్చాడు.

ఆత్మలింగం

రావణుడు ఆత్మలింగాన్ని తీసుకుని బయల్దేరాడు. సంధ్యా సమయం ఆసన్నమైంది. సంద్యావందన సమయంలో ఆత్మలింగాన్ని నేల మీద పెట్టకుండా ఉండటానికి ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా గణపతి బాల వటువుగా ఎదురయ్యాడు. అప్పుడు రావణుడు ‘బాలకా... కొంతసేపు ఈ శివలింగాన్ని పట్టుకో నేను వెంటనే సంధ్యావందనాన్ని పూర్తి చేసుకొని వచ్చేస్తాను’ అంటూ ఆత్మలింగాన్ని వటువు చేతిలో పెట్టి సంధ్యావందనానికి వెళ్లాడు. వందనం చేస్తుండగా బాలవటువు ‘ రావణా సమయం మించి పోయింది నేను వెళ్లిపోతున్నాను’ అంటూ ఆత్మలింగాన్ని నేల మీద పెట్టాడు. దాంతో రావణునికి ఒళ్లు తెలియని కోపం వచ్చేసింది. తన తపఃఫలాన్ని క్షణాల్లో మట్టిపాలు చేసినందుకు ఆ వటువు తలపై పిడికిలి బిగించి ముష్టిఘాతాలు కురిపించాడు. గణపతి తలకి గుంట పడుతుంది. వినాయకుడు లింగాన్ని భూమి మీద నిలిపిన స్థలం గోకర్ణ. విష్ణువు తన మాయని తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో కనిపిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించిన రావణుడు మళ్లీ ఆత్మలింగాన్ని చేతిలోకి తీసుకొనే ప్రయత్నం చేశాడు. కానీ సాధ్యపడలేదు. తనని దేవాది దేవతలందరూ కలిసి మోసం చేశారని తెలుసుకొని ఆత్మలింగాన్ని ఎలాగైనా పెకిలించుకుపోవాలనుకుని విశ్వప్రయత్నం చేశాడు. ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరిస్తే గోకర్ణకు 23 కిలోమీటర్ల దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడింది. లింగం పైన ఉన్నభాగాన్ని తొలగించి విసిరితే అది గోకర్ణకు 27 కిలోమీటర్ల దూరంలో గుణేశ్వరలో పడుతుంది. లింగం పైనున్న వస్త్రాన్ని విసిరితే అది కందుక పర్వతం పై నున్న మృదేశ్వరంలో పడుతుంది. ఆ పేరు కాలక్రమంలో మురుడేశ్వరునిగా మారింది.

మహిమాన్వితం.. మురుడేశ్వరం..

గర్భాలయంలోకి చేరుకొన్న భక్తులు శ్రీ మురుడేశ్వరస్వామి వారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకొని అచంచల భక్తి విశ్వాసాలను స్వామి వారి పట్ల ప్రదర్శించి అద్వితీయ ఆనందం చెందుతారు. ఇదే ఆలయంలో కొలువైన ఇతర దేవీదేవతల దర్శన భాగ్యంతో సమస్త సిద్ధులు వరిస్తాయని భక్తుల నమ్మకం. క్షేత్రపాలకుడైన శ్రీ మురుడేశ్వరుని పరివారంగా శ్రీ గణపతి, గౌరీ, దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య, నవగ్రహ మందిరాలు ఇక్కడ ఉన్నాయి. ఎదురుగా నందీశ్వర మండపం, ధ్వజస్తంభాలున్నాయి. అక్కడక్కడ బలిపీఠాలున్నాయి. బయట ద్వారపాలకుడైన వాగిలజిట్టిగని గుడి, అశ్వత్థ వృక్షాలు ఉన్నాయి. మురుడేశ్వర ఆలయానికి అధిష్ఠాన శిఖరమైన కందుగిరిలో కమండల తీర్థం, జటా తీర్థం, భీమ తీర్థం, శంకు తీర్థాలు ఉన్నాయి. ఇక్కడ ప్రాతఃస్మరణం, మధ్యాహ్నికం, సాయంకాలాలు అంటే త్రికాల పూజలు యథావిధిగా జరుగుతాయి.

ఎలా చేరుకోవాలి
విమాన మార్గం: మురుడేశ్వరానికి విమానం ద్వారా చేరుకోవాలంటే దగ్గరలో ఉన్న విమానాశ్రయం మంగళూరు. సుమారు 156 కి.మీ. దూరంలో ఉంటుంది. అక్కడ నుంచి నేరుగా వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. హుబ్లీ విమానాశ్రయం కూడా సుమారు 156 కిలో మీటర్ల దూరంలో ఉంది.

రైలు మార్గం: ఈ క్షేత్రం కొంకణ్‌ రైల్వే మార్గంలో ఉంది. భట్కళ వరకు రైలులో చేరుకొని అనంతరం కొంకణ్‌ రైల్వేలైను ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం: మురుడేశ్వర క్షేత్రానికి అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సు సౌకర్యం కలదు. ట్యాక్సీల ద్వారా కూడా ప్రధాన ఆలయానికి చేరుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని