Andhra News: అప్పులు ఎలా తీర్చాలో సీఎంకు తెలుసు: మంత్రి ముత్తంశెట్టి

కొవిడ్‌ సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలూ అప్పులు చేశాయని, ఏపీ కంటే ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలూ ఉన్నాయని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.

Updated : 01 Feb 2022 08:46 IST

ఈనాడు, అమరావతి: కొవిడ్‌ సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలూ అప్పులు చేశాయని, ఏపీ కంటే ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలూ ఉన్నాయని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. పర్యాటక, క్రీడ, సాంస్కృతిక శాఖలపై సమీక్ష అనంతరం సచివాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో సీఎం జగన్‌కు తెలుసని, ఆయన 30 ఏళ్లపాటు అధికారంలో ఉంటారని మంత్రి వ్యాఖ్యానించారు. జిల్లాల విభజనపై కొందరు రకరకాలుగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
ఏటా రూ.200 కోట్ల ఆదాయానికి ప్రణాళిక: పర్యాటక రంగం నుంచి ఏటా రూ.200 కోట్ల ఆదాయం వచ్చేలా పెద్దఎత్తున అభివృద్ధి, విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ‘ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో పెట్టుబడుదారుల సమావేశం నిర్వహిస్తాం. పర్యాటకశాఖ నుంచి స్థలాలను, ఆస్తులను లీజుకు తీసుకున్న ప్రైవేట్‌ సంస్థల నుంచి రావాల్సిన రూ.31.08 కోట్ల బకాయిల వసూళ్లకు తాఖీదులు జారీ చేయాలని అధికారులను ఆదేశించాం. పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన 18 రెస్టారెంట్ల నిర్వహణకు 50 టెండర్లు వచ్చాయి. త్వరలో వీటిని ఖరారు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కోసం ఇతర ప్రభుత్వ శాఖలతో కలిసి కొత్తగా 8 క్రీడా పాఠశాలలు ప్రారంభిస్తాం. ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సహకారంతో పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలో బాలుర, పొలసానపల్లిలో బాలికల క్రీడా పాఠశాలలు ప్రారంభించాం’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని