పండగ మెరుపుల్‌... సొగసులు జిగేల్‌!

దసరా సరదాలు వచ్చేశాయి.. దీపావళి వెలుగులు ముందున్నాయి. ఆపై పెళ్లిళ్ల సీజన్‌ ఉండనే ఉంది. పండగ ఏదైనా, వేడుక ఎలాంటిదైనా సందడంతా కుర్రకారుదే కదా! ఇలాంటి ప్రత్యేక సందర్భాలకు ప్రత్యేకంగా ఉండకపోతే ఎలా? అందుకే ఆధునికతను కాస్త పక్కన పెట్టి సంప్రదాయానికి పట్టం కడదాం.

Published : 14 Oct 2023 00:19 IST

దసరా సరదాలు వచ్చేశాయి.. దీపావళి వెలుగులు ముందున్నాయి. ఆపై పెళ్లిళ్ల సీజన్‌ ఉండనే ఉంది. పండగ ఏదైనా, వేడుక ఎలాంటిదైనా సందడంతా కుర్రకారుదే కదా! ఇలాంటి ప్రత్యేక సందర్భాలకు ప్రత్యేకంగా ఉండకపోతే ఎలా? అందుకే ఆధునికతను కాస్త పక్కన పెట్టి సంప్రదాయానికి పట్టం కడదాం. సంస్కృతిని మేనిపై మెరిపించే ఫ్యాషన్లు ఒంటికి చుట్టేద్దాం. ఇదిగో ఇలా.

పండగలంటే చక్కగా ముస్తాబడమే కాదు.. ఇదొక భావోద్వేగం. ఇదొక సంస్కృతి. మనసులోని ఆలోచనల్ని తనువు ద్వారా వ్యక్తపరిచే వేదిక. అందుకే ఈ వేడుకలో స్టైల్‌తో చెలరేగిపోవాల్సిందే. ప్రతి పండగా కొన్ని కొత్త ట్రెండ్‌లను మోసుకొస్తుంటే.. ఇంకొన్ని ఎవర్‌గ్రీన్‌గా ఉంటాయి. ఆ రెండింటినీ మేళవించి అలంకరణ జిగేల్‌మనేలా సొగసుల మంత్రం వేద్దామిలా.


అబ్బాయిలు అదిరిపోయేలా..

ధోతీ కుర్తా: పండగ, ఉత్సవాలు, పెళ్లిళ్లు.. సందర్భం ఏదైనా ధోతీ కుర్తాలతో కుర్రాళ్లు చెలరేగిపోవచ్చు. సంప్రదాయం, సౌకర్యం ఈ ఫ్యాషన్‌ సొంతం. ఇందులోనూ ప్లెయిన్‌ ధోతీ, ప్రింటెడ్‌ డిజైన్‌ కుర్తా.. జోడీ బాగుంటుంది. వీటికితోడు నలుపు, గోధుమరంగు సాండిల్స్‌ లేదా కోల్హాపురి చెప్పులు కూడా ధరిస్తే పండగ కళ ఉట్టిపడుతుంది.

నెహ్రూ జాకెట్‌: సొగసు, ఆధునికతల మేళవింపు నెహ్రూ జాకెట్‌. కొందరు రోజువారీ అవసరాలకు ధరించే ఈ స్టైల్‌.. పండగలు, పెళ్లి సందర్భాలకు చక్కగా సరిపోతుంది. సాదాసీదా రంగుల కుర్తాలపై ఈ జాకెట్‌ వేస్తే లుక్‌ అదిరిపోతుంది. జతగా ధోతీ, పైజామాలు ప్రయత్నించొచ్చు. మ్యూల్స్‌ షూలు కూడా వేస్తే అందం రెట్టింపు కావడం ఖాయం.

ప్రింటెడ్‌ కుర్తా, జాకెట్‌: ఈ సమయంలో అందరి దృష్టిలో పడాలి.. నలు గురిలో ఉన్నా మెరిసిపోవాలి అనుకుంటే ప్రింటెడ్‌ కుర్తా, జాకెట్‌ కాంబోకి ఒంటిపై చోటివ్వాల్సిందే. ఈ ముదురు రంగుల కుర్తా, జాకెట్లకి.. తెలుపు రంగు ప్యాంట్లు, నలుపు రంగు మాంక్స్‌ బాగా నప్పుతాయి.

పొట్టి కుర్తాలు: కొంచెం ఆధునికత, మరింత సంప్రదాయం మేళవించాలి అనుకునే అబ్బాయిలు పొట్టి కుర్తాలకు ఓటేయొచ్చు. ఇందులోనూ ప్రింటెడ్‌ డిజైన్లు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని జీన్స్‌తో కలిపి జతగా వేసుకోవచ్చు. బీడెడ్‌ బ్రేస్‌లెట్లు, స్మార్ట్‌వాచీలూ, క్యాజువల్‌ షూలు లేదా కొల్హాపురి పాదరక్షలూ ధరిస్తే.. సంప్రదాయం, ఆధునికత కలిసిపోయినట్టు ఉంటుంది.

చికంకారీ కుర్తాలు: అచ్చంగా సంప్రదాయం ఉట్టిపడేలా ఉండాలంటే చికంకారీ కుర్తాలను ఎంచుకోవచ్చు. వీటికి లూజ్‌ ఫిట్‌ బాటమ్స్‌ బాగా నప్పుతాయి. ఇవి సంప్రదాయానికి చిరునామాలా కనపడటమే కాదు.. సౌకర్యవంతంగానూ ఉంటాయి.


అమ్మాయిలు అందంగా..

చీరతో సింగారం: జీన్స్‌తో ఆధునికంగా కనిపించే కాలేజీ అమ్మాయైనా, చుడీదార్‌తో టిప్‌టాప్‌గా తయారయ్యే కుర్రదైనా ఈ సీజన్‌లో చీరకి జై కొడితే.. పదహారణాల అచ్చ తెలుగు అతివలా కనిపిస్తుంది. చీర ఎవర్‌గ్రీన్‌ ఫ్యాషన్‌. పట్టుచీర కట్టి ఆకట్టుకుంటారా? ప్యాచ్‌వర్క్‌, ఎంబ్రాయిడరీ చేసిన ఆరుగజాలతో మాయ చేస్తారా అన్నది మీ ఇష్టం. చీర కడితే సంప్రదాయ సొగసుల్ని సంపూర్ణంగా ఒంటికి చుట్టేసుకున్నట్టే. కాస్త ఆధునికంగా ఉండాలనుకుంటే.. కుచ్చుల అంచులున్న రఫుల్‌ చీరల్ని సింగారించుకోవచ్చు. ఇది లేటెస్ట్‌ ట్రెండ్‌.

అనార్కలిలా ముస్తాబు: అమ్మాయిల్లో పండగ కళ ఉట్టిపడాలంటే భారీ వర్క్‌ చేసిన సల్వార్‌ కమీజ్‌లను ఎంచుకోవచ్చు. ఇంకాస్త రిచ్‌లుక్‌లో కనిపించాలనుకునే మహిళలు అనార్కలి డ్రెస్‌లను ఆదరిస్తే సరి. వీటికితోడు చేతికి గాజులు, చెవులకు జుంకాలూ పెడితే పండగ మరింత వెలుగులీనుతుంది.

తారలు మెచ్చిన షరారా: ఈమధ్యకాలంలో సంప్రదాయ వేడుకలు, పెళ్లిళ్లలో షరారా డ్రెస్‌లను మన సినిమా తారలు అత్యధికంగా ఆదరించడం మీరు గమనించారా? సంప్రదాయంతోపాటు మరింత ఫ్యాషన్‌గా కనిపించాలనుకునే అమ్మాయిలు ఈ స్టైల్‌ని ఎంచుకోవచ్చు. వీటికి కురచ కుర్తీలు, ఎంబ్రాయిడరీ దుపట్టాలూ జత చేసినప్పుడు అందరి చూపూ మీపైనే పడటం ఖాయం.

ఎవర్‌గ్రీన్‌ లెహెంగా: వేడుకలు, పండగలు అనగానే అమ్మాయిలకు గుర్తొచ్చే ఎవర్‌గ్రీన్‌ సంప్రదాయ స్టైల్‌ లెహెంగాలే. వీటితో ఎన్నిరకాల ప్రయోగాలైనా చేయొచ్చు. బీడ్స్‌, సెక్విన్స్‌ తళుకులు అద్దితే డ్రెస్‌లు మరింత రిచ్‌గా ఉంటాయి. అన్నట్టు ఈ సీజన్‌లో సిల్క్‌ ఫ్యాబ్రిక్‌ లెహెంగాలు ధరిస్తే మరింత ప్రత్యేకంగా ఉంటాయి. వీటికి జతగా నిండు చేతుల రవికెలు వేస్తే మరింత హుందాతనాన్ని తీసుకొస్తాయి.

సౌకర్యాల పలాజోలు: సంప్రదాయానికి కొంచెం ఆధునికత మేళవించాలనుకునే అమ్మాయిలు పలాజోలను ఎంచుకోవచ్చు. సౌకర్యవంతంగా ఉండటం వీటి మరో ప్రత్యేకత. బంగారు వర్ణం పలాజోలకు అపోజిట్‌ రంగులో కుర్తీలు వేస్తే.. మేని మెరుపులు ఇనుమడించడం ఖాయం. ఈ దుస్తులకు హై హీల్స్‌ లేదా స్ట్రాపీ సాండిల్స్‌ జత చేస్తే వందశాతం సొగసుల ముస్తాబు పూర్తవుతుంది.


అవీ ముఖ్యమే.. ఎన్ని ఫ్యాషన్లు, ఎన్ని బ్రాండ్లు అందుబాటులో ఉన్నా.. ప్రతి ఒక్కరి ఒంటికి సరిపోయేలా అన్ని డ్రెస్‌లూ ఉండవు. అమ్మాయి, అబ్బాయి ఎవరైనా.. కొలతలు తీసుకొని కుట్టించుకున్న ఒక్క డ్రెస్‌నైనా తమ వార్డ్‌రోబ్‌లో ఉంచుకోవాలి. మనం అందంగా, ఆకర్షణీయంగా కనిపించడంలో డ్రెస్‌ల పాత్ర ఎంత ఉంటుందో.. బెల్ట్‌లు, షూలు, గాగుల్స్‌లాంటి ఇతర యాక్సెసరీల పాత్రా అంతే ఉంటుంది. వీటితో పాటు అలంకరణా ముఖ్యమే. డ్రెస్‌లు సరైన కొలతల్లో ఉండటం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, సరిగ్గా దువ్వుకోవడం, నడక, నడత.. ఇవీ స్టైల్‌లో భాగమే.

మనీశ్‌ మల్హోత్రా, ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు