పెళ్లి చేసుకుందామని.. ముందుకెళ్లాం!

కాలేజీ క్లాస్‌మేట్‌తో నాది రెండేళ్ల ప్రేమ. ఒకరికొకరం ప్రాణంలా ఉండేవాళ్లం. ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా అని అన్నిరకాలుగా దగ్గరయ్యాం. కానీ ఆ మధ్య తనకో అమెరికా సంబంధం వచ్చింది. తల్లిదండ్రులు బలవంతం చేయడంతో సంబంధం ఒప్పుకున్నానంది నా లవర్‌. ప్రేమికుల్లా విడిపోయి

Updated : 20 Aug 2022 07:02 IST

(మనలో మనం)

* కాలేజీ క్లాస్‌మేట్‌తో నాది రెండేళ్ల ప్రేమ. ఒకరికొకరం ప్రాణంలా ఉండేవాళ్లం. ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా అని అన్నిరకాలుగా దగ్గరయ్యాం. కానీ ఆ మధ్య తనకో అమెరికా సంబంధం వచ్చింది. తల్లిదండ్రులు బలవంతం చేయడంతో సంబంధం ఒప్పుకున్నానంది నా లవర్‌. ప్రేమికుల్లా విడిపోయి స్నేహితుల్లా ఉందాం అంటోంది ఇప్పుడు. అది నన్ను మోసం చేయడమే కదా! ఒక్కోసారి మేం సన్నిహితంగా ఉన్న ఫొటోలు అందరికీ చూపించాలన్నంత కోపంగా ఉంది. తను మోసం చేసినంత మాత్రాన నేనూ తన జీవితాన్ని నవ్వులపాలు చేస్తే తనకీ, నాకూ తేడా ఏముంది? అని మరోసారి అనిపిస్తోంది. ఈ సతమతం, మానసిక ఒత్తిడి నుంచి బయపడలేకపోతున్నా. పరిష్కారం చూపండి.             

  - రవి,  ఈ మెయిల్‌

రవీ.. యవ్వనం పాదరసంలాంటిది. ఈ వయసులో ఆకర్షణ, ప్రేమ సహజం. ఈ సమయంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఒకర్ని విడిచి మరొకరు ఉండలేనంత సన్నిహితంగా ఉంటారు. ఏదైనా చేయగలం.. ఎవరినైనా ఎదిరించగలం అనే అతి నమ్మకంలో ఉంటారు. తర్వాత తర్వాత వీళ్లకే జీవితంలో సమాజం, మతాలు, కులాలు, బంధువులు, తల్లిదండ్రులు, డబ్బు, హోదా.. ఇవన్నీ ఎదురు నిలుస్తాయి. వీటన్నింటినీ దాటుకొని ఒకరి కోసం మరొకరు నిలబడేదే నిజమైన ప్రేమ.
ఇక మీ విషయానికొస్తే.. తనని క్షమించి వదిలేయాలనుకునే మీ ఆలోచన సంస్కారవంతంగా ఉంది. ఆ అమ్మాయికి మీపై ఉన్నది వయసు ఆకర్షణ తప్ప, ప్రేమలా కనిపించడం లేదు. మీరు ఆమెతో అన్నిరకాలుగా దగ్గరయ్యానంటున్నారు. మరి ఆ అమ్మాయికి లేని పశ్చాత్తాపం, భయం, బాధ మీకెందుకు? తను ఇంట్లోవాళ్లను కాదనలేక పెళ్లికి ఒప్పుకున్నానంది. ఈ విషయంలో మీరు ఎలాగో తనని కన్విన్స్‌ చేసినా.. మరొక సందర్భంలో మరో కారణం చెప్పి మన పెళ్లి జరగదు అని చెప్పదనే గ్యారెంటీ ఏంటి? ఆమెపై కోపంతో మీతో కలిసి సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటపెట్టి బ్లాక్‌మెయిల్‌ చేస్తే ఏమవుతుంది? తన పరువు పోతుంది. తను మీకు శత్రువులా మారుతుంది. ఏదైన పోలీసు కేసు అయితే ఇద్దరూ ఇబ్బందుల్లో పడతారు. ఇంత జరిగాక ఆ అమ్మాయి మీతో ప్రేమగా ఉండగలుగుతుందా? తను చెప్పేది వాస్తవమై, పరిస్థితుల కారణంగా మిమ్మల్ని వదులుకుంటే ఇంక చేసేదేం లేదు. తనని పెద్దమనసుతో క్షమిస్తే స్నేహమైనా కొనసాగించవచ్చు. అవకాశవాదంతో మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం తనదైతే.. అలాంటివాళ్లు మీ జీవితంలోకి రాకపోవడమే నయం. కాలం ఎలాంటి గాయాలనైనా మాన్పుతుంది. మిమ్మల్ని అర్థం చేసుకునే అమ్మాయిని పెళ్లాడండి. గతం నీలి నీడలు మీ మధ్య కమ్ముకోకుండా ఆనంద మయమైన జీవితాన్ని గడపండి.


- అర్చన నండూరి
కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని