వాళ్ల సాన్నిహిత్యం తట్టుకోలేకపోతున్నా!

ఇన్‌స్టాలో ఒకబ్బాయి పరిచయమయ్యాడు. అందంగా ఉంటాడు. కొన్నాళ్లు ఫోన్‌లో మాట్లాడుకున్న తర్వాత బయట కూడా కలుసుకునేవాళ్లం.

Updated : 24 Dec 2022 08:23 IST

మనలో మనం

ఇన్‌స్టాలో ఒకబ్బాయి పరిచయమయ్యాడు. అందంగా ఉంటాడు. కొన్నాళ్లు ఫోన్‌లో మాట్లాడుకున్న తర్వాత బయట కూడా కలుసుకునేవాళ్లం. ఓసారి నా బెస్ట్‌ఫ్రెండ్‌కి తనని పరిచయం చేశా. తర్వాత వాళ్లిద్దరూ నాకు చెప్పకుండా కలిసి తిరుగుతున్నారని తెలిసింది. నేనిది తట్టుకోలేకపోతున్నా. వాళ్లు దూరంగా ఉండాలంటే ఏం చేయాలి?

కేఎల్‌, ఈమెయిల్‌

మీతో సన్నిహితంగా ఉండే తను వేరొకరితోనూ ఎందుకు క్లోజ్‌గా ఉండకూడదు? అలా చేయడం వాళ్లిద్దరి వ్యక్తిగతం. కాదనడానికి మీరెవరు? ఒకవేళ మీరు ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నారా? అదే గనక నిజమైతే మీది కేవలం ఆకర్షణే తప్ప నిజమైన ప్రేమ కాదు. ఆన్‌లైన్‌లో పరిచయం, చాటింగ్‌, ఫోన్లు మాట్లాడుకోవడం.. వీటినే ప్రేమగా పొరబడుతున్నారు ఈ కాలం అమ్మాయిలు, అబ్బాయిలు చాలామంది. ఎక్కువగా ఎమోషనల్‌ అయిపోయి అనవసర సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే అతడితో మీది ప్రేమే కాదు. ఆ అమ్మాయి విషయానికొస్తే.. తను బెస్ట్‌ ఫ్రెండ్‌ అన్నారు. అందులోనూ వాస్తవం లేదనిపిస్తోంది. ఒకవేళ అదే గనక నిజమైతే తను మీతో అన్ని విషయాలూ పంచుకునేది. మీరు బాధ పడుతున్నారని తెలిస్తే.. మిమ్మల్ని ఓదార్చడానికి ప్రయత్నించేది. ఒకవేళ వాళ్లిద్దరి మధ్య ప్రేమలాంటిది ఏదైనా ఉంటే నిర్భయంగా మీతో పంచుకునేది.

ఈ వయసులో ప్రేమ, సామాజిక మాధ్యమాలకు ఆకర్షితులవడం సహజమే. కానీ వాటి ఒరవడిలో కొట్టుకుపోవద్దు. జీవితంలో ఇంతకన్నా ముఖ్యమైనవి కెరియర్‌, తల్లిదండ్రులు, పెళ్లి అనే లక్ష్యాలు. మీరు కష్టపడి ఎదిగి మంచి స్థాయికి చేరుకుంటే చాలామంది మీ స్నేహం కోరి వస్తారు. ఎంతోమంది అబ్బాయిలు మిమ్మల్ని ఇష్టపడతారు. ముందు వీటిపై దృష్టి పెట్టండి. ఈ ప్రపంచం విశాలమైంది. మంచి మనుషులకు కొదవ లేదు. సంకుచితమైన వ్యక్తుల కోసం ఎక్కువగా ఆలోచించి మీ సమయాన్ని వృథా చేసుకోవద్దు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని