ఫోన్‌ ఎంగేజ్‌ వస్తే తట్టుకోలేదు

నా గాళ్‌ఫ్రెండ్‌ది విచిత్రమైన మనస్తత్వం. తనతో చాట్‌ చేస్తున్నప్పుడు పక్కనున్న స్నేహితురాళ్లకి ఫోన్‌ ఇచ్చి మాట కలపమంటుంది.

Updated : 20 May 2023 03:01 IST

 

నా గాళ్‌ఫ్రెండ్‌ది విచిత్రమైన మనస్తత్వం. తనతో చాట్‌ చేస్తున్నప్పుడు పక్కనున్న స్నేహితురాళ్లకి ఫోన్‌ ఇచ్చి మాట కలపమంటుంది. ఐదు నిమిషాలు గడవగానే..‘జస్ట్‌ విష్‌ చేయమంటే గంటలకొద్దీ చాట్‌ చేస్తావా?’ అని నాపై రెచ్చిపోతుంది. ‘ఇంకోసారి ఎవరితో మాట్లాడను, చాట్‌ చేయను’ అంటే నా మాటంటే విలువ లేదని ఏడుస్తుంది. ఇంకా నా ఫోన్‌ అయిదు నిమిషాలు ఎంగేజ్‌ వచ్చినా.. తట్టుకోలేదు. వివరాలన్నీ చెప్పాల్సిందే. తన టార్చర్‌ తట్టుకోలేకపోతున్నా.            

జశ్వంత్‌, వరంగల్‌

* మీరు ఎన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారో చెప్పలేదు. మీ వివరాలు బట్టి చూస్తే.. మీ గాళ్‌ఫ్రెండ్‌లో మానసిక పరిపక్వత తక్కువగా ఉందని అర్థమవుతోంది. మీరు తనకి మాత్రమే సొంతం అనే భావనలో ఆమె ఉంది. వేరేవాళ్లతో అయిదు నిమిషాలు చాట్‌ చేసినా తట్టుకోవడం లేదంటే ఆ అమ్మాయిలో అభద్రతాభావం కనిపిస్తోంది. తనతో తప్ప ఎవరితోనూ మాట్లాడొద్దు అనుకుంటుందంటే.. తనకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకుంటోందని తెలుస్తోంది. తను చెప్పినట్టు వినాలని ఏడవడం మొండితనాన్ని సూచిస్తోంది. వేరేవాళ్లతో చాట్‌ చేయమని చెప్పి.. దానికీ అభ్యంతరం చెబుతుందంటే.. అది ఒక అపనమ్మకానికి సంకేతం. ఇవన్నీ చూస్తుంటే మీ అనుబంధంలో గందరగోళమే తప్ప నమ్మకం, ఒకర్నొకరు అర్థం చేసుకోవడం ఎక్కడా కనిపించడం లేదు. ప్రేమ అంటేనే ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకం. ఒకరి కోసం మరొకరు అన్నట్టుగా ఉండటం. సినిమాల్లో చూపించినట్టు బాయ్‌ఫ్రెండ్‌ అంటే అమ్మాయి చుట్టూ తిరిగేవాడు, మెప్పించేలా కవితలు రాసేవాడు.. హీరోయిజం ప్రదర్శించేవాడు కాదు. అలా ఆలోచిస్తే ఏ రిలేషన్‌షిప్‌ నిలబడదు. తనకి ఇవన్నీ అర్థమయ్యేలా చెప్పండి. నువ్వు అలా చేస్తే సంతోషంగా ఉండలేమని చెప్పండి. అర్థం చేసుకొని తన తీరు మార్చుకుంటే సరి. లేదంటే ఈ అనుబంధం నుంచి ఎంత త్వరగా బయటికొస్తే అంత మంచిది. జీవిత భాగస్వామి ఎంపికలో అందం మాత్రమే కాదు.. వ్యక్తిత్వమూ ముఖ్యమే. ఆ ఒక్క విషయంలో రాజీ పడితే.. జీవితాంతం రాజీ పడుతూ, మానసిక ఒత్తిడికి గురవుతూ బతకాల్సి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని