పక్క చూపులతో అభాసు పాలయ్యా!

ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌బాక్స్‌ తెరిచా. ‘హాయ్‌.. ఎలా ఉన్నారు?’ అనే మెసేజ్‌. పంపింది పద్దూ. నా కళ్లలో మెరుపు. గుండె వేగం రెట్టింపైంది. చేతివేళ్లలోకి కరెంట్‌ పాకింది.

Updated : 15 Jul 2023 07:56 IST

ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌బాక్స్‌ తెరిచా. ‘హాయ్‌.. ఎలా ఉన్నారు?’ అనే మెసేజ్‌. పంపింది పద్దూ. నా కళ్లలో మెరుపు. గుండె వేగం రెట్టింపైంది. చేతివేళ్లలోకి కరెంట్‌ పాకింది. చకచకా ఐదారు మెసేజ్‌లు వదిలా. నా కవిత్వ ప్రతిభ ప్రదర్శిస్తూ.. ఆమె అందాన్ని పొగుడుతూ. వెంటనే రిప్లై వచ్చింది. ‘వావ్‌.. మీరు ఇంత బాగా రాస్తారా?’ అని. నేను చుక్కల ఎమోజీ పంపా. తను లవ్‌ సింబళ్ల ఎమోజీ వదిలింది. నా మనసు గాల్లో తేలిపోసాగింది.

పద్దూతో పరిచయం కోసం ఎప్పట్నుంచో తపిస్తున్నా. ‘హాయ్‌.. బాగున్నారా?’, ‘మీతో స్నేహం చేయాలనుంది’ ఇలాంటి మెసేజ్‌లు లెక్కలేనన్నిసార్లు పంపా. ప్రతి పండక్కీ శుభాకాంక్షలు చెప్పా. గుడ్‌ మార్నింగ్‌, గుడ్‌నైట్‌లు సరేసరి. ఒక్కసారైనా రిప్లై ఇస్తేగా! కాలం కలిసొచ్చిందో.. అదృష్టం తేనెపట్టులా పట్టిందో.. మొత్తానికి ఇలా స్పందించింది.

పద్దూ అందమే నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేది. తన బుగ్గల్లో సొట్టలు ఎంత బాగుంటాయి! నవ్వితే వెన్నెల కురిసినట్టే. ఆమె చీరకట్టు.. ఏ దేవకన్యకీ సాధ్యం కాదేమో! ఇవన్నీ నాకెలా తెలుసంటే.. తన ఇన్‌స్టా ఫొటోలే సాక్ష్యం. అఫ్‌కోర్స్‌.. తనకున్న నలభై ఏడు వేల ఫాలోయర్లలో నేనూ ఒకడినైనా.. నా ప్రయత్నం నాది. ఆర్నెల్లుగా ప్రయత్నిస్తే.. ఆఖరికిలా కరుణించింది.

నాకు దూకుడెక్కువంటారు నా ఫ్రెండ్స్‌. నిజమే. ఏ విషయంలోనూ ఆలస్యం చేయడం ఇష్టం ఉండదు. మెసేజ్‌ కలిసిన మర్నాడే ‘ఫోన్‌ నెంబర్‌ ప్లీజ్‌’ అన్నా. నాలుగైదు రోజులు విసిగించి సాధించా. ఆ నెంబర్‌ని ‘స్వీట్‌ హార్ట్‌’గా సేవ్‌ చేసుకున్నా. నా సందేశాల వెల్లువ ఇన్‌స్టా నుంచి వాట్సప్‌కి మారింది. తను ఎప్పుడో ఓసారి రిప్లై ఇచ్చేది. ఫోన్‌ చేసినా ప్రతిసారీ ఏదో పనిలో ఉన్నానంటూ నాలుగైదు మాటలతో ముగించేది. ఇలాగైతే లాభం లేదనుకొని డోసు పెంచా. తన అడ్రెస్‌కి చాక్లెట్‌లు, పూల బొకేలు పంపా. ఇంకా ఆలస్యం చేయొద్దని ‘ఓసారి కలిసి డిన్నర్‌ చేద్దాం’ అనడిగా. ఈసారి చిత్రంగా వెంటనే ‘ఓ.. యెస్‌’ అంది. ‘శనివారం సాయంత్రం ఏడింటికి.. బ్లూ ఫాక్స్‌ రెస్టారెంట్‌లో కలుద్దాం’ సమయం ఫిక్స్‌ చేశా. ఊకొట్టింది. ఫోన్‌ పెట్టేయగానే ‘యాహూ..’ అంటూ కేకలేసి, గాల్లోకి ఓ పంచ్‌ విసిరా. తను చిన్నసైజు సెలెబ్రిటీ. నాతో డిన్నర్‌కి వస్తే.. గొప్పే కదా!

అరగంట ముందే రెస్టరెంట్‌కి చేరుకున్నా. సమయం దగ్గర పడుతున్నకొద్దీ గుండె దడ పెరగసాగింది. చివరకు రానే వచ్చింది. నాకిష్టమైన ఆకుపచ్చ రంగు చుడీదార్‌, దానిపై గులాబీ రంగు దుపట్టా వేసుకొని. పద్దూ నడిచొస్తుంటే.. ఒక మెరుపు నన్ను సమీపిస్తున్నట్టుగా అనిపించింది. తననే కళ్లార్పకుండా చూస్తూ ఉన్నా. కొద్దిక్షణాలయ్యాక నా గుండెలో ఉరుములు మొదలయ్యాయి. నెత్తిన పిడుగు పడ్డట్టు అనిపించింది. పద్దూ వెనక వస్తున్న మరో అమ్మాయిని చూడగానే. వాళ్లు దగ్గరికొస్తుంటే ముళ్లమీద కూర్చున్నట్టు అనిపించింది. పద్దూ, తను వచ్చి నా ఎదురుగా కూర్చున్నారు. ‘హాయ్‌ అభిలాష్‌.. మీట్‌ మై క్లోజ్‌ఫ్రెండ్‌ దీప్తి’ అంటూ పద్ధూ ఆమె స్నేహితురాలిని చూపించింది. ‘హాయ్‌ అండీ..’ అంటూ ఆమె చేయి చాచింది. నాకు ‘సినిమా’ మొత్తం అర్థమైంది. అక్కడే దీప్తి రెండు చేతులూ పట్టుకున్నా. ‘అన్ని విషయాలూ ఇంట్లో మాట్లాడుకుందాం’ అని చెప్పి బయటికి పరిగెత్తా.
సీన్‌ కట్‌ చేస్తే.. నేనూ, దీప్తి మా బెడ్‌రూంలో ఉన్నాం. ‘మీరేమైనా కాలేజీ స్టూడెంట్‌ అనుకుంటున్నారా? మీకు నాతో పెళ్లైంది. మనకో పాప. సిగ్గు లేదా?’ అని మొదలు పెట్టింది. ఆపకుండా పది నిమిషాలు చెడామడా తిట్టింది. నేను కళ్లు, మనసు, చెవులూ అన్నీ మూసుకున్నా. కొంచెం శాంతించగానే కాళ్లు పట్టుకున్నా.

నిజానికి నాది మరీ చెడ్డ బుద్ధేం కాదు. పద్దూ అందంగా ఉంటుంది. తనంటే చాలా క్రేజ్‌ ఉంది. ఆమెతో ఫ్రెండ్షిప్‌ చేయాలనుకున్నానంతే. అదే మాట అంటే దీప్తి ఒప్పుకోలేదు. ‘సరే.. మీరు నా ఫ్రెండ్‌ కోసం అర్రులు చాచినట్టే.. నేను ఎవరైనా మీ ఫ్రెండ్‌తో చేస్తే ఊరుకుంటారా?’ అనడిగింది. ఆ ప్రశ్న నా గుండెను మెలేసింది. ఆలోచిస్తే నేను చేసింది పెద్ద తప్పే అనిపించింది. మా పెళ్లై రెండేళ్లైంది. దీప్తి నాపై ఎప్పుడూ వందశాతం ప్రేమ చూపిస్తుంటుంది. అంత మంచి భార్య ఉండగా.. స్నేహమో, మోహమో.. ఇంకో అమ్మాయి కావాలనుకోవడం తప్పే. దీప్తికి అప్పుడే మాట ఇచ్చా మళ్లీ ఇలా జరగదని. స్వానుభవంతో మీకూ ఓ మాట చెప్పాలనుకుంటున్నా. పక్కచూపులు వద్దని.    

అభిలాష్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు