నా చెక్కిలిపై ఆమె కన్నీటి సంతకం..

బస్సులో ప్రయాణిస్తున్నా. నా గుండెలో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి. ఊర్లు దాటుతున్నానుగానీ.. నా బాధని మనసులోంచి బయటికి దాటించలేకపోతున్నాను.

Updated : 12 Aug 2023 07:58 IST

బస్సులో ప్రయాణిస్తున్నా. నా గుండెలో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి. ఊర్లు దాటుతున్నానుగానీ.. నా బాధని మనసులోంచి బయటికి దాటించలేకపోతున్నాను. అప్పుడు ఉద్యోగరీత్యా ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నా. పని హడావుడిలో ఉండగా.. ‘అమ్మా.. నానమ్మ ఇంక మనకు లేదురా.. ’అంటూ దుఃఖాన్ని దిగమింగుకుంటూ నాన్న చెప్పిన మాటతో కన్నీటిపర్యంతం అయ్యా. ప్రతిక్షణం మాకోసం తపించిన నానమ్మ లేదనే వార్త జీర్ణించుకోలేకపోయా. తనతో ఉన్న అనుబంధం గుర్తుకు రాగానే మనసులోని దుఃఖం ఒక్కసారిగా కళ్ల అంచులకు చేరింది. చెక్కిళ్లపై పడుతున్న కన్నీళ్లను వేలితో తుడుచుకుంటూ ప్రయాణం మొదలు పెట్టా.
నానమ్మంటే నాకు ప్రాణం. సెలవులొస్తే.. తన దగ్గరికి వెళ్లిపోయేదాన్ని. ఇంట్లోకి అడుగు పెడుతూనే అమాంతం తనని వాటేసుకునేదాన్ని. బోసి నవ్వుతో.. పిల్లల కోడిలా ఆమె నన్ను పొదువుకునేది. వెళ్లినప్పట్నుంచి నాకిష్టమైనవన్నీ చేసి పెట్టేది. రాత్రి తన పక్కనే పడుకోబెట్టుకొని, పేదరాసి పెద్దమ్మ కథల దగ్గర్నుంచి.. ఊరిలో జరిగే ప్రతి సంగతీ కళ్లింతలు చేసుకొని చెబుతుండేది. నేను నోరెళ్లబెట్టి అలా వింటుండేదాన్ని. వెళ్లిన ప్రతిసారీ ‘శ్రావణీ.. మీ నాన్న కష్టాలన్నీ నువ్వే తీర్చాలే. మంచి ఉద్యోగం సంపాదించి గొప్ప స్థాయిలో ఉండాలే’ అనేది. ఒక్కోసారి నాకు అది నసలా అనిపించేది. తిరిగి వెళ్లేటప్పుడు తన ముతక చీర కొంగున ముడేసుకున్న కరెన్సీ నోట్లు తీసి నా చేతిలో పెట్టేది.

నానమ్మ మొండిది. ఎవరి మాటా వినదు. మేం చిన్న టౌనులో ఉంటాం. మా దగ్గరికి రమ్మంటే.. ససేమిరా ఒప్పుకునేది కాదు. ‘నాకేం వయసైందనీ..? ఉక్కు పిండంలా ఉన్నా’ అంటూ ఊరిలోనే ఉంటూ చిన్నాచితకా పనులు చేసుకునేది. కష్టాల్లో ఉన్న నాన్నకి మరింత భారం కాకూడదనే తనలా చేసేది. ముసలావిడకు చాదస్తం, పంతం ఎక్కువ అనుకుంటూ మేమూ పెద్దగా పట్టించుకునేవాళ్లం కాదు.

పదమూడు గంటలు ప్రయాణం చేసి నానమ్మ ఇంటికి చేరుకున్నా. అచేతనంగా ఉన్న తనని చూడగానే అప్పటిదాకా దిగమింగుకున్న దుఃఖమంతా గుండె గోడల్ని చీల్చుకుంటూ తన్నుకొచ్చింది. పొగిలిపొగిలి ఏడ్చేశా. సాయంత్రానికల్లా కార్యక్రమాలు పూర్తయ్యాయి. నానమ్మ ఉంటే ఎంతో సందడిగా ఉండేదా ఇల్లు. తను లేని చోట క్షణం కూడా ఉండలేక వెనక్కి వచ్చేశా. తిరుగు ప్రయాణంలో.. ఇయర్‌ఫోన్‌ కోసం బ్యాగులో వెతుకుతుంటే పట్టుచీర కనిపించింది. ఊరెళ్లినప్పుడు నానమ్మకివ్వాలని నా మొదటి జీతంతో కొన్నాను. కానీ దురదృష్టం.. పని హడావుడిలో పడి ఆ పని చేయలేకపోయా. ఆ చీరను తడిమినప్పుడల్లా.. నానమ్మ ప్రేమగా నా తలను నిమురుతున్నట్టే ఉంటుంది. మిస్‌ యూ నానమ్మా.
శ్రావణి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని