Kodali Nani: ఆయన జీవితకాలంలో.. జగన్‌ను మాజీని చేయలేరు

పవన్‌కల్యాణ్‌ తన జీవిత కాలంలో జగన్‌ను మాజీ ముఖ్యమంత్రిని చేయగలిగితే తాను రాజకీయాలు వదిలేస్తానని మంత్రి కొడాలి నాని సవాల్‌ విసిరారు. పవన్‌కల్యాణ్‌కు, జగన్‌కు ఏ రకంగానూ పోలిక లేదని, నక్కకు, నాకలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు.

Updated : 01 Oct 2021 10:16 IST

అలా చేస్తే రాజకీయాలు వదిలేస్తా
మంత్రి కొడాలి నాని

ఈనాడు, అమరావతి: పవన్‌కల్యాణ్‌ తన జీవిత కాలంలో జగన్‌ను మాజీ ముఖ్యమంత్రిని చేయగలిగితే తాను రాజకీయాలు వదిలేస్తానని మంత్రి కొడాలి నాని సవాల్‌ విసిరారు. పవన్‌కల్యాణ్‌కు, జగన్‌కు ఏ రకంగానూ పోలిక లేదని, నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. సొంతగా పార్టీ స్థాపించి, పోటీచేసిన రెండు స్థానాల్లోనూ గెలవని నాయకుడు దేశంలో మరెక్కడా లేరని, అలాంటి రికార్డు సాధించిన పవన్‌ చూసి తామెందుకు భయపడాలి అని నాని ప్రశ్నించారు. వెలగపూడి సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపా నాయకులకు భయం అంటే ఏమిటో చూపిస్తానని పవన్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘మేం పవన్‌కు ఎందుకు భయపడాలి. ఆయన ప్రసంగాలా.. మేం వినం. పోనీ జానీ లాంటి ఫ్లాప్‌ సినిమాలు తీసి చూపించి భయపెడతాడా.. అంటే అవీ చూడం. 2024లోనూ ఆయన గెలుస్తారో లేదో తెలియదు. కొన్ని ఎంపీటీసీ స్థానాలు, రెండు జడ్పీటీసీలు గెలిచి ఏదో సాధించినట్లు హడావుడి చేస్తున్నారు. జగన్‌ 2014, 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. మొన్న 151 స్థానాలు సాధించారు. ఈసారి పవన్‌.. కాంగ్రెస్‌, భాజపా, తెదేపా, ఇంకెవరితో కలిసినా వైకాపాయే గెలుస్తుంద’ని నాని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని