భూ రికార్డుల తారుమారు.. ఇద్దరు తహసీల్దార్లపై కేసు

నిబంధనలు తుంగలో తొక్కి పట్టాలు మంజూరు చేసిన ఇద్దరు తహసీల్దార్లు, ఇద్దరు ఆర్‌ఐలు, ఇద్దరు వీఆర్వోలపై ఆదివారం కేసు నమోదైంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. వరదయ్యపాళెం మండలంలోని చిన్నపాండూరు

Published : 17 Jan 2022 04:19 IST

ఇద్దరు ఆర్‌ఐలు, ఇద్దరు వీఆర్వోలపై కూడా

వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: నిబంధనలు తుంగలో తొక్కి పట్టాలు మంజూరు చేసిన ఇద్దరు తహసీల్దార్లు, ఇద్దరు ఆర్‌ఐలు, ఇద్దరు వీఆర్వోలపై ఆదివారం కేసు నమోదైంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. వరదయ్యపాళెం మండలంలోని చిన్నపాండూరు పంచాయతీలో అపోలో పరిశ్రమకు 240 ఎకరాలు కేటాయించగా.. భూ బాధితులకు పరిహారం అందించారు. ఇందులో సర్వే నం.88/1, 96/4, 95/1లలో ఒకటిన్నర ఎకరా చొప్పున 4 ఎకరాల డీకేటీ భూమి రంగమ్మ, వెంకటేశు అనే గిరిజనుల పేరిట పట్టా ఉండగా, అదే భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఆర్‌.నాగమ్మ, జీ.నాగమ్మ, అమ్ములు పేరిట బదలాయించి రెవెన్యూ రికార్డుల్లో పేర్లు తారుమారు చేసి పట్టాలు ఇచ్చారు. ఇలా పట్టాలు పొందిన లబ్ధిదారులకు ‘సీ’ కేటగిరీ కింద పరిహారం ఇచ్చారు. దీనిపై సంతృప్తి పొందని లబ్ధిదారులు పరిహారంపై హైకోర్టును ఆశ్రయించారు. పట్టాల మంజూరులో నిబంధనలు పాటించకపోవడాన్ని గుర్తించిన కోర్టు.. అధికారులను తప్పుపట్టి, జిల్లా పాలనాధికారిని విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో ఈ భూములపై కలెక్టరు విచారణ చేపట్టగా భూ రికార్డులు తారుమారైనట్లు తేలింది. ఈ ఘటన 2012-2015 మధ్యకాలంలో జరిగిందని, అప్పట్లో అక్కడ తహసీల్దార్లుగా మహదేవయ్య (పదవీ విరమణ), బాబూరాజేంద్రప్రసాద్‌(గుడిపాల తహసీల్దారు), ఆర్‌ఐలు సదాశివయ్య, మురళీమోహన్‌(పదవీ విరమణ), వీఆర్వోలు రఘునాథరెడ్డి (పదవీ విరమణ), వెంకటరమణయ్య పని చేశారని గుర్తించారు. వీరందరిపై కేసు నమోదు చేయాలని తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని