మరదలితో నిశ్చితార్థం.. ఆమెపై మనసు!

నేనో సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌ని. కొన్నాళ్లు హైదరాబాద్‌లో పని చేసి బెంగళూరుకి పదోన్నతిపై వెళ్లా. వెళ్లే ముందు మరదలితో నిశ్చితార్థం జరిగింది.  అయితే ఇక్కడికొచ్చాక నా జీవనశైలి పూర్తిగా మారిపోయింది.

Updated : 17 Dec 2022 09:02 IST

నేనో సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌ని. కొన్నాళ్లు హైదరాబాద్‌లో పని చేసి బెంగళూరుకి పదోన్నతిపై వెళ్లా. వెళ్లే ముందు మరదలితో నిశ్చితార్థం జరిగింది.  అయితే ఇక్కడికొచ్చాక నా జీవనశైలి పూర్తిగా మారిపోయింది. స్నేహితులు, సరదాలు, టూర్లు, పార్టీలు.. బాగా ఎంజాయ్‌ చేస్తున్నా. ఈమధ్య ఒకమ్మాయి ప్రపోజ్‌ చేసింది కూడా. పెళ్లయ్యాక ఈ జీవితం కోల్పోతానని భయంగా ఉంది. మరదలితో పెళ్లి క్యాన్సిల్‌ చేసుకోవాలని ఉంది. పెద్దవాళ్లని ఎలా ఒప్పించాలి? 

- కేసీ రెడ్డి, నెల్లూరు

కొన్నాళ్లయ్యాక మీకు ఇంకా అందమైన అమ్మాయి ప్రపోజ్‌ చేస్తే ఏం చేస్తారు? మళ్లీ మనసు మార్చుకుంటారా? పెళ్లి రద్దు చేసుకోవాలి అనుకునే ముందు ఒక్కసారైనా ఆ అమ్మాయి గురించి ఆలోచించారా? నిశ్చితార్థం జరిగి పెళ్లి క్యాన్సిల్‌ అయితే తన పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి తల్లిదండ్రుల పరువేం కాను?

అసలు పెళ్లి తర్వాత జీవితం మీరు కోరుకున్నట్టుగా ఉండదని ఎందుకు అనుకుంటున్నారు? మంచి ఉద్యోగం, డబ్బులు ఉండటంతో మీ చుట్టూ అందరూ చేరుతున్నా రు. ఈ పార్టీలు, సంతోషాలు తాత్కాలికం. కొన్నాళ్లు గడిస్తే ఇవీ మీకు బోర్‌ కొట్టవచ్చు లేదా మామూలుగానే అనిపించవచ్చు. కావాలనుకుంటే పెళ్లిని కొన్నాళ్లు వాయిదా వేసుకొని ఒకట్రెండు సంవత్సరాలు మీరు కోరుకున్నట్టే ఉండండి. మీకు విలువ ఇచ్చి కూతురిని కట్టబెట్టాలనుకున్నవాళ్లని ఇలాంటి కారణాలతో వదులుకోకూడదు. అలాగని నచ్చని అమ్మాయితో జీవితాంతం కలిసి ఉండాలని నేను చెప్పను. ఆ అమ్మాయిలో నిజంగానే ఏవైనా లోపాలున్నాయా? ఈమధ్యకాలంలో మీకు తెలిశాయా? ఆమె ప్రవర్తన, చదువు, పద్ధతి... ఇలా ఏదైనా నచ్చకపోతే.. పెద్దవాళ్లతో చర్చించండి. వేరే అమ్మాయి ప్రపోజ్‌ చేసిందని, పెళ్లి చేసుకుంటే సంతోషం ఉండదని మీరే ఏవేవో ఊహిం చుకోవడం మాత్రం సమంజసం కాదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని