పీఆర్‌సీపై మున్ముందుకే!

పదకొండో వేతన సవరణ సంఘం సిఫారసుల అమల్లో తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం

Published : 22 Jan 2022 04:54 IST

ఉద్యోగుల ఉద్యమాన్ని తోసిరాజని కేబినెట్‌ ఆమోదం

గ్రామీణ ప్రాంతాల్లో రెండు వాయిదాల్లో ఓటీఎస్‌

అంగన్వాడీలకు అమూల్‌ పాలు

రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు

ఈనాడు, అమరావతి: పదకొండో వేతన సవరణ సంఘం సిఫారసుల అమల్లో తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం తన వైఖరికే కట్టుబడి ఉంది. ఫిట్‌మెంట్‌ను 23 శాతమే ఖరారు చేయడం, ఇంటి అద్దెభత్యం తగ్గించడం, సీసీఏ తొలగించడం వంటి నిర్ణయాలపై ఉద్యోగవర్గం ఉద్యమిస్తున్నా, పీఆర్‌సీపై ప్రభుత్వ నిర్ణయాలకే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పదకొండో పీఆర్‌సీ ప్రతిపాదనలు, దానిపై సీఎస్‌ ఆధ్వర్యంలోని కమిటీ సిఫారసులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలను శుక్రవారం సచివాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి ఆమోదించింది. సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద అంగన్వాడీలకు అందించే బాలామృతం, పాలు, ఫోర్టిఫైడ్‌ ఆహారాన్ని అమూల్‌ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వీటిని ఏపీ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ద్వారా సేకరిస్తారు. కేబినెట్‌ నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య విలేకరుల సమావేశంలో వివరించారు. కీలక నిర్ణయాలివీ..

* అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం అందించేందుకు ఉద్దేశించిన ఈబీసీ నేస్తం పథకానికి ఆమోదం తెలిపారు. 45-60 ఏళ్ల వయసు గల 3,92,674 మంది మహిళలకు వర్తించే ఈ పథకాన్ని జనవరి 25న ప్రారంభిస్తారు. ప్రభుత్వం రూ.589.01 కోట్లు వెచ్చించనుంది.
* ఓటీఎస్‌ లబ్ధిదారులకు, టిడ్కో పథకం ద్వారా ఇచ్చే ఫ్లాట్‌లకు, విశాఖలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ సంస్థకు  స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజుల నుంచి మినహాయింపునిచ్చారు. ఓటీఎస్‌ కింద గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు ఉగాదికి, దీపావళికి రెండు వాయిదాల్లో డబ్బు చెల్లించేలా వెసులుబాటు కల్పించారు.
* ఎంఐజీ వర్గాలకు ఉద్దేశించిన స్మార్ట్‌ టౌన్‌షిప్‌ల్లో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం, విశ్రాంత ఉద్యోగులకు 5 శాతం స్థలాల రిజర్వు నిర్ణయాన్ని ఆమోదించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 20% రిబేటుకు స్థలాలు ఇవ్వనున్నారు.
* రూ.7,880 కోట్లతో 16 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి, రూ.3820 కోట్లతో పాత వైద్య కళాశాలలు, అనుబంధ ఆస్పత్రులు పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు అనుమతులు.
* ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.
* సామాజిక పింఛను మొత్తాన్ని నెలకు 2,250 నుంచి రూ.2,500కు పెంపునకు ఆమోదం.
* తితిదే పాలకవర్గంలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి వీలు కల్పిస్తూ దేవాదాయ చట్టానికి చేసిన సవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర.
* తిరుపతిలో బ్యాడ్మింటన్‌ అకాడెమీకి క్రీడాకారుడు శ్రీకాంత్‌కు ఐదెకరాలు కేటాయింపు.
* నెల్లూరు జిల్లా కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ నిర్వహణ బాధ్యతను 25 ఏళ్లపాటు ప్రైవేటు సంస్థకు అప్పగించనున్నారు.
* కడప, కర్నూలు విమానాశ్రయాల నుంచి విజయవాడ, చెన్నై తదితర ప్రాంతాలకు విమానాలు నడిపేందుకు ఇండిగోతో ఒప్పందం. కడప-విజయవాడ, కడప-చెన్నై, కర్నూలు-విజయవాడ మధ్య వారానికి నాలుగు సర్వీసులు. మార్చి 27 నుంచి సర్వీసులు ప్రారంభం.
* రైతుల ధాన్యం కొనుగోలు బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు రూ.5వేల కోట్ల రుణ సేకరణకు అనుమతి.
* కొవిడ్‌ మరణాలను అరికట్టేందుకు వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకునేందుకు అనుమతి. విధి నిర్వహణలో ఉంటూ కొవిడ్‌తో చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి జూన్‌ 30లోగా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వనున్నారు.
* మీట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో 7, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో 13 ఉద్యోగాలు, వైద్య విద్యాశాఖలో 8 అదనపు డైరెక్టర్‌ పోస్టులు, ఆయుష్‌ విభాగంలో నేచురోపతి, యోగా డిస్పెన్సరీల్లో ఒక్కోదాంట్లో ముగ్గురు చొప్పున 78 పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది.
* విజయవాడ నగరంలో భాగంగా ఉన్న తాడిగడప పంచాయతీని ప్రత్యేక మున్సిపాలిటీగా చేసినందున అక్కడి 59 పోస్టులను మున్సిపాలిటీకి బదలాయించారు. కర్నూలు జిల్లా డోన్‌లో బాలికల బీసీ గురుకుల పాఠశాల, జూనియర్‌ కాలేజీ, బేతంచర్లలో బాలుర గురుకుల పాఠశాలల్లో 58 పోస్టులు మంజూరుచేశారు.
* అనకాపల్లిలోనిప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి 50 ఎకరాలు ఉచితంగా కేటాయింపు.
* ఏపీఐఐసీ నోడల్‌ ఏజెన్సీగా ఆటోనగర్‌లలోని భూములను బహుళ అవసరాలకు వినియోగించేందుకు ఉద్దేశించిన గ్రోత్‌పాలసీకి అంగీకారం.
* విశాఖ జిల్లా ఎండాడలో రాజీవ్‌ గృహకల్ప ప్రాజెక్టులో నిరుపయోగంగా ఉన్న భూముల్ని హెచ్‌ఐజీ, ఎంఐజీ కాలనీలకు వాడుకునేందుకు వెసులుబాటు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని