తాగునీటిదే పంచాయితీ

పోలవరం ప్రాజెక్టుకు నిధుల విషయంలో కేంద్రం పాత పల్లవే పాడుతోంది. ఈ ప్రాజెక్టుకు తాగునీటి విభాగం కింద నిధులివ్వాలన్న ఆంధ్రప్రదేశ్‌ డిమాండ్‌పై సానుకూలంగా స్పందించడం లేదు. 2017-18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు రూ

Published : 07 Dec 2021 03:14 IST

ఈ విభాగం కింద 7,214 కోట్ల కోత కేంద్ర తాజా ప్రకటనతో స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు నిధుల విషయంలో కేంద్రం పాత పల్లవే పాడుతోంది. ఈ ప్రాజెక్టుకు తాగునీటి విభాగం కింద నిధులివ్వాలన్న ఆంధ్రప్రదేశ్‌ డిమాండ్‌పై సానుకూలంగా స్పందించడం లేదు. 2017-18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు రూ.47,725.74 కోట్లకు పెట్టుబడి అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ కోరుతోంది. అయితే సాగునీటి విభాగం కింద రూ.35,950.16 కోట్లకు కేంద్రం పెట్టుబడి అనుమతి ఇవ్వాల్సి ఉందని కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడూ సోమవారం రాజ్యసభలో ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సిఫార్సు అనంతరం ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. దీంతో తాగునీటి విభాగం కింద రూ.7,214.67 కోట్లు, విద్యుత్కేంద్రం ఖర్చుల కింద రూ.4,560.91 కోట్లు మినహాయించి మంత్రి ఈ గణాంకాలు వెల్లడించారని అర్థమవుతోంది. విద్యుత్కేంద్రం నిధులు రాష్ట్రమే భరించాలని ఎప్పుడో నిర్ణయించింది. తాగునీటి విభాగం కింద పెద్ద మొత్తంలో నిధులు కోత పెడుతుండటంతోనే పేచీ ఏర్పడింది.

కేంద్రమే ఇవ్వాలి

జాతీయ ప్రాజెక్టుల మార్గదర్శకాల ప్రకారం ప్రాజెక్టు సాగు, తాగునీటి విభాగానికి అయ్యే ఖర్చు మొత్తం కేంద్రమే ఇవ్వాలని రాష్ట్ర ఉన్నతాధికారులు అనేకసార్లు డిమాండ్‌ చేశారు. పోలవరం అథారిటీ వేదికపైనా చెప్పారు. నిరుడు నవంబరులో జరిగిన అథారిటీ సమావేశంలో పాల్గొన్న అంచనాల సవరణ కమిటీ ఛైర్మన్‌ జగ్‌మోహన్‌ గుప్తా .. 2017లో కేంద్ర మంత్రిమండలి సాగునీటి విభాగానికి మాత్రమే నిధులు ఇస్తామని నిర్ణయించిందన్నారు. ఆ ప్రకారమే చేస్తున్నామని చెప్పారు. కేంద్ర జలసంఘం నిపుణులు కూడా ఈ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జాతీయ ప్రాజెక్టుల్లో తాగు, సాగునీటి విభాగాలు విడివిడిగా ఉండవని.. ఈ రెండు విభాగాలకు కేంద్రమే నిధులు ఇవ్వాలని చెబుతున్నారు. ఈ మార్గదర్శకాలకు భిన్నంగా కేంద్రం ఎందుకు నిర్ణయం తీసుకుందోనన్న చర్చ సాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని