స్టైల్‌గా కనిపిస్తేనే..ముందుకెళ్తానా?

నేను పల్లెటూరిలో పుట్టి పెరిగా. కానీ సృజనాత్మకంగా ఆలోచించడం, కొత్త కొత్త డిజైన్స్‌లో దుస్తులు కుట్టడం అంటే నాకు చిన్నప్పట్నుంచీ ఇష్టం. ‘నీలో మంచి టాలెంట్‌ ఉంది

Updated : 21 Jan 2023 02:39 IST

నేను పల్లెటూరిలో పుట్టి పెరిగా. కానీ సృజనాత్మకంగా ఆలోచించడం, కొత్త కొత్త డిజైన్స్‌లో దుస్తులు కుట్టడం అంటే నాకు చిన్నప్పట్నుంచీ ఇష్టం. ‘నీలో మంచి టాలెంట్‌ ఉంది. ఫ్యాషన్‌ డిజైనర్‌గా ప్రయత్నించు.. రాణిస్తావ్‌’ అని ఒక స్నేహితురాలు చెప్పడంతో, నగరానికి వచ్చాను. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులో చేరాను. కానీ ఇక్కడ వాతావరణం అంతా కొత్తగా, వింతగా ఉంది. ఫ్యాషన్‌ డిజైనర్‌ స్టైలిష్‌గా ఉండాలంటున్నారు. నా కల్చర్‌ మారాలంటున్నారు. అలా చేయకుండా నా లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేనా?                            
బీఎస్‌ఎస్‌., సిరిసిల్ల

* రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలంటారు. దానర్థం.. మనం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకుంటూ వెళ్లాలి. పల్లెటూరిలో పుట్టినవాళ్లు సహజంగానే నిండైన దుస్తులు ధరిస్తారు. సంప్రదాయంగా ఉంటారు. ఇందులో తప్పు పట్టడానికేం లేదు. ఆత్మన్యూనతగా భావించే అవసరమే లేదు. కానీ మీరు మంచి ఫ్యాషన్‌ డిజైనర్‌గా రాణించాలంటే తప్పకుండా మిమ్మల్ని మీరు కొంచెం మార్చుకోవాల్సిందే. ఫ్యాషన్‌ డిజైనర్‌కి సృజనాత్మకంగా ఆలోచించడం.. దుస్తుల్ని బాగా డిజైన్‌ చేయడంతోపాటు.. మార్కెటింగ్‌ మెలకువలూ తెలిసి ఉండాలి. మీకు అభ్యంతరకరం కానంతవరకు, ఎబ్బెట్టుగా అనిపించనంత వరకు కొంచెం ఫ్యాషన్‌గా ఉన్నా తప్పేం కాదు. మీ డిజైన్స్‌ కావాలనుకునేవాళ్లు మిమ్మల్నీ గమనిస్తారనే విషయం మర్చిపోవద్దు. సంప్రదాయంగా ఉంటూనే స్టైలిష్‌గా కనిపించేలా ప్రయత్నించండి. మంచి వస్త్రధారణతో సహజంగానే ఒక మనిషిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందంటారు. ఈ రంగంలో ఉన్నప్పుడు ట్రెండీగా ఉండటం కూడా ముఖ్యమే.

వీటితోపాటు ఈ రంగంలో మీరు దూసుకెళ్లాలంటే బహిర్ముఖులుగా ఉండాలి. కొత్త ట్రెండ్స్‌ని గమనించాలి. అందరితో కలుపుగోలుగా ఉండాలి. నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. భాషపై పట్టు సాధించాలి. ఇలా చేయడం మన సంప్రదాయాన్ని ఉల్లంఘించడం కాదు. హద్దులు దాటడం అసలే కాదు. ఈ లక్షణాలన్నీ మీరు మంచి ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలనే లక్ష్యాన్ని మరింత దగ్గర చేస్తాయనే విషయం మర్చిపోవద్దు. ఎవరేం అనుకుంటున్నారో కాదు.. మీ లక్ష్యాన్ని చేరడానికి మీకేం కావాలో తెలుసుకుని ముందుకెళ్తే తప్పకుండా విజయం సాధిస్తారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని