AP News: ఒక్క చుక్కనూ వదులుకోం

కృష్ణా నదీ జలాలను కాపాడుకునే విషయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏ స్థాయిలో మాట్లాడటానికైనా సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం గుంటూరులో...

Updated : 05 Jul 2021 07:54 IST

కృష్ణా జలాలు రెండు దేశాల సమస్య కాదు
సామరస్యంగా పరిష్కరించుకోవాలి
రెచ్చగొడితే రెచ్చిపోం
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు

ఈనాడు, అమరావతి: కృష్ణా నదీ జలాలను కాపాడుకునే విషయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏ స్థాయిలో మాట్లాడటానికైనా సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ఇది రెండు దేశాల మధ్య సమస్య కాదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్య. సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అంశం. ఈ విషయంలో ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయే మనస్తత్వం ప్రభుత్వానిది కాదు. అలా అని ఒక్క చుక్క నీటినీ వదులుకోవడానికీ ప్రభుత్వం సిద్ధంగా లేదు’ అని పేర్కొన్నారు. నదీ జలాలపై ముఖ్యమంత్రికి స్పష్టమైన వైఖరి ఉందన్నారు.

కేసీఆర్‌ తీరు దారుణం: నారాయణస్వామి

తిరుమల, న్యూస్‌టుడే: ప్రస్తుతం నెలకొన్న జల వివాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం తిరుమలలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మాట్లాడుతూ.. ఒకే తల్లి బిడ్డలమైన ఆంధ్ర, తెలంగాణ ప్రజలు నీటి కోసం తగవులాడుకోవడం బాధాకరంగా ఉందని పేర్కొన్నారు. సీఎం జగన్‌కు కేసీఆర్‌ అంటే ఎంతో అభిమానమని, రెండు రాష్ట్రాల సీఎంల మధ్య సఖ్యతను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని జల వివాదంపై చర్చించుకోవాలని కోరారు. ఇది ఇండియా, పాకిస్థాన్‌ వివాదం కాదన్నారు. ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీరు ఉంటే తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవడానికి అభ్యంతరం లేదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని