మహానాడు కాదది... తెదేపాకు వల్లకాడు

‘తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నది మహానాడు కాదని.... అది తెదేపాకు దహన సంస్కారాలు చేసే వల్లకాడు...’ అని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ‘సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర’లో భాగంగా విశాఖలోని....

Published : 28 May 2022 07:11 IST

స్పీకర్‌ తమ్మినేని సీతారాం

ఈనాడు, విశాఖపట్నం: ‘తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నది మహానాడు కాదని.... అది తెదేపాకు దహన సంస్కారాలు చేసే వల్లకాడు...’ అని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ‘సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర’లో భాగంగా విశాఖలోని పాతగాజువాక కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తమ్మినేని మాట్లాడారు. ‘చంద్రబాబు ఎప్పుడైనా సామాజిక న్యాయం కోసం ప్రయత్నించారా?  వెనకబడిన వర్గాలకు గొంతుపెగలని పరిస్థితుల్లో ఉంటే నేనున్నానంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెన్నుతట్టి ముందుకు నడిపించారు. పొరపాటున గానీ...ఏమరుపాటున గానీ మరో ఆలోచన చేస్తే ఆ మహానాయకుడిని కోల్పోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితిని రానివ్వకండి. ఆత్మగౌరవంతో తలెత్తుకునే బతుకునిచ్చారు...’ అని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాల విప్లవం రాబోతోందని... ఆ ప్రవాహంలో తెదేపా, దానికి మద్దతు పలికే పార్టీలు కొట్టుకుపోవాల్సిందేనని... అందులో ఎలాంటి అనుమానం లేదని చెప్పారు. ‘వస్తున్నాయ్‌... వస్తున్నాయ్‌ జగన్మోహనుడి రథ చక్రాల్‌’ అని పేర్కొంటూ వాటి కింద ప్రతిపక్షాలన్నీ నలిగి, నశించి, కుంగి, కృశించి పోవాల్సిందేనని, దానికి తిరుగులేదని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డికి వేసే ప్రతి ఓటూ సామాజిక సాధికారతకు, ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి తోడ్పాటవుతుందని తమ్మినేని పేర్కొన్నారు.

తమ్మినేనికి మతి భ్రమించింది: వర్ల రామయ్య

ఈనాడు, అమరావతి: ‘మహానాడును వల్లకాడుతో పోలుస్తున్న స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు మతి భ్రమించిందని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ‘మహానాడుల్లో పాల్గొని, పసుపు కండువా కప్పుకునే చనిపోతానని గతంలో పదే పదే చెప్పిన తమ్మినేని ఇలా పిచ్చిగా మాట్లాడటం మంచిది కాదు. మీ అందరికీ ముసళ్ల పండగ ముందుంది...’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని