Manalo Manam: నా ప్రేమకి స్నేహితుడే.. శత్రువైతే..?

నా ఫ్రెండ్‌తో నాది పద్దెనిమిదేళ్ల స్నేహం. మేం ఒకే బడి, ఒకటే కళాశాల. ఫీజుల దగ్గర్నుంచి, ఇంటి అవసరాల దాకా చాలాసార్లు సాయం చేశాడు.

Updated : 22 Jul 2023 09:40 IST

మనలో మనం

నా ఫ్రెండ్‌తో నాది పద్దెనిమిదేళ్ల స్నేహం. మేం ఒకే బడి, ఒకటే కళాశాల. ఫీజుల దగ్గర్నుంచి, ఇంటి అవసరాల దాకా చాలాసార్లు సాయం చేశాడు. అయితే నేను ప్రేమించిన అమ్మాయితో ఈమధ్య తను చనువుగా ఉంటున్నాడు. ఆమెని తనవైపు తిప్పుకుంటున్నాడు. ఈ విషయంలో నాకు వాడిపై చాలా కోపంగా ఉంది. తన కోసం నా ప్రేమను వదులుకోవాలా? మోసం చేసిన తననేనా?

ఎస్‌.ఆర్‌., ఈమెయిల్‌

చెబుతుంటే మీది గొప్ప స్నేహంలా అనిపిస్తోంది. మీ స్నేహితుడు మీకు చేసిన సాయం అభినందనీయం.. ఆదర్శనీయం కూడా. కానీ ప్రేమ విషయానికి వచ్చేసరికి తనలా ప్రవర్తించడం సరికాదు. మీ పట్ల అంత ప్రేమ, శ్రద్ధ 18 సంవత్సరాలు చూపించిన వ్యక్తి సడెన్‌గా ఇలా ప్రవర్తించడం సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయమే. ప్రేమ విషయానికొస్తే.. అతని స్నేహం కోసం ప్రేమని వదలాలనే ఆలోచనే వద్దు. మీరు ఒకర్నొకరు ప్రేమించు కుంటున్నప్పుడు, ఆ ప్రేమ నిజమైనప్పుడు మీ మధ్య ఎవరు వచ్చినా.. ఆ అను బంధానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. అసలు మీ ప్రేయసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే మీ ఫ్రెండ్‌ తనవైపు తిప్పుకోవడం ఎలా సాధ్యం అవుతుంది? ఆమెది నిజమైన ప్రేమా? కేవలం ఆకర్షణేనా? ముందు అడగండి. బహుశా ఆమె వైపు నుంచి కూడా స్పందన ఉంటేనే మీ ఫ్రెండ్‌ ముందుకెళ్తున్నాడేమో! అదీకాకుండా ఆ ఇద్దరి మధ్యా ఉంది కేవలం స్నేహమే అయి ఉండొచ్చు. మీరే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారేమో! ఇవన్నీ తేలాలంటే.. మీ ఫ్రెండ్‌ని కూర్చోబెట్టి మాట్లాడటమే పరిష్కారం. ‘మా మధ్యకి ఎందుకు వస్తున్నావు? ఏం కోరుకుంటున్నావు?’ అని నిర్భయంగా అడగండి. రిలేషన్‌షిప్‌లో ఉన్న అమ్మాయి వెనకాల పడటం ఎంతవరకు కరెక్ట్‌ అని నిలదీయండి. మీది చాలా ఏళ్ల స్నేహం కాబట్టి తప్పకుండా ఆ చొరవ ఉంటుంది. మీరు చెప్పిన తర్వాత కూడా తను మారకపోతే.. మానసిక నిపుణులతో కౌన్సెలింగ్‌ ఇప్పించండి. మీ సందేహాన్ని ఆ అమ్మాయితోనూ ప్రస్తావించండి. అనుమానాలు పటాపంచలైతే స్నేహం, ప్రేమ రెండూ కొనసాగించవచ్చు లేదా ఎవరికి దూరంగా ఉండాలో తేలిపోతుంది.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని