Updated : 07/12/2021 13:33 IST

PRC: భగ్గుమన్న ఉద్యోగులు

పీఆర్‌సీ నివేదిక ఇవ్వలేదంటూ జేఎస్‌సీ సమావేశాన్ని బహిష్కరించిన 9 సంఘాలు
ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండు
స్పందించకపోతే కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి

సచివాలయంలో జరిగిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చి నినాదాలు చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పీఆర్‌సీ నివేదిక ఇవ్వకపోవడంపై పలు ఉద్యోగసంఘాలు భగ్గుమన్నాయి. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ (జేఎస్‌సీ) భేటీకి కొనసాగింపుగా నిర్వహించిన సమావేశాన్ని మెజార్టీ ఉద్యోగసంఘాలు బహిష్కరించాయి. ఏపీ ఎన్జీవో, రెవెన్యూ సేవల సంఘం, ఉపాధ్యాయ సంఘాల నేతలు సమావేశం మొదలైన కాసేపటికే బయటికొచ్చి నిరసన తెలిపారు. సీఎం చెబితే తప్ప నివేదిక ఇవ్వలేమన్నట్లు అధికారులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం సమాధానం చెప్పకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వ వైఖరి నశించాలంటూ.. సచివాలయంలోని 4వ బ్లాకు ఎదుట నినాదాలు చేశారు. అక్టోబరు 29న నిర్వహించిన జేఎస్‌సీకి కొనసాగింపుగా ప్రభుత్వం శుక్రవారం 13 సంఘాలతో సమావేశమైంది. ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్‌ఎస్‌ రావత్‌, శశిభూషణ్‌కుమార్‌ నేతృత్వం వహించారు. సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవగా.. గంటకే కొన్ని సంఘాలు బయటికొచ్చేశాయి. ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తదితర సంఘాల నేతలతో అధికారులు సమావేశం కొనసాగించారు. ఈ సందర్భంగా నేతలు విలేకర్లతో మాట్లాడారు.

సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో చర్చిస్తున్న ఉన్నతాధికారులు

ఎందుకీ దోబూచులాట..?
‘పీఆర్‌సీ విషయంలో ప్రభుత్వం ఎందుకు దోబూచులాడుతోంది..? ఇది ఉద్యోగ సంఘాలను అవమానించడమే. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే కార్యాచరణ ప్రకటిస్తాం. నివేదిక ఇస్తారనే వచ్చాం. అధికారులు వాళ్ల చేతుల్లో లేదంటున్నారు. 13 సంఘాల్లో 9 సమావేశాన్ని బహిష్కరించాయి. అక్టోబరు నెలాఖరులోగా పీఆర్‌సీ ప్రకటిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో ప్రకటించారు. పీఆర్‌సీ సంగతి దేవుడెరుగు.. ముందు నివేదిక ఇవ్వాలి. రహస్యంగా ఉంచితేనే అనుమానం కలుగుతోంది. ప్రతి ఉద్యోగికి రూ.కోటి వేతనం ఇవ్వాలని పీఆర్‌సీ సిఫారసుల్లో ఉందా.. ఏంటి?’   

 - బండి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు


జీతం ఇవ్వడమే గొప్ప అంటున్నారు

‘గత సమావేశంలో పీఆర్‌సీ నివేదిక అడిగితే ఫిట్‌మెంట్‌ సిఫారసు పత్రాన్ని ఎందుకు బయటపెట్టారు? ఉద్యోగులకు పీఎఫ్‌ కింద రూ.1000 కోట్లు, ఏపీజీఎల్‌ఐ కింద రూ.300 కోట్లు, వైద్యబిల్లులు రూ.21 కోట్లు, రిటైర్డు ఉద్యోగుల లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ రూ.40 కోట్లు బకాయిలు చెల్లించాలి. ఇవన్నీఎప్పుడు ఇస్తారంటే సమాధానం లేదు. ఈ నెల 1న జీతాలు, పింఛను ఇవ్వడమే గొప్ప అంటున్నారు. సమస్యలపై అధికారులకే స్పష్టత లేదు. పీఆర్‌సీ నివేదికతో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. 13 లక్షల మంది ఉద్యోగులు, పింఛనుదారులు ఎదురుచూస్తున్నారు’

- బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ రెవెన్యూ సేవల సంఘం అధ్యక్షుడు


సీఎం నిర్ణయం తీసుకోవాలి
‘పీఆర్‌సీపై ప్రభుత్వానికి సాగదీసే ఉద్దేశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. నివేదిక ఎందుకు బయటపెట్టడం లేదో అర్థం కావట్లేదు. దీనిపై సీఎం రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. జీపీఎఫ్‌ ఖాతాల నుంచి నగదు ఉపసంహరణపై ప్రస్తావిస్తే విచారణ జరిపిస్తామని అధికారులు చెప్పారు. పది రోజుల్లోగా విచారణ జరిపించకపోతే.. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. సీఎఫ్‌ఎంఎస్‌ సీఈవో, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిపై తొలి ఫిర్యాదు నేనే చేస్తా’

- కేఆర్‌ సూర్యనారాయణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు


మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ పునరుద్ధరణ..
‘త్వరలో నిర్వహించే సమావేశంలోగా పీఆర్‌సీ నివేదిక ఇవ్వాలని కోరాం. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ను పునరుద్ధరించేందుకు అధికారులు అంగీకరించారు. వచ్చే ఏడాది మార్చి 30లోగా బకాయిలు ఎప్పటికప్పుడు చెల్లించేలా షెడ్యూలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు’

-వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు


నగదు ఉపసంహరణపై విచారణ
ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతా నుంచి నగదు ఉపసంహరణపై విచారణ చేయిస్తామని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ తెలిపారు.కరవుభత్యం బకాయిల్ని చెల్లించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. మూడు నెలలుగా ప్రభుత్వ రాబడి మెరుగైందని, వివిధ బకాయిల్ని వచ్చే ఏడాది మార్చిలోగా చెల్లిస్తామన్నారు.

 

 

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని