పెళ్లైతే వాళ్లే ఒప్పుకుంటారంటోంది!

ఒకమ్మాయితో నాది నాలుగేళ్ల ప్రేమ. పెద్దల్ని ఒప్పించాకే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. ఈమధ్యే నాకు మంచి ఉద్యోగం వచ్చింది. ‘మన పెళ్లికి మావాళ్లు ఒప్పుకోరు.

Updated : 18 Mar 2023 06:59 IST

ఒకమ్మాయితో నాది నాలుగేళ్ల ప్రేమ. పెద్దల్ని ఒప్పించాకే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. ఈమధ్యే నాకు మంచి ఉద్యోగం వచ్చింది. ‘మన పెళ్లికి మావాళ్లు ఒప్పుకోరు. మనం గుడిలో లేదా రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుందాం’ అంటోంది నా లవర్‌. నేనెంత చెప్పినా వినడం లేదు. పెద్దల్ని ఎదిరించి వాళ్లని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. పెళ్లయ్యాక వాళ్లే ఒప్పుకుంటారనేది తన పంతం. తనని కన్విన్స్‌ చేసేదెలా?

కేఎస్‌ఎస్‌, ఈమెయిల్‌

ప్రేమించుకునేటప్పుడు అంతా బాగానే ఉన్నా.. పెళ్లి వరకు వచ్చేసరికి ప్రతి జంటకీ ఇలాంటి ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంటుంది. పెద్దల్ని ఒప్పించాలనుకోవడం, వారు ససేమిరా అనడం ఒక సందిగ్ధ పరిస్ధితి. ఇక మీ విషయానికి వస్తే పేరెంట్స్‌ని ఒప్పించే చేసుకోవాలన్న మీ నిర్ణయం అభినందనీయం. ముందు పెద్దల్ని ఒప్పించే చేసుకుందాం అన్న అమ్మాయి.. ఇప్పుడిలా అకస్మాత్తుగా ఎందుకు మాట మార్చిందో కనుక్కోండి. ఒప్పుకోరు అని తను చెప్పడానికి కారణాలేంటో అడగండి. అసలు వాళ్లని ఒప్పించే దిశగా మీ ఇద్దరూ ఏమైనా ప్రయత్నించారా? ఇది ముఖ్యమైన విషయం.

ఆ అమ్మాయి ‘మావాళ్లు ఒప్పుకోరు’ అని అంత గట్టిగా చెబుతోంది అంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. కన్నవాళ్ల మనస్తత్వం తనకి తెలిసే ఉంటుంది. కులమతాలు, ఆస్తీఅంతస్తుల సమస్య ఏదైనా ఉంటే.. వాటిని ఎలా పరిష్కరించగలరో తనకి విడమరిచి చెప్పండి. వాళ్లని ఒప్పించగలననే నమ్మకం కల్పించండి. ఒకవేళ ఆ అమ్మాయి కేవలం భయంతోనే తొందర పడి నిర్ణయం తీసుకుంటోంది అనిపిస్తే, ప్రశాంతంగా తనని కూర్చోబెట్టి భరోసా ఇవ్వండి. సాధారణంగా ఒక ఆడపిల్ల ఎవరినైనా అబ్బాయిని గాఢంగా ప్రేమిస్తున్నప్పుడు తన భవిష్యత్తు ఏమవుతుందో అనే సంశయం, ఆమె ప్రేమని తల్లిదండ్రులు ఒప్పుకోకుండా వేరేవాళ్లకి ఇచ్చి కట్టబెడతారేమోననే భయం ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆ అమ్మాయికి మీరు ఎప్పుడూ తనతోనే ఉంటానన్న భరోసా ఇవ్వండి. ఆల్‌ ది బెస్ట్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని