Updated : 07/12/2021 11:39 IST

కబుర్లతో కాలయాపన చేస్తోంది

పీఆర్‌సీపై ముఖ్యమంత్రే జోక్యం చేసుకోవాలి

తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమబాట ఎంచుకున్నాం

ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు, ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పీఆర్‌సీ, ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి తలపెట్టిన తొలి దశ ఉద్యమం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. 2022 జనవరి 6 వరకూ కొనసాగబోయే ఈ ఉద్యమంలో భాగంగా నల్లబ్యాడ్జీలతో నిరసనలు, భోజన విరామ సమయంలో ఆందోళనలు, తాలూకా, డివిజన్‌, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించనున్నారు. విశాఖపట్నం, తిరుపతి, ఏలూరు, ఒంగోలుల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నారు. తొలిదశ ఆందోళనలకు దిగిరాకపోతే రెండోదశ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఈ రెండు ఐకాసల్లో కలిపి మొత్తం 210 సంఘాలకు సంబంధించి 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని... వీరంతా మంగళవారం నుంచి ఉద్యమబాట పట్టనున్నారని వివరించారు. మంగళవారం నుంచి తొలిదశ ఉద్యమం ప్రారంభం కానున్న నేపథ్యంలో బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇద్దరు వేర్వేరుగా ‘ఈనాడు’’తో మాట్లాడారు.

ఈనాడు, అమరావతి: పీఆర్‌సీ అమలు సహా, ప్రభుత్వ ఉద్యోగుల ఇతర డిమాండ్లపై ఇక అధికారులతో చర్చలు జరిపి ప్రయోజనం లేదని, ముఖ్యమంత్రే స్వయంగా జోక్యం చేసుకోవాలని ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు, ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం మూడు నెలల నుంచి కబుర్లతో కాలయాపన చేస్తోందే తప్ప, తాము ఆశించిన రీతిలో స్పందించడం లేదన్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమబాట ఎంచుకున్నామని చెప్పారు. ఈ నెలాఖరుకి సమస్యలను పరిష్కరించకపోతే రెండోదశ ఉద్యమ కార్యాచరణకు దిగుతామని ఆయన హెచ్చరించారు.

స్పష్టత ఇవ్వడం లేదు

అధికారులతో చర్చలు జరుపుతూనే ఉన్నాం. ప్రభుత్వం పీఆర్‌సీ ఇవ్వాలనుకుంటోందని, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలనుకుంటోందని వారు చెబుతున్నారే తప్ప... ఎప్పటిలోగా అన్న స్పష్టత ఇవ్వడం లేదు. చర్చలు మొదలు పెట్టాక... ఇప్పటికే రెండు నెలలు గడిచిపోయాయి. పీఆర్‌సీ వెంటనే ప్రకటిస్తామని, సీపీఎస్‌ రద్దుకి కమిటీ వేశామని, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలపై కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప అమలు చేయడం లేదు. వాటిని వెంటనే అమలు చేయాలన్నది మా ప్రధాన డిమాండ్‌.

ఏడాదైనా నివేదిక ఇవ్వలేదు

పీఆర్‌సీ కమిటీ నివేదిక ఇచ్చి ఏడాదైంది. ఇంతవరకు దానిని మా చేతికి ఇవ్వలేదు. ఇది ఎంత మాత్రం సమ్మతం కాదు. ఇప్పటివరకూ వచ్చిన పీఆర్‌సీ నివేదికలన్నీ మంత్రివర్గంలో ఆమోదించో, ముఖ్యమంత్రి ఆమోదించో వెంటనే మా చేతికి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది.

2018 జులై 1 నుంచి పీఆర్‌సీ అమలు చేయాలి

2018 జులై 1 నుంచి పీఆర్‌సీ అమలు చేయాలి. ఇప్పటివరకు ఏడు డీఏలు బకాయిలు ఉన్నాయి. జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, సరెండర్‌ లీవులు, ఈఎల్‌, మెడికల్‌ రీయంబర్స్‌మెంట్‌, మట్టిఖర్చులు వంటి బకాయిలు రూ.1,600 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మేం దాచుకున్న డబ్బు కూడా మాకివ్వడం లేదు. బకాయిల్ని వెంటనే చెల్లించాలి. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలి. సీపీఎస్‌ రద్దు చేయాలి. పొరుగుసేవల ఉద్యోగుల వేతనాలు పెంచాలి. వారికీ పీఆర్‌సీ ప్రకటించాలి. నాలుగో తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలి. కొవిడ్‌తో చనిపోయిన ఉద్యోగులు కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాలు చేపట్టాలి.గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబెషన్‌ను ఖరారు చేయాలి.

ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు

జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో మా డిమాండ్లపై అధికారుల నుంచి ఎలాంటి స్పందనా ఉండటం లేదు. ఎన్నిసార్లు కూర్చున్నా ఫలితం రావడం లేదు. అధికారుల శక్తి సరిపోవడం లేదు. పీఆర్‌సీ ప్రకటించడంలో, డిమాండ్ల పరిష్కారంలో ఫలానా ఇబ్బంది ఉందని వారు చెప్పడం లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో చర్చ జరిగితే సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటిని ప్రభుత్వం గుర్తించాలి. మా డిమాండ్లల్లో ఆర్థికేతరమైనవీ కొన్ని ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖలో పెనుభారంగా మారిన యాప్‌లు, పదోన్నతులు వంటి అంశాలను పరిష్కరించడం లేదు. కొన్ని చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి కంటింజెంట్‌ బడ్జెట్‌లు ఉన్నాయి. వాటిని డబ్బులు లేకుండానే పరిష్కరించవచ్చు. ఎవరూ పట్టించుకోవడం లేదు.


నివేదికే ఇవ్వలేదు.. పీఆర్‌సీ పరిష్కరిస్తారా?

ప్రభుత్వంపై ఉద్యోగుల్లో నమ్మకం సన్నగిల్లింది

డీఏలు చెల్లించకుండా ఎగనామం పెట్టేస్తారా?

‘ఈనాడు’తో ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఈనాడు, అమరావతి: వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) నివేదికే చేతికి ఇవ్వనివారు.... అందులోని అంశాల్ని పరిష్కరిస్తారనే నమ్మకం ఉద్యోగుల్లో సన్నగిల్లిందని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. ‘2019 జులై నుంచి ఇప్పటివరకూ ఇవ్వాల్సిన ఏడు డీఏలు, 2019 జనవరి డీఏకు సంబంధించిన బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తుందా? ఎగనామం పెట్టేస్తుందా? అనే భయాందోళన ఉద్యోగుల్లో నెలకొంది. జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ తదితర వాటికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఉద్యోగులు దాచుకున్న డబ్బుల్లో రూ.1,600 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. అసలు అవి ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? అనే అభద్రతా భావం వచ్చేసింది. ప్రభుత్వంవద్ద దాచుకున్న డబ్బులు అత్యవసరంగా తీసుకోకపోతే అవీ మిగలవన్న ఆందోళనతో అవసరం ఉన్నా లేకపోయినా వాటి ఉపసంహరణ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు...’ అని ఆయన పేర్కొన్నారు.  

ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి

‘ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కారం కాలేదు. ఏ సమస్యపైనా ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల నుంచి పరిష్కారానికి ఎలాంటి హామీ లభించలేదు. ఎవరికి విన్నవించుకోవాలో తెలియని పరిస్థితి. 8 నెలలుగా సీఎస్‌, ఆర్థిక శాఖాధికారులు, సీఎంవో అధికారులు, ముఖ్యమంత్రి సలహాదారులు అందర్నీ కలిశాం. ఒక్కరూ మా సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఇక తప్పనిసరై ఉద్యమ కార్యాచరణకు దిగాం. మొదటిదశకు సంబంధించి మేము అధికారులకు నోటీసులిచ్చిన తర్వాత మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. మాతో చర్చించలేదు. అక్టోబరు నెలాఖరుకంతా పీఆర్‌సీ ప్రకటిస్తామని, నవంబరు నెలాఖరుకు మిగతా ఆర్థికేతర సమస్యలన్నీ పరిష్కరిస్తామని అక్టోబరు 13న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఇప్పటివరకూ ఒక్కటీ పరిష్కారం కాలేదు.

ప్రభుత్వమే మమ్మల్ని ఉద్యమంలోకి నెట్టింది

న్యాయపరంగా మాకు రావాల్సినవి తప్ప మేము ఏ ఒక్కటీ అదనంగా అడగట్లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఉద్యమంలోకి నెట్టింది. సమస్యల పరిష్కారం కోసం వారికి కావాల్సినంత సమయం ఇచ్చాం. అయినా ఫలితం లేదు. మేము చేపడుతున్న ఉద్యమంవల్ల ప్రజలకు అసౌకర్యం వాటిల్లితే ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాలి. అధికారులతో మేము అనేక మార్లు చర్చించాం. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడితే కానీ తాము నిర్ణయం తీసుకోలేమని వారు సమావేశాల్లో చెబుతున్నారు. ముఖ్యమంత్రితో చర్చిద్దామంటే అంతా చూద్దాం.. చేద్దాం అంటున్నారే తప్ప ఎవరూ భేటీ ఏర్పాటు చేయట్లేదు.

కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు

* 11వ పీఆర్‌సీ నివేదిక ప్రభుత్వానికి చేరి ఏడాది దాటినా కనీసం వారు అది తెరిచి చూడలేదు. ఆ నివేదికను మాకు ఇవ్వటానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు.

* అధికారం చేపట్టిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామని ప్రతిపక్ష నేత హోదాలో సీఎం ప్రకటించారు? ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేవు.

* కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి తొలుత మంత్రులు కమిటీ.. ఆ తర్వాత అధికారుల కమిటీ, ఆ తర్వాత నిపుణుల కమిటీ వేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు. వారిలో కొందరు పదవీ విరమణ చేసే వయసు వచ్చేసింది. అయినా పరిష్కారం కావట్లేదు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని