ధరల సమీక్ష అధికారం ఈఆర్‌సీకి లేదు

ఒకసారి నిర్ణయించిన విద్యుత్‌ ధరలను సమీక్షించే విచారణాధికార పరిధి ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలికి ఉండదని పవన విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల తరఫున సీనియర్‌ న్యాయవాది శ్రీరఘురాం హైకోర్టుకు నివేదించారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం(పీపీఏ)లో

Published : 19 Jan 2022 04:47 IST

పీపీఏలపై సౌర, పవన విద్యుత్‌  సంస్థల తరఫు న్యాయవాదులు

ఈనాడు, అమరావతి: ఒకసారి నిర్ణయించిన విద్యుత్‌ ధరలను సమీక్షించే విచారణాధికార పరిధి ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలికి ఉండదని పవన విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల తరఫున సీనియర్‌ న్యాయవాది శ్రీరఘురాం హైకోర్టుకు నివేదించారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం(పీపీఏ)లో నిర్ణయించిన యూనిట్‌ ధరను సమీక్షించాలని ఏపీఈఆర్‌సీ నిర్ణయించి... ప్రజాభిప్రాయ సేకరణకు నోటీసు జారీ చేసిందన్నారు. దీంతో ఆ నోటీసును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించామన్నారు. మరికొందరి న్యాయవాదుల వాదనల కోసం విచారణను ఫిబ్రవరి మూడో తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏలను సమీక్షించేందుకు ఏపీ ఈఆర్‌సీకి వీలుకల్పిస్తూ 2019లో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు ధర్మాసనం ముందు అప్పీల్‌ చేసిన విషయం తెలిసిందే. తాత్కాలిక చర్యల్లో భాగంగా సోలార్‌ యూనిట్‌కు రూ.2.44, పవన విద్యుత్‌ యూనిట్‌కు రూ.2.43 చొప్పున నిర్ణయించి, బకాయిలు చెల్లించాలని సింగిల్‌ జడ్జి ఆదేశించడంపై అభ్యంతరం తెలిపాయి. సోమవారం జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ధరలను ఏపీఈఆర్‌సీ సమీక్షించనున్న నేపథ్యంలో... సింగిల్‌ జడ్జి మధ్యేమార్గంగా సోలార్‌ యూనిట్‌కు రూ.2.44, పవన విద్యుత్‌ యూనిట్‌కు రూ.2.43 చెల్లించాలని ఆదేశాలిచ్చారన్నారు. సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల తరఫున సీనియర్‌ న్యాయవాదులు వైద్యనాథన్‌, ప్రభుపాటిల్‌, సజన్‌ పూవయ్య వాదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని