ఉద్యమం.. ఇక ఉద్ధృతం

ఉద్యోగులు సమ్మెకు సమాయత్తమయ్యారు. పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన కార్యాచరణ అమలుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 24న సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత 25 నుంచి ఉద్యమాన్ని

Published : 24 Jan 2022 03:36 IST

ఉద్యోగుల సమ్మెకు అన్ని వర్గాల నుంచి మద్దతు

ర్యాలీలు, ధర్నాలు.. కార్యాచరణ అమలుకు ప్రణాళిక

రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు

ఈనాడు, అమరావతి: ఉద్యోగులు సమ్మెకు సమాయత్తమయ్యారు. పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన కార్యాచరణ అమలుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 24న సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత 25 నుంచి ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని ఉద్యోగులు నిర్ణయించారు. జిల్లా కేంద్రాలతోపాటు డివిజన్‌ కేంద్రాల్లోనూ నిరసనలు, ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించారు. పీఆర్సీ ఉత్తర్వుల రద్దు, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్‌ రద్దు చేయాలనే డిమాండ్లతో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యోగులు రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సంఘాల నాయకులు హాజరయ్యారు. సీఐటీయూ, ఏఐటీయూసీ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అశుతోష్‌ మిశ్ర నివేదికను బహిర్గతం చేయాలని నాయకులు డిమాండు చేశారు. వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేస్తూ ఉద్యోగులపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

సమ్మెకు అనూహ్య మద్దతు

ఫిబ్రవరి ఆరో తేదీ అర్ధరాత్రి నుంచి చేయనున్న ఉద్యోగుల సమ్మెకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సంఘాలతోపాటు పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలూ మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ సైతం సమ్మెలో పాల్గొననుంది. విజయవాడలో లారీ యాజమానుల సంఘం మద్దతు తెలిపింది. రాష్ట్రస్థాయి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వరకు ఉద్యోగులందరూ ఉద్యమ కార్యాచరణలో పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించారు. గ్రంథాలయ ఉద్యోగుల సంఘం సమ్మెకు వెళ్లనున్నట్లు ప్రకటించింది. జిల్లా కేంద్రాలతోపాటు డివిజన్‌ కేంద్రాల్లోనూ ఆందోళనలు, ర్యాలీలు, రిలే దీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. 25న జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ర్యాలీలకు పెద్ద ఎత్తున ఉద్యోగులు హాజరయ్యేలా ఏర్పాట్లపైనా ఉద్యోగులు చర్చించారు. దీన్ని అన్ని సంఘాలూ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. 27 నుంచి 30 వరకు ర్యాలీలు, రిలే నిరాహార దీక్షల ఏర్పాట్లపై కార్యాచరణ రూపొందించారు.

వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సమ్మెబాట

సాధారణ ఉద్యోగులతో పాటు తామూ సమ్మెకు వెళ్తామని ఏపీ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఏపీ హంస) అధ్యక్షుడు అరవపాల్‌ తెలిపారు. ఈ పోరాటంలో వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది పాల్గొంటారని.. దీంతో కరోనా, ఇతర వైద్యసేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. రెగ్యులర్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులూ పోరాటంలో పాల్గొంటారన్నారు. 

నల్ల బ్యాడ్జీలతో గ్రామ సచివాలయాల్లో విధులు

పీఆర్సీ సాధన సమితి పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి అనుబంధంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తూ భోజన విరామ సమయంలో సంఘీభావం తెలపాలన్నారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్రకమిటీ తీర్మానం చేసినట్లు వెల్లడించారు.


పోరాటానికి విశ్రాంతి లేదు

ఈనాడు, విజయనగరం: ఉద్యోగ సంఘాలు విజయనగరంలో ఏర్పాటుచేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి 91 ఏళ్ల వృద్ధుడు, విశ్రాంత ఉద్యోగి సోమయాజుల వెంకట సుబ్బారావు హాజరయ్యారు. మాట్లాడే అవకాశం ఇవ్వాలని అడిగి మరీ ప్రసంగించారు. తనకు 91 ఏళ్లు కాదని.. 19 ఏళ్లంటూ అందరిలో ఉత్సాహం నింపారు. తాను ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశానని, ఏనాడూ ఇలాంటి పరిస్థితులు ఎదురు కాలేదన్నారు. ఉద్యోగుల పోరాటంలో న్యాయం ఉందన్నారు. ధర్మం మనవైపే ఉందని.. కచ్చితంగా గెలుస్తామని పేర్కొన్నారు. గాంధీజీ చెప్పినట్లు ‘డూ ఆర్‌ డై’ అంటూ ఆయన చేసిన ప్రసంగ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని