ఫోన్‌ దాచి మోసం చేస్తోందా?

నా గాళ్‌ఫ్రెండ్‌, నేను సన్నిహితంగా ఉంటాం. కొన్నాళ్లు ఒకే గదిలో కలిసి ఉన్నాం కూడా. గతేడాది పుట్టినరోజుకి తనకో స్మార్ట్‌ఫోన్‌ బహుమతిగా ఇచ్చా. విషయం ఏంటంటే.. అప్పుడప్పుడు నాకు తనవి ఫొటోలు పంపుతుంటుంది. అయితే నేను ఇచ్చిన ఫోన్‌లో నుంచి కాకుండా ఈమధ్య వేరే కంపెనీ మొబైల్‌ఫోన్‌ నుంచి ఫొటోలు వస్తున్నాయి.

Updated : 22 Oct 2022 07:26 IST

నా గాళ్‌ఫ్రెండ్‌, నేను సన్నిహితంగా ఉంటాం. కొన్నాళ్లు ఒకే గదిలో కలిసి ఉన్నాం కూడా. గతేడాది పుట్టినరోజుకి తనకో స్మార్ట్‌ఫోన్‌ బహుమతిగా ఇచ్చా. విషయం ఏంటంటే.. అప్పుడప్పుడు నాకు తనవి ఫొటోలు పంపుతుంటుంది. అయితే నేను ఇచ్చిన ఫోన్‌లో నుంచి కాకుండా ఈమధ్య వేరే కంపెనీ మొబైల్‌ఫోన్‌ నుంచి ఫొటోలు వస్తున్నాయి. వాటి మీద ఉండే వాటర్‌మార్క్‌ల ఆధారంగా ఈ విషయం చెప్పగలుగుతున్నా. ఈ సందేహంతోనే ‘నీ దగ్గర వేరే సెల్‌ఫోన్‌ ఏమైనా ఉందా?’ అని ఓసారి అడిగా. ‘నువ్వు ఇచ్చింది తప్ప మరేదీ లేద’ంది. కొద్దిరోజులయ్యాక మళ్లీ వేరే ఫోన్‌ నుంచి ఫొటోలు వచ్చాయి. తను నన్ను మోసం చేస్తోందా?

- కె.ఎస్‌., హైదరాబాద్‌

దీనికి తేలికైన పరిష్కారం ఏంటంటే.. మీ సందేహాలన్నీ నేరుగా తనముందే ఉంచడం. ఎందుకు నాతో అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని నిలదీయడం. ప్రేమకే కాదు.. ఏ అనుబంధానికైనా నమ్మకమే పునాది. ఒకరిపై ఒకరికి నమ్మకం లేనప్పుడు ఏ బంధమూ ఎక్కువ రోజులు నిలవదు. ఇక మీరు కొన్నాళ్లు తనతో కలిసి సహజీవనం చేశానంటున్నారు. ఒకే గదిలో ఉన్నానన్నారు. పోనీ అప్పుడైనా తన గురించి మీకు పూర్తిగా తెలిసి ఉండాల్సింది. ఒకర్నొకరు పూర్తిగా అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు మీరు వేర్వేరుగా ఎందుకు ఉంటున్నారో కారణం చెప్పలేదు. మీరు అనుమానించడం వల్లే తను దూరంగా ఉంటుందా? ఈ వివరాలన్నింటికీ సమాధానం చెప్పాల్సింది తనే. మీరు సందేహం వెలిబుచ్చినా తను ఫొటోలు అలాగే పంపుతోంది అంటే.. తను అబద్ధమైనా చెబుతుండాలి లేదా మీతో బ్రేకప్‌ అయినా ఫర్వాలేదు అని అనుకుంటూ అయినా ఉండాలి. ఈ రెండూ కాకుండా.. తను వేరొకరి ఫోన్‌తో ఫొటోలు తీసి పంపిందా? ఈ కోణంలోనూ ఆలోచించాలి. తనకి మీమీద ఇష్టం, ప్రేమ తగ్గిపోయింది అని తేలితే.. ఆమెతో అనుబంధాన్ని వదులుకోడమే మంచిది. ప్రేమ లేని చోట బంధం నిలవదు. అయితే తొందరపడి మీరే ఏదో ఊహించుకొని తను మిమ్మల్ని మోసం చేస్తుంది అనే నిర్ణయానికి రాకూడదు. తనతో ఓసారి ప్రశాంతంగా మాట్లాడి చూడండి. ఆమె చర్యల వల్ల ఎంతలా బాధ పడుతున్నారో వివరించండి. మీ సందేహాలు స్పష్టం అయిన తర్వాతే ఆమెతో ప్రేమ కొనసాగించాలా? వద్దా? అనే నిర్ణయానికి రండి.


- డా.అర్చన నండూరి, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని