మనసంతా.. నీలిమంటే!

నేను తెలివైన వాడిననీ, బాగా చదువుతానని అందరూ మెచ్చుకుంటారు. కానీ పెద్దగా కష్టపడకుండానే డిగ్రీ వరకు మంచి మార్కులు సాధిస్తూ వచ్చా

Updated : 14 Jan 2023 09:10 IST

* నేను తెలివైన వాడిననీ, బాగా చదువుతానని అందరూ మెచ్చుకుంటారు. కానీ పెద్దగా కష్టపడకుండానే డిగ్రీ వరకు మంచి మార్కులు సాధిస్తూ వచ్చా. తర్వాత నాలుగేళ్ల నుంచి పోటీ పరీక్షలు రాస్తున్నా. ఏదీ మొదటి దశ దాటలేకపోతున్నా. పుస్తకం తెరిస్తే ఏవో పిచ్చి ఆలోచనలు. అందమైన అమ్మాయిలతో రొమాన్స్‌ చేస్తున్నట్టు కలలు కనడం, క్రికెట్‌, పోర్న్‌ వీడియోలు చూడటం.. ఎంత వద్దనుకున్నా మానలేకపోతున్నా. నాపై నాకే నమ్మకం పోతోంది. తెలివైన వాడిని కాదనిపిస్తోంది. లక్ష్యాన్ని చేరేదెలా?

ఎస్‌.ఎస్‌., ఈమెయిల్‌


* మీలాంటి సమస్యనే సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్నారు. మిమ్మల్ని అంతా మెచ్చుకోవడంతో ఆ పొగడ్తలకు పొంగి ప్రిపరేషన్‌ ప్రారంభించారు. వేరేవాళ్లు మెచ్చుకున్నారని కాకుండా.. మనకు ఒక స్పష్టమైన లక్ష్యం, దానిపట్ల అంతులేని ప్రేమ ఉన్నప్పుడే ఎందులో అయినా నెగ్గుకు రాగలం. లక్షలమంది పోటీ పడే సివిల్స్‌, గ్రూప్స్‌లాంటివి సాధించడానికి చాలా హార్డ్‌వర్క్‌, అంకితభావం ఉండాలి. కఠోర సాధన, విస్తృతమైన పరిజ్ఞానం కావాలి. అలా చదివితేనే విజయం సాధ్యం. అసలు ముందు మీరు ఏం కావాలనుకుంటున్నారో తెలుసుకోండి. నిజంగా మీ లక్ష్యం సివిల్స్‌, గ్రూప్స్‌ అయితే S= Strength, W = Weakness, O = Opportunities, T = Threats  అనాలసిస్‌ చేసుకోండి. ఇవే మీ బలాలు, బలహీనతలు, అవకాశాలు, అవరోధాలు. ఇందులో మొదటి రెండు మనలో అంతర్గతంగా ఉండేవి. తర్వాతవి బహిరంగమైనవి. వీటిని విశ్లేషించుకున్న తర్వాత అన్నీ సానుకూలంగా ఉన్నాని భావిస్తే.. ఒకవేళ లేకపోయినా అనుకూలంగా మార్చుకోగలను అనుకుంటే కచ్చితంగా ముందుకెళ్లండి.

మీ ప్రధాన సమస్య ఏకాగ్రతా లోపం, చెడు ఆలోచనలు. సహజంగా మనకు ఏది ఆసక్తి ఉంటే దానిపైనే ఎక్కువ ధ్యాస ఉంటుంది. ఈరోజుల్లో సెల్‌ఫోన్‌ అందరికీ అందుబాటులో ఉంది. ప్రతి దానికీ దానిపైనే ఆధారపడుతున్నారు. మనం ఎక్కువగా ఏం చూస్తామో. అవే మెదడులో తిరుగుతుంటాయి. ముందు దానిపై నియంత్రణ ఉండేలా చూసుకోండి. ఈ అలవాటు ఒకేసారి మానేయడం కష్టం కాబట్టి మెల్లమెల్లగా స్క్రీన్‌ టైమ్‌ తగ్గించండి. పోర్న్‌ వీడియోలు చూడటం మానేస్తేనే చెడు ఆలోచనలూ తగ్గుతాయి. గ్రూప్స్‌, సివిల్స్‌ విజేతల ఇంటర్వ్యూలు ఎక్కువగా చదువుతుంటే వాళ్ల నుంచి స్ఫూర్తి పొందుతారు. యోగా, ధ్యానం చేస్తుంటే ఏకాగ్రత పెరుగుతుంది. ఇవన్నీ పాటిస్తూ త్వరలోనే ప్రిపరేషన్‌ ప్రారంభించండి. ఆల్‌ ది బెస్ట్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని