ఇష్టంలేని పనులు చేస్తున్నా

నాకు సినిమాలంటే ప్రాణం. ఇంట్లోవాళ్ల బలవంతంతో బీటెక్‌ పూర్తి చేసి కొన్నాళ్లు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశాను. ఇప్పుడు ఒక దర్శకుడి దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. కానీ అక్కడ పరిస్థితులేం బాగా లేవు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా. మనసు చంపుకొని కొన్ని పనులు చేయాల్సి వస్తోంది. పోటీ విపరీతంగా ఉండటంతో సక్సెస్‌ కాలేననే భయమూ వెంటాడుతోంది. లక్ష్యం వదలకూడదంటే, నాలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే  ఏం చేయాలి?

Updated : 12 Mar 2022 07:27 IST

నాకు సినిమాలంటే ప్రాణం. ఇంట్లోవాళ్ల బలవంతంతో బీటెక్‌ పూర్తి చేసి కొన్నాళ్లు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశాను. ఇప్పుడు ఒక దర్శకుడి దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. కానీ అక్కడ పరిస్థితులేం బాగా లేవు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా. మనసు చంపుకొని కొన్ని పనులు చేయాల్సి వస్తోంది. పోటీ విపరీతంగా ఉండటంతో సక్సెస్‌ కాలేననే భయమూ వెంటాడుతోంది. లక్ష్యం వదలకూడదంటే, నాలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే  ఏం చేయాలి?

- కె.ఈ.ఆర్‌., భీమవరం

మీ వయసెంతో చెప్పలేదు. చాలామందికి సినిమా, క్రికెట్‌ లేదా మరోదానిపై విపరీతమైన ఇష్టం, పిచ్చి ఉంటాయి. అది తప్పేం కాదు. కానీ ఇష్టానికి, లక్ష్యానికి చాలా తేడా ఉంటుంది. లక్ష్యాలు చాలారకాలు. వ్యక్తిగతం, ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబం, ఆర్థికం, సామాజికం.. ఇలా. వీటిలో ఎక్కువమంది కెరియర్‌ మీదే దృష్టి పెడతారు. ఎందుకంటే ఉద్యోగంలో స్థిరపడితేనే మిగిలిన లక్ష్యాలు నెరవేరుతాయి. ఈ కారణంతోనే మిమ్మల్ని ఇంజినీరింగ్‌ చేయమని మీవాళ్లు ఒత్తిడి చేసి ఉంటారు. ఇప్పుడు ఉద్యోగం వదిలి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరి ఇబ్బందులు పడుతున్నాను అంటున్నారు. అక్కడే కాదు.. ఏ వృత్తిలో అయినా ఎదగాలంటే కష్టపడక తప్పదు.

మీ విషయానికొస్తే.. మీ లక్ష్యం ఏంటి? సాధ్యాసాధ్యాలేంటి? దానికోసం ఎన్నేళ్లు కేటాయించగలుగుతారు? ఈ విషయాలపై స్పష్టత ఉండాలి. పెళ్లి, కుటుంబం, బాధ్యతలూ దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ ఆలోచించి ఒక అంచనాకు వచ్చిన తర్వాత స్ట్రెంగ్త్‌- బలాలు, వీక్‌నెస్‌-బలహీనతలు, ఆపర్చునిటీస్‌- అవకాశాలు, థ్రెట్‌- అవరోధాలు (SWOT) అనే సూత్రంతో  విశ్లేషణ చేసుకోండి. మీరు ఎంచుకున్న సినిమా రంగంలో పోటీ ఎక్కువ. అక్కడ కష్టపడితేనే సరిపోదు.. ప్రత్యేకమైన ప్రతిభ, నైపుణ్యాలు ఉండాలి. మీలో ఏవైనా బలహీనతలు ఉంటే సరిదిద్దుకొని వాటినే బలాలుగా మలచుకోవాలి. సినిమా నేపథ్యం లేకుండా వచ్చినవాళ్లు చిత్ర పరిశ్రమలో అవకాశాలు చేజిక్కించుకోవడం సులువేం కాదు. ప్రస్తుతం స్టార్లుగా ఎదిగిన ఎంతోమంది ఇలాంటి ఇబ్బందులు అధిగమించి పైకి వచ్చినవారే. వాళ్లని స్ఫూర్తిగా తీసుకుంటే మీ సంకల్పం దృఢమవుతుంది. విష్‌ యూ ఆల్‌ ది బెస్ట్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని