పెళ్లికాకుండా కలిసి ఉండటం తప్పా?

ఇన్‌స్టాలో ఒకబ్బాయి పరిచయమయ్యాడు. కొద్దిరోజుల్లోనే మంచి స్నేహితులమయ్యాం. ఇద్దరం తరచూ కలుస్తుంటాం. సరదాగా సినిమాలకు వెళ్తుంటాం.. డిన్నర్‌ చేస్తుంటాం. ఈమధ్యే తను నాకు ఇద్దరం ఒకే గదిలో కలిసి ఉందాం అనే ప్రపోజల్‌ పెట్టాడు.

Updated : 08 Oct 2022 07:04 IST


ఇన్‌స్టాలో ఒకబ్బాయి పరిచయమయ్యాడు. కొద్దిరోజుల్లోనే మంచి స్నేహితులమయ్యాం. ఇద్దరం తరచూ కలుస్తుంటాం. సరదాగా సినిమాలకు వెళ్తుంటాం.. డిన్నర్‌ చేస్తుంటాం. ఈమధ్యే తను నాకు ఇద్దరం ఒకే గదిలో కలిసి ఉందాం అనే ప్రపోజల్‌ పెట్టాడు. తను ఐటీ ఉద్యోగి, నేను ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేస్తున్నా. తను నాతో ఎప్పుడూ అభ్యంతరకరంగా ప్రవర్తించలేదు. హద్దులు దాటలేదు. పైగా ఇద్దరం ఒకే గదిలో కలిసి ఉంటే నాకు కొన్ని ఖర్చులు తగ్గుతాయి అనిపిస్తోంది. కానీ మాది సంప్రదాయ కుటుంబం. అమ్మానాన్నలకు తెలిస్తే గొడవ చేస్తారని భయంగా ఉంది.        

- ఓ పాఠకురాలు, ఈమెయిల్‌

వాళ్లు గొడవ చేయడం కాదు.. వాళ్ల గౌరవాన్ని కాపాడటం.. వాళ్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడం మీ బాధ్యత. మీరు బాగు పడాలని, కెరియర్‌లో నిలదొక్కుకోవాలని మిమ్మల్ని నగరానికి పంపారు. ఆ విషయం గుర్తుంచుకోవాలి. తను ఎంత మంచివాడైనా.. ఒక పెళ్లికాని అమ్మాయి, అబ్బాయి ఒకే గదిలో కలిసి ఉండటాన్ని ఎవరూ హర్షించరు. తను మీతో అభ్యంతరకరంగా ప్రవర్తించలేదు, మంచివాడని అంటున్నారు. కలిసి ఉండటం మొదలైన కొన్నాళ్ల తర్వాత తన ప్రవర్తనలో మార్పు వస్తే మీరేం చేస్తారు? లైంగికంగా బలవంతం చేసినా అడిగే వాళ్లుండరు. మీరు అతడితో పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నారంటే.. అన్నింటికీ సిద్ధపడే వచ్చారని భావిస్తారు. కొంచెం లోతుగా ఆలోచిస్తే.. మీరు అతడివైపు ఆకర్షితురాలు అవుతున్నారని, అతడి ద్వారా ఆర్థికపరమైన అవసరాలు తీరతాయని భావిస్తున్నారని అనిపిస్తోంది. మీ అవసరాలు తీర్చేవాళ్లు భవిష్యత్తులో తప్పకుండా మీనుంచి ఏదైనా ఆశిస్తారు. నిజంగా మీకు ఒక తోడు కావాలి, ఖర్చులు తగ్గాలి అనుకుంటే.. ఎవరైనా ఒక స్నేహితురాలితో గదిలో కలిసి ఉండొచ్చు. అమ్మాయిల హాస్టళ్లకి కొదవలేదు. ఒకవేళ ఆ అబ్బాయి మంచివాడే అయినా, అతడి మనసులో కల్మషం లేకపోయినా.. కనీసం మీ అమ్మానాన్నల గౌరవం కోసమైనా అతడితో కలిసి ఉండాలనే ఆలోచన విరమించుకోండి. ఏ పరిస్థితుల కారణంగా అలా చేయాల్సి వచ్చిందో వివరించి చెప్పండి. అతడితో స్నేహాన్ని మాత్రం నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని