CPI Narayana: ఆత్మస్తుతి, పరనింద పనికిరాదు: సీపీఐ నారాయణ

ఏపీలో కోనసీమ జిల్లా వివాదం చినికి చినికి గాలివానలా మారి.. చివరకు మంత్రి ఇంటినే తగులబెట్టే పరిస్థితి ఏర్పడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

Published : 25 May 2022 11:23 IST

అమరావతి: ఏపీలో కోనసీమ జిల్లా వివాదం చినికి చినికి గాలివానలా మారి.. చివరకు మంత్రి ఇంటినే తగులబెట్టే పరిస్థితి ఏర్పడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇది అక్కడున్న కుల ఘర్షణగా చూడ్డానికి వీల్లేదని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

‘‘ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ఈ ఘటన ప్రతిబింబిస్తోంది. ఎక్కడ వీలు ఉంటే అక్కడ ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని ప్రతిబింబించే పద్ధతిలో ఉద్యమాలు వస్తాయి. ఎప్పుడైతే ప్రజాస్వామ్యం లేకుండా, ప్రతిపక్షాలకు సంబంధించిన భావాలు పంచుకోలేకపోతారో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. జిల్లా ప్రకటించే సమయంలోనే అంబేడ్కర్‌ పేరు పెట్టి ఉంటే ఎవరూ అడిగి ఉండేవారు కాదు. జిల్లాలు ఏర్పాటు చేసి పేర్లు చెప్పేశారు. అనేక జిల్లాల్లో పేర్ల విషయంలో వివాదాలొచ్చినా గట్టిగా నిలబడి.. ఇప్పుడెందుకు రాజీ పడ్డారు? ఇందులో ఓట్లు, రాజకీయ లబ్ధి తప్ప ఇంకేమీ కనిపించడం లేదు.

సంకుచిత వైఖరి ఉంటే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. సీఎం జగన్‌ ఊగిసలాట, స్వార్థ వైఖరే దీనికి కారణం. ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం ఇతర పార్టీలపై అభాండాలు వేస్తే లాభం లేదు. ఆత్మస్తుతి, పరనింద పనికిరాదు. ఈ విషయంలో వాస్తవాలు ఆలోచించాలి. ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిపాలన సాగిస్తే ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవు. కోనసీమ వ్యవహారంపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం వైకాపా ప్రభుత్వానికి ఉంది’’ అని నారాయణ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు