రూ. వెయ్యి కోట్ల సాయం అందించండి

ఏపీలో ఇటీవలి వానలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని భర్తీచేయడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణం రూ.వెయ్యి కోట్ల సాయం అందించాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. మంగళవారం రాజ్యసభ జీరో

Published : 01 Dec 2021 04:12 IST

కేంద్రానికి విజయసాయిరెడ్డి వినతి

ఏపీలో ఇటీవలి వానలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని భర్తీచేయడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణం రూ.వెయ్యి కోట్ల సాయం అందించాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. ‘నవంబర్‌ 8న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీలో మెరుపు వరదలకు దారితీసింది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉత్పాతం తలెత్తింది. అనూహ్యంగా వచ్చిన వానలు, వరదల్లో రిజర్వాయర్ల కట్టలు తెగాయి. రహదారులు, వంతెనలు, రైల్వేట్రాక్‌లు దెబ్బతిన్నాయి. విద్యుత్తు వ్యవస్థ అస్తవ్యస్థమైంది. ఇళ్లు కూలిపోయాయి. ఇప్పటివరకు 44 మంది చనిపోయారు. 16 మంది గల్లంతయ్యారు. 70 వేల మంది నిరాశ్రయులయ్యారు. పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారు. పంటలు, మౌలిక వసతులకు రూ.6,054 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. తాత్కాలికంగా రూ.వెయ్యి కోట్ల సాయం అందించాల’ని కోరారు.


ముందస్తు హెచ్చరికలు లేకే: సీఎం రమేష్‌

వరదల వల్ల తలెత్తే ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు హెచ్చరికలు చేయకపోవడం వల్లే ఏపీలో నష్టం తీవ్రమైనట్లు భాజపా ఎంపీ సీఎం రమేష్‌ పేర్కొన్నారు. రాజ్యసభలో మాట్లాడుతూ ‘భారీ వర్షాలు కురుస్తాయని రెండు మూడు రోజుల ముందు నుంచే వాతావరణ శాఖ హెచ్చరించినా.. ప్రజలను అప్రమత్తం చేయలేదు. ఎగువన రెండు డ్యాంల నుంచి వచ్చిన నీళ్లతో వేల పశువులు కొట్టుకుపోయాయి. ఆరోజు ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్‌చేసి పరిస్థితులను తెలుసుకున్నారు. అప్పటిదాకా ఏ అధికారీ పల్లె ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీచేయలేదు. దానివల్ల ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లింది’ అని అన్నారు. ఈ వాదనతో ఎంపీ సుజనాచౌదరి ఏకీభవించారు.


మంగళగిరి ఎయిమ్స్‌లో 40% బోధనా సిబ్బంది ఖాళీ

ఈనాడు, దిల్లీ: మంగళగిరి ఎయిమ్స్‌లో 40% బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈమేరకు మంగళవారం రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ సమాధానం ఇచ్చారు. దీనికి 183 బోధనా సిబ్బంది పోస్టులు మంజూరు చేయగా ప్రస్తుతం 110 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఈ సంస్థ నిర్మాణానికి రూ.1,618 కోట్లు మంజూరవగా, ఇప్పటివరకు రూ.1,024.5 కోట్లు విడుదలయ్యాయి. 2019 మార్చి నుంచి ఇక్కడ 23 అంశాల్లో ఓపీ సేవలు, వంద ఇన్‌పేషెంట్‌ పడకలు, రెండు ఆపరేషన్‌ థియేటర్లు ప్రారంభమయ్యాయి. ఈ సంస్థలో 2018-19 నుంచే ఎంబీబీఎస్‌ కోర్సు మొదలైంది. నరసరావుపేటలో రూరల్‌ హెల్త్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, మోడల్‌ రూరల్‌ హెల్త్‌ రీసెర్చ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని ఈ సంస్థకు వినతులు అందినట్లు కేంద్ర మంత్రి వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని