తారల చూపు.. అభిషేక్‌ వైపు!

రష్మిక మందన్న.. దీపికా పదుకొణె.. హార్ధిక్‌ పాండ్యా.. వీళ్లలో సెలెబ్రిటీ ఎవరైనా కనిపిస్తే చుట్టూ జనం పోగవుతారు. సెల్ఫీలంటూ ఎగబడతారు. కానీ ఈ తారలంతా అభిషేక్‌ గొలెచా వైపు చూస్తారు. ఎవరితను? అంటే.. డిజిటల్‌ మీడియా వాణిజ్య ప్రకటనల్లో రారాజు.

Updated : 21 Oct 2023 03:38 IST

రష్మిక మందన్న.. దీపికా పదుకొణె.. హార్ధిక్‌ పాండ్యా.. వీళ్లలో సెలెబ్రిటీ ఎవరైనా కనిపిస్తే చుట్టూ జనం పోగవుతారు. సెల్ఫీలంటూ ఎగబడతారు. కానీ ఈ తారలంతా అభిషేక్‌ గొలెచా వైపు చూస్తారు. ఎవరితను? అంటే.. డిజిటల్‌ మీడియా వాణిజ్య ప్రకటనల్లో రారాజు. తారలకు వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదిర్చిపెట్టే వారధి. కృత్రిమ మేధతో.. డిజిటల్‌ మీడియాకి మెరుగులద్దుతున్న నిపుణుడు.

బాలీవుడ్‌, టాలీవుడ్‌... సినిమా పరిశ్రమ ఏదైనా.. అందులోని హీరోహీరోయిన్లు.. ప్రముఖ క్రీడాకారులు ఈమధ్య కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండటం చూస్తున్నాం. సినిమాల సమాచారం పంచుకోవడానికి.. అభిమానులతో అనుబంధం పెంచుకోవడానికే కాదు.. అప్పుడప్పుడూ వాణిజ్య కంపెనీల తరఫున పోస్టులూ పెడుతుంటారు. ప్రత్యేకంగా ముస్తాబై వాళ్ల ఉత్పత్తులకు ప్రచారం చేస్తుంటారు. ఇలా ఒక్కో ఫొటో, వీడియో, పోస్టుకి లక్షల్లోనే నజరానాలు అందుతుంటాయి. ఆ తారలు, కంపెనీల మధ్య బేరం కుదిర్చి పెట్టడంలో అభిషేక్‌ది కీలకపాత్ర. అడిడాస్‌, ఫోక్స్‌వ్యాగన్‌, క్రాక్స్‌, క్లినిక్‌, తనిష్క్‌, మాన్యవర్‌... ఇలా పేరు మోసిన దాదాపు యాభై కంపెనీలకు.. దీపిక పదుకొణె, సారా అలీఖాన్‌, హార్ధిక్‌ పాండ్యా, అనన్య పాండే, తాప్సీ, ఊర్వశి రౌతేలా, రష్మిక మందన్న... ఇలా దాదాపు రెండు డజన్ల మంది స్టార్లు ప్రచారం చేయడంలో వెనక ఉన్నది ఇతడే. ఒప్పందాలు కుదర్చడమే కాదు.. ఫేమ్‌ని కాసులుగా మలచుకునే మార్గాలూ వెతికి పెడతాడు. డిజిటల్‌, సోషల్‌ మీడియా ఊపు పెరుగుతున్న నేపథ్యంలో ఆ వేదికలను సమర్థంగా ఉపయోగించుకోవడానికి బడా కంపెనీలు ఈమధ్య కాలంలో సామాజిక మాధ్యమాలవైపు మళ్లిన సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్‌ని దాదాపు ఏడెనిమిదేళ్ల నుంచి తనకు అనుకూలంగా మలచుకొని డిజిటల్‌ మీడియా రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు అభిషేక్‌.

కృత్రిమ మేధతో అంతర్జాలంలో ప్రయోగాలు చేయడం ఈమధ్యకాలంలో ఓ ట్రెండ్‌లా మారింది. ఇందులోనూ తానేంటో నిరూపించుకున్నాడు. టెక్నాలజీ, సృజనాత్మకతని సమ్మిళితం చేసి అద్భుతాలే చేస్తున్నాడు. సోనాక్షి సిన్హాకి ఈమధ్యే ‘సొయెజీ’ అనే సౌందర్యోపకరణాల కంపెనీతో ఒప్పందం కుదిర్చాడు. ఆమె ఫొటోషూట్‌ చేయకుండానే ఆ ఉత్పత్తులను వాడుతున్నట్టుగా ఏఐతో ఫొటోలు, వీడియోలు తీశాడు. ఇతర సూపర్‌ మోడళ్లను సృష్టించి కంపెనీల తరఫున ప్రచారం చేయిస్తున్నాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని