విపత్తు నిధులూ మళ్లించారు!

విపత్తు బాధితులకు తక్షణ సహాయానికి ఖర్చుచేయాల్సిన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధుల్ని.. రాష్ట్ర ప్రభుత్వం పీడీ ఖాతాకు మళ్లించిందని కాగ్‌ ఆక్షేపించింది. విపత్తు నిర్వహణ నిధి

Updated : 27 Nov 2021 05:28 IST

పెట్టుబడి రాయితీ, వ్యవసాయ పరికరాలకు ఖర్చు

వ్యవసాయ కమిషనర్‌ పీడీ ఖాతాకు రూ.1,100 కోట్లు

నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వాన్ని ఆక్షేపించిన కాగ్‌

ఈనాడు, అమరావతి: విపత్తు బాధితులకు తక్షణ సహాయానికి ఖర్చుచేయాల్సిన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధుల్ని.. రాష్ట్ర ప్రభుత్వం పీడీ ఖాతాకు మళ్లించిందని కాగ్‌ ఆక్షేపించింది. విపత్తు నిర్వహణ నిధి అకౌంటింగ్‌ నియమాలకు ఇది విరుద్ధమని ఆక్షేపించింది. 2020 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర పరిస్థితులపై నివేదికలో విపత్తుల ప్రతిస్పందన నిధికి సంబంధించి కాగ్‌ పలు అంశాలను ప్రస్తావించింది.

ఏడాది చివరకు ఏమీ మిగల్లేదు

2019-20లో కేంద్రం ఇచ్చిన రూ.324.15 కోట్లతో పాటు రాష్ట్రం తన వాటా కింద రూ.209.85 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తం రూ.534 కోట్లను ప్రకృతి వైపరీత్యాల ఉపశమనం (కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఉచిత ఉపశమనం, దెబ్బతిన్న రోడ్లు, వంతెనల పునరుద్ధరణ, మరమ్మతులు, వ్యవసాయ సాధకాల కొనుగోలుకు రైతులకు సాయం) కోసం ఖర్చుచేసింది. దీంతో ఏడాది చివరికి ఏమీ మిగల్లేదు. నిబంధనల ప్రకారం విపత్తు సంసిద్ధత, పునరుద్ధరణ, పునర్నిర్మాణం, ఉపశమనం కోసం విపత్తు స్పందన నిధి నుంచి ఖర్చు చేయకూడదు. సాధారణ బడ్జెట్‌ పద్దులు/రాష్ట్ర ప్రణాళిక నుంచి భరించాలి. రిజర్వుబ్యాంకు ఓవర్‌డ్రాప్టు (ఓడీ) నియమావళి ప్రకారం.. ఓడీకి వర్తించే వడ్డీరేటు ప్రకారం ఆరు నెలలకోసారి విపత్తు ప్రతిస్పందన నిధులకు రాష్ట్రప్రభుత్వం వడ్డీ చెల్లించాలి. ఆ నిధిలోకి వచ్చే జమలు, వాటి పెట్టుబడులపై వచ్చే ఆదాయాన్ని కేంద్రప్రభుత్వ సెక్యూరిటీలు, వేలం వేసిన ఖజానా బిల్లులు, వాణిజ్యబ్యాంకుల్లో వడ్డీ వచ్చే డిపాజిట్లలోంచి ఖర్చుపెట్టాలి.

వ్యవసాయ కమిషనర్‌ పీడీ ఖాతాకు రూ.1,100 కోట్లు

2019-20 సంవత్సరంలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ రూ.534 కోట్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ రూ.570.91 కోట్లు కలిపి మొత్తం రూ.1,104.91 కోట్లు కేంద్రం నుంచి వచ్చాయి. ఇందులో రూ.1,100 కోట్లను ఖరీఫ్‌ పెట్టుబడి రాయితీల కోసం రైతులకు చెల్లించేందుకు వ్యవసాయ కమిషనర్‌, సంచాలకుల డిపాజిట్‌ ఖాతాకు బదిలీ చేసి.. తర్వాత 2020 మార్చి 31న ఆయన పేరుతో ఉన్న పీడీ ఖాతాకు మళ్లించారు. విపత్తు ఉపశమనం, పునరావాసం కింద వ్యయాన్ని చూపించి.. చట్టవిరుద్ధంగా పీడీ ఖాతాకు బదిలీ చేసిందని కాగ్‌ స్పష్టం చేసింది. దేశంలో తలెత్తిన మహమ్మారి, సంబంధిత ఖర్చులకు ఈ నిధులను పక్కన పెట్టినట్లు రాష్ట్రప్రభుత్వం సమాధానమిచ్చింది. విపత్తు బాధితుల తక్షణ సహాయానికి అయ్యే ఖర్చు భరించడానికే ఈ నిధి నుంచి సర్దుబాటు చేయాలని నియామాలు చెబుతున్నా.. అందుకు విరుద్ధంగా పీడీ ఖాతాకు మళ్లించిందని అభ్యంతరం తెలియజేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని