నాతో ప్రేమ..వాడితో షికారా?

దాదాపు మూడేళ్లు ప్రయత్నిస్తే.. నేనెంతో ఇష్టపడే అమ్మాయి పరిచయమైంది. మరో నాలుగైదు నెలలు నిరీక్షిస్తేగానీ ఆమె ఫోన్‌ నెంబర్‌ తెలుసు కోలేకపోయా.

Updated : 19 Aug 2023 07:10 IST

దాదాపు మూడేళ్లు ప్రయత్నిస్తే.. నేనెంతో ఇష్టపడే అమ్మాయి పరిచయమైంది. మరో నాలుగైదు నెలలు నిరీక్షిస్తేగానీ ఆమె ఫోన్‌ నెంబర్‌ తెలుసు కోలేకపోయా. అలా మొదలైన మా పరి చయం.. కొన్నాళ్లకు ప్రేమగా మారింది. మేం ఎప్పుడో ఓసారి కలిసి బయటికెళ్లేవాళ్లం. ఎలాగూ నా సొంతం అవుతుంది కదా అని, ఆమెను కనీసం తాకే ప్రయత్నం చేసేవాడిని కాదు. అయితే ఈమధ్యే నాకో విషయం తెలిసింది. నేనే పరిచయం చేసిన నా ఫ్రెండ్‌తో కలిసి తను బైక్‌పై పక్క ఊరు తిరునాళ్లకు వెళ్లి వచ్చిందట. అడిగితే.. ‘ఔను వెళ్లాను.. తప్పేంటి? ఫ్రెండ్స్‌ అన్నాక ఆ మాత్రం క్లోజ్‌గా ఉండరా?’ అంటోంది. దీన్ని తట్టుకోలేకపోతున్నాను. తన పద్ధతి మార్చుకొమ్మని ఎలా చెప్పను?

 అప్పల్నాయుడు, ఎస్‌.కోట

మీరు ఆ అమ్మాయి పరిచయం కోసం అంతకాలం ఎదురు చూశారు అంటే ఆమెను ఎంతగా ఇష్టపడ్డారో అర్థమవుతోంది. ఒకర్నొకరు ఇష్టపడుతున్నా ఆమెను తాకే ప్రయత్నం చేయలేదంటే.. తనకి ఎంత గౌరవం ఇస్తున్నారో తెలుస్తోంది. అదే సమయంలో ఆ అమ్మాయి వేరేవాళ్ల బైక్‌ ఎక్కినందుకు ఎందుకు అంతలా బాధ పడుతున్నారో ఆలోచించండి. తను మీకు దూరం అవుతుందని అభద్రతకు లోనవుతున్నారా? లేకపోతే ఆ అమ్మాయిని అనుమానిస్తున్నారా? మీకు మీరే ప్రశ్నించుకోండి. అదీగాక వాళ్లిద్దరి మధ్య కేవలం స్నేహమో, అన్నాచెల్లెళ్ల అనుబంధమో ఉండొచ్చు కదా!
మీ ఇద్దరి వయసు, నేపథ్యం గురించి రాయలేదు. మనం పెరిగే పరిస్థితులకు అనుగుణంగా మన మనస్తత్వాలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఒక పల్లెటూరులో, సంప్రదాయ వాతావరణంలో పెరిగిన వాళ్లకు.. తను ఇష్టపడ్డ అమ్మాయి వేరొకరి బైక్‌ ఎక్కడం సహజంగానే నచ్చదు. అదే నగర, కార్పొరేట్‌ వాతావరణంలో పెరిగినవాళ్లకు ఇదొక పెద్ద విషయంలా అనిపించదు. ఏదేమైనా.. మిమ్మల్ని ప్రేమిస్తూ, వేరే కుర్రాడి బైక్‌ మీద వెళ్లడమే తప్పు అంటే.. మీరు ఆలోచించే విధానం మార్చుకోవాలి. అలా కాకుండా ఆ అమ్మాయి హద్దు మీరి ఏమైనా ప్రవర్తిస్తే కచ్చితంగా నిలదీయాల్సిందే. దీనికన్నా ముందు.. తను అలా ప్రవర్తించడం వల్ల మీరు ఎంతగా బాధ పడ్డారో విడమరచి చెప్పండి. ఇలాంటివి మీ ప్రేమకు ఇబ్బందికరంగా మారతాయని అర్థమయ్యేలా వివరించండి. అది చేయకుండా అభద్రతాభావంతో, పొజెసెసివ్‌నెస్‌తో తన స్వేచ్ఛను ఆపాలని ప్రయత్నిస్తే.. ఆ అమ్మాయి మీకు మరింత దూరం అవుతుంది. ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను.

డా.అర్చన నండూరి, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని