Engineering Counselling: ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు 25 నుంచి కౌన్సెలింగ్‌

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్‌, ఫార్మసీ(ఎంపీసీ స్ట్రీమ్‌) కళాశాలల్లో ప్రవేశాలకు వెబ్‌ కౌన్సెలింగ్‌ను ఈనెల 25 నుంచి ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ ప్రవేశాల షెడ్యూల్‌ను విజయవాడలో

Updated : 22 Oct 2021 05:30 IST

షెడ్యూల్‌ విడుదల చేసిన మంత్రి సురేష్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్‌, ఫార్మసీ(ఎంపీసీ స్ట్రీమ్‌) కళాశాలల్లో ప్రవేశాలకు వెబ్‌ కౌన్సెలింగ్‌ను ఈనెల 25 నుంచి ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ ప్రవేశాల షెడ్యూల్‌ను విజయవాడలో గురువారం విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘రాష్ట్రంలో మొదటిసారిగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోని 35% సీట్లను వెబ్‌ కౌన్సెలింగ్‌ పరిధిలోకి తీసుకొచ్చాం. వాటికి కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. విద్యార్థుల ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌తోపాటు జిల్లాల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఏర్పాటు చేసిన 25 హెల్ప్‌లైన్‌ సెంటర్లలో పరిశీలిస్తాం. కేటగిరి-బీ కింద యాజమాన్య కోటాలో భర్తీ చేసే 30% సీట్లలో సగం ఎన్‌ఆర్‌ఐ కోటా ఉంటుంది. ఎన్‌ఆర్‌ఐ కోటాలో మిగిలిన సీట్లను మేనేజ్‌మెంట్‌ కోటాతో కలిపి భర్తీ చేస్తాం’’ అని వివరించారు.

కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్న సీట్లు

‘‘ఇంజిఫార్మసీ, ఫార్మా-డీకి సంబంధించిన 36 యూనివర్శిటీ కళాశాలల్లో 6,747 సీట్లు (ఈడబ్ల్యూఎస్‌ కోటా కలిపి), 297 ప్రైవేటు కళాశాలల్లో 72,520, నాలుగు ప్రైవేటు వర్సిటీల్లో 2,330 సీట్లను భర్తీ చేస్తాం. మొత్తంగా కన్వీనర్‌ కోటాలో ప్రస్తుతం 81,597 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాకినాడ జేఎన్‌టీయూ పరిధిలోని 91 ఇంజినీరింగ్‌, 21 ఫార్మసీ కళాశాలల గుర్తింపుపై కొంత సమస్య ఉంది. దీన్ని వెబ్‌కౌన్సెలింగ్‌ ప్రారంభమయ్యే నాటికి పరిష్కరిస్తాం. ఆయా కళాశాలల్లోని కన్వీనర్‌, యాజమాన్య కోటాలను కలిపితే మొత్తం 1,39,862 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో ఇంజినీరింగ్‌కు 1,35,602 సీట్లు ఉన్నాయి’’ అని మంత్రి సురేష్‌ వెల్లడించారు.

ఇదీ ప్రవేశాల షెడ్యూల్‌

* ప్రవేశాలకు ప్రకటన: అక్టోబరు 22

* రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు: 25 నుంచి 30 వరకు

* ధ్రువపత్రాల పరిశీలన: 26 నుంచి 31 వరకు

* కోర్సులు, కళాశాలలకు ఐచ్ఛికాల ఎంపిక: నవంబరు 1 నుంచి 5 వరకు

* ఐచ్ఛికాలలో మార్పులకు అవకాశం: నవంబరు 6

* సీట్ల కేటాయింపు: నవంబరు 10

* కళాశాలల్లో రిపోర్టింగ్‌: 10 నుంచి 15 వరకు

* తరగతులు ప్రారంభం: 15 నుంచి

* ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ వివరాలు https://sche.ap.gov.in లో అందుబాటులో ఉంటాయి.

* సంప్రదింపుల కోసం మెయిల్‌: convenerapeapcet2021@gmail.com

* ఫోన్‌ నంబర్లు: 8106876345, 8106575234, 7995865456

అవసరమైన ధ్రువపత్రాలు

* ఏపీఈఏపీసెట్‌ హాల్‌ టిక్కెట్‌, ర్యాంకు కార్డు, పదోతగతి, ఇంటర్‌/సమాన విద్యార్హతకు సంబంధించిన మార్కుల జాబితాలతోపాటు నాల్గో తరగతి నుంచి ఇంటర్‌ వరకు స్టడీ సర్టిఫికెట్‌లు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని