TDP leader Somireddy: ఆధారాలున్నా ఎందుకు అరెస్టు చేయరు?

వైకాపా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కారులో వచ్చిన పార్టీ కార్యకర్తలు తెదేపా కేంద్ర కార్యాలయంపై పోలీసుల సమక్షంలోనే దాడి చేసినట్టు స్పష్టమైన ఆధారాలున్నా ఇంతవరకు వాళ్లను ఎందుకు

Updated : 23 Oct 2021 07:11 IST

ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కారులో  కార్యకర్తలు వచ్చి దాడి చేశారు

దాడి చేసిన వారిలో విజయవాడ కార్పొరేటర్‌, అప్పిరెడ్డి అనుచరులు, అవినాష్‌ సన్నిహితులు

ఇవిగో ఆధారాలంటూ ఫొటోలు, వీడియోలు చూపించి నిప్పులు చెరిగిన తెదేపా నేత సోమిరెడ్డి

ఈనాడు, అమరావతి: వైకాపా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కారులో వచ్చిన పార్టీ కార్యకర్తలు తెదేపా కేంద్ర కార్యాలయంపై పోలీసుల సమక్షంలోనే దాడి చేసినట్టు స్పష్టమైన ఆధారాలున్నా ఇంతవరకు వాళ్లను ఎందుకు అరెస్టు చేయలేదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. వైకాపా నాయకులు, కార్యకర్తలు తెదేపా కార్యాలయంపై దాడి చేస్తున్న దృశ్యాలను.. వారు ముఖ్యమంత్రి జగన్‌, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, వైకాపా నేత దేవినేని అవినాష్‌తో ఉన్న చిత్రాలు ఇవిగో అంటూ విలేకరుల సమావేశంలో వాటిని ఆయన చూపించారు. కొందరు అప్పిరెడ్డి కారులోనూ వచ్చారంటూ దానికి సంబంధించి సీసీ కెమేరాలో రికార్డయిన దృశ్యాలను చూపించారు. దాడి చేసిన అనంతరం వైకాపా వారిని ఒక డీఎస్పీ దగ్గరుండి మరీ వాహనాలు ఎక్కించి పంపిస్తున్నారంటూ ఒక వీడియో చిత్రాన్నీ ప్రదర్శించారు. ‘కళ్లకు కట్టినట్టు సీసీ కెమేరాల్లో, వీడియోల్లో రికార్డయిన దాడి దృశ్యాలు రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌ అవుతున్నా.. వాళ్లను ఎందుకు అరెస్టు చేయలేదో డీజీపీ సమాధానం చెప్పాలి’ అని ఆయన శుక్రవారం తెదేపా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిలదీశారు.

పోలీసులు ఇంత హీనంగా ఎందుకు మారారు?

‘‘తెదేపా కార్యాలయంపై దాడి జరుగుతున్నంతసేపూ పట్టించుకోని డీఎస్పీ.. దాడి పూర్తయిన వెంటనే వైకాపా వారి భుజాలపై చేతులు వేసి పెళ్లికొడుకుల్లా కార్లు ఎక్కించి పంపించారు. తెదేపావాళ్లు వచ్చేస్తున్నారు త్వరగా వెళ్లిపోండని సాగనంపుతున్నారు. ఎక్కండీ.. ఎక్కండీ అని అందరినీ బతిమాలుతున్నారు. ఎక్కడికి పోతోంది ఈ రాష్ట్రం? అసలు శాంతిభద్రతలు ఉన్నాయా? రాష్ట్రంలో పోలీసులు ఇంత హీనంగా ఎందుకు దిగజారారు? పోలీసు డ్రెస్సును, వారి ప్రతిష్ఠను రోడ్లపాలు చేశారు. మీరు జగన్‌తోపాటు ప్రజలకు బాధ్యులని మర్చిపోకండి. ఇంతగా దిగజారిన పోలీసు వ్యవస్థ ఏ రాష్ట్రంలోనూ లేదు. దాడి చేసినవారిని వాహనాల్లో ఎక్కించి పంపిస్తున్న వీడియోను ప్రదర్శించారు.

ముఖ్యమంత్రే హింసను ప్రోత్సహించడమేంటి?

‘పోలీసు మీట్‌లో ముఖ్యమంత్రి జగన్‌ హింసకు మద్దతిచ్చేలా మాట్లాడారు. తనను తిట్టారు కాబట్టి అందరినీ కొట్టండని ముఖ్యమంత్రే చెప్పారు. ప్రజలపై దాడులు చేసేవాళ్లకు మద్దతివ్వమని పోలీసులకు చెప్పకనే చెప్పారు. డీజీపీ, ఐజీలు, డీఐజీలు, ఎస్పీలున్న సమావేశంలో నేనే రాజ్యాంగాధినేతను, మీరు ఏం కావాలన్నా చేయండని చెప్పడం దారుణం. ప్రజలపై హింసను ఇలా ప్రోత్సహిస్తుంటే ఇక ప్రజలు వారి ప్రాణాల్ని వారే కాపాడుకోవాలి’ అని సోమిరెడ్డి సూచించారు. ‘దేశానికి రాష్ట్రపతి, రాష్ట్రానికి గవర్నర్‌ రాజ్యాంగాధిపతులు. ఈ సభలో జగన్‌ తనను తానే రాజ్యాంగాధిపతిగా ప్రకటించుకున్నారు. జగన్‌ మాట్లాడిన అంశాలనుబట్టి డాక్టర్‌ అంబేడ్కర్‌ మళ్లీ వచ్చి రాజ్యాంగాన్ని మార్చాలేమో?’ అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


ఫొటోలను చూపిస్తూ సోమిరెడ్డి చెప్పిన అంశాలివి..

‘‘ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కారులో కార్యకర్తలు దాడికి వచ్చిన దృశ్యం సీసీ కెమేరాల్లో రికార్డయింది. ఆయనపై ఈ రోజుకీ చర్యలెందుకు తీసుకోలేదు? (కారులో దాడికి వస్తున్న దృశ్యం, 2345 నంబరుగల కారు వెనుక భాగంలో ‘ఏఆర్‌’ అని రాసి ఉన్న ఫొటోలతో కూడిన చిత్రాన్ని చూపించారు.)


‘‘ఎర్రచొక్కా వేసుకుని దాడికి పాల్పడుతున్న ఈయన పేరు జోగరాజు. గాంధీ కోఆపరేటివ్‌ బ్యాంకు డైరెక్టరుగా ఇటీవలే నియమితులయ్యారు. ఆయన్ని అరెస్టు చేయడానికి మీకు ఇంకా టైంకావాలా? (జోగరాజు వైకాపా కండువా వేసుకుని ఆ పార్టీ నేత అవినాష్‌తో దిగిన ఫొటో.. కార్యాలయంపై దాడికి వస్తున్నట్లు ఉన్న చిత్రాన్ని చూపించారు.)


‘‘ఈయన పేరు అరవ సత్యం. విజయవాడ కార్పొరేటర్‌. మీ వైకాపా కార్పొరేటర్‌ తెదేపా కార్యాలయంపై దాడి చేస్తే.. అరెస్టు చేయరా? (జగన్‌తో సత్యం ఉన్న ఫొటోను, తెదేపా కార్యాలయంపై దాడికి సంబంధించి సీసీ కెమేరాలో రికార్డయిన దృశ్యంలో ఒకరిని మార్కర్‌తో రౌండ్‌ చేసిన ఫొటో చూపించారు.)


‘‘ఈయన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ముఖ్య అనుచరుడు పానుగంటి చైతన్య. (చైతన్య కర్రతో దాడి చేస్తున్న ఫొటోను.. అప్పిరెడ్డితో ఉన్న ఫొటోనూ చూపించారు.)


‘‘ఈయన అప్పిరెడ్డికి మరో ముఖ్య అనుచరుడు రోషన్‌ షైక్‌. (తెల్లచొక్కా, మాస్కు ధరించి దాడికి పాల్పడుతున్న వ్యక్తి ఫొటోను, జగన్‌తో రోషన్‌ షైక్‌ ఉన్న ఫొటోనూ చూపించారు.)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని